Abn logo
Sep 21 2021 @ 01:10AM

మూలాలు చెన్నైలో...

సత్యనారాయణపురంలోని సుధాకర్‌ నివాసం

హెరాయిన్‌ కేసులో అనేక కోణాలు

సుద్ద పౌడర్‌ ముసుగులో రాక


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్‌ కేసులో సూత్రధారులు ఎవరు? ఆషి పేరుతో కంపెనీని రిజిస్టర్‌ చేసిన మాచవరం సుధాకర్‌ పాత్ర ఎంత? హెరాయిన్‌ కేసులో తలెత్తుతున్న ప్రశ్నలు ఇవి. ఆషీ కంపెనీ విజయవాడ సత్యనారాయణపురం గడియారం వారి వీధి చిరునామాతో ఉండడం కలకలం రేపుతోంది. సుధాకర్‌ సొంతూరు అనపర్తి.  సత్యనారాయణపురానికి చెందిన గోవిందరాజు దుర్గాపూర్ణ వైశాలిని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరున ఆషీ కంపెనీని రిజస్టర్‌ చేసుకున్నాడు. చెన్నై, విజయవాడల్లో కంపెనీ రిజిస్టర్‌ అయింది. వైశాలి పేరుతోనే ఐఈసీ (ఇంపోర్ట్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ లైసెన్స్‌) కోడ్‌ తీసుకున్నారు. డీజీఎఫ్‌టీ (డైరెకర్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌) అనుమతిని పొందారు. సత్యనారాయణపురం నివాసంలో సగభాగం సుధాకర్‌ పేరున, మిగిలిన సగభాగం వైశాలి తల్లి గోవిందరాజు తారక పేరున ఉంది. సుధాకర్‌ కుటుంబం ఇక్కడ ఉన్నది చాలా తక్కువేనని స్థానికులు చెబుతున్నారు. చెన్నై కొలప్పాకంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సుధాకర్‌ కుటుంబం ఉంటోంది. అప్పుడప్పుడు సత్యనారాయణపురంలోని ఇంటికి సోలార్‌ ప్యానళ్లు వచ్చేవని చెబుతున్నారు. ముంద్రా పోర్టులో హెరాయిన్‌ కంటైనర్లను గుర్తించిన తర్వాత డీఆర్‌ఐ అధికారులు సుధాకర్‌తో పాటు ముగ్గురు అప్ఘనిస్తానీయులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌ (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌)లో ఉంటున్నారని సమాచారం. మూడు రోజుల క్రితం సుధాకర్‌ను డీఆర్‌ఐ అధికారులు రహస్యంగా విజయవాడ తీసుకొచ్చారు. సత్యనారాయణపురంలో ఉన్న ఇంట్లో సోదాలు నిర్వహించారు. 


రెండు అనుమానాలు

సుధాకర్‌ కంపెనీ లైసెన్స్‌ను డబ్బుల కోసం ఇతరులకు ఇచ్చాడని అనుమానిస్తున్నారు. అదేవిధంగా కంటైనర్లను అద్దెకు తీసుకుని ఇతరులకు ఇవ్వడం ద్వారా సుధాకర్‌ ఆదాయం ఆర్జిస్తున్నాడు. ఇలా అద్దెకు తీసుకున్న కంటైనర్లను ఇతరులకు అద్దెకు ఇచ్చాడా? అనే కోణంలోనూ విచారిస్తున్నారు. 


పౌడర్‌ ముసుగులో..

ఫేస్‌ పౌడర్‌ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాన్ని సుద్దగా వ్యవహరిస్తారు. కాందహార్‌ పరిసర ప్రాంతాల్లో ఉండే ఈ సుద్ద గనులు ఎక్కువగా తాలిబన్ల అధీనంలో ఉంటాయని సమాచారం. సుద్ద పౌడర్‌ ముసుగులో హెరాయిన్‌ను భారతదేశానికి రప్పిస్తున్నట్టు తెలిసింది. అప్ఘనిస్తాన్‌లో ఇంతకుముందున్న ప్రభుత్వం సుద్ద పౌడర్‌ ఎగుమతిపై నిషేధం విధించింది. దీంతో హెరాయిన్‌ సరఫరాకు బ్రేక్‌ పడింది. అప్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో మళ్లీ హెరాయిన్‌ ఎగుమతి ఊపందుకుంది.