Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 29 Dec 2021 19:53:00 IST

గ్రామ వాలంటీర్ల గురించి తప్పుగా వెళ్లింది.. హర్ట్ అయితే తీసేస్తాం: హీరో శ్రీ విష్ణు

twitter-iconwatsapp-iconfb-icon
గ్రామ వాలంటీర్ల గురించి తప్పుగా వెళ్లింది.. హర్ట్ అయితే తీసేస్తాం: హీరో శ్రీ విష్ణు

శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరోహీరోయిన్లుగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘అర్జున ఫ‌ల్గుణ’‌. తేజ మార్ని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 31న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. 


ఆయన మాట్లాడుతూ..

‘‘ఈ ఏడాది విడుదలవుతోన్న నా మూడో చిత్రం ‘అర్జున ఫల్గుణ’. మంచి కథతో దర్శకులు వస్తే.. అన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటాను. నాకు మొదటి సారి తేజ మార్నిలో దర్శకుడు కనిపించాడు. బాగా హ్యాండిల్ చేయగలడని నాకు నమ్మకం కలిగింది. ఎమోషన్ సీన్స్ బాగా రాశాడు. ఎమోషనల్ హ్యాండిల్ చేయగలిగితే సినిమా వర్కవుట్ అవుతుంది. అందుకే సినిమాను ఓకే చేశాను. చాలా తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసి నాకు షాక్ ఇచ్చాడు. 55 రోజుల్లో షూట్ చేయడం చాలా కష్టం. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. అర్జున ఫల్గుణ అనేది భారతంలోని టాపిక్. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటీ, కృష్ణ, విజయ, ఇలా ఓ పది పేర్లు తలుచుకుంటే ధైర్యం వస్తుందని పురాణాల్లో చెప్పారు. కానీ రాను రాను అది అర్జున ఫల్గుణ వరకే చెప్పారు. ఉరుములు మెరుపులు పిడుగులు వస్తే అందరూ అర్జున ఫల్గుణ అని అనమనేవారు. కానీ కొన్ని పేర్లు విన్నప్పుడు, తలుచుకున్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. అలా అర్జున ఫల్గుణ అనే పేరులో ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ సినిమాకు ముందు వేరే పేరు అనుకున్నాం. కానీ అది కుదరలేదు. ఒకరోజు వర్షంలో కూర్చుని డైరెక్టర్, నేను మాట్లాడుకున్నాం. అలా ఈ టైటిల్ వచ్చింది.

గ్రామ వాలంటీర్ల గురించి తప్పుగా వెళ్లింది.. హర్ట్ అయితే తీసేస్తాం: హీరో శ్రీ విష్ణు

గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్‌లో కథ చేయాలని అనుకున్నాను. ఊరి బ్యాక్ డ్రాప్‌లోంచి సిటీకి వచ్చిన కథలు చేశాను. కానీ మొత్తం ఊరి బ్యాక్ డ్రాప్‌లో చేయలేదు. ఈ కథ చాలా ఫ్రెష్‌గా అనిపించింది. పూర్తి కథను సిద్దం చేయమని చెప్పాను. కథ విషయానికి వస్తే.. మేం ఐదుగురం ఫ్రెండ్స్. ఆ పేర్లలో ఫస్ట్ లెటర్స్‌తో ఆర్టాస్ అని వస్తుంది. ఇంతకు ముందు అయితే ఆర్టాస్ కూల్‌డ్రింక్‌ కంపెనీలో పని చేసే కుర్రాళ్ల కథ. కానీ అది కుదరలేదు. అందుకే సోడా మీదకు కథ మార్చేశాం. డిగ్రీ అయిపోయి ఊర్లోనే ఉంటూ సంపాదించుకుందామనుకునే కుర్రాళ్ల కథ. సిటీకి వెళ్లి పాతిక వేలు సంపాదించేకంటే.. ఊర్లో ఉండి పది వేలు సంపాదించుకుని తల్లిదండ్రులను బాగా చూసుకుంటే చాలని అనుకునే మనస్తత్వంతో ఉంటారు. ఇది వరకు చాలా సినిమాల్లో గోదావరి యాస యాసలో మాట్లాడాను. ఈ సినిమా పూర్తిగా గోదావరి యాసలోనే ఉంటుంది. ఇది కరెక్ట్ స్లాంగ్. ఈ సినిమాలో యాస పరంగా ఎలాంటి హద్దుల్లేవు. పూర్తిగా ఎటకారంగా ఉంటుంది.


గ్రామ వాలంటీర్ల గురించి చెప్పిన డైలాగ్ తప్పుగా వెళ్లింది. ట్రైలర్ అలా కట్ చేశాం కాబట్టి అలా అనిపించింది. నా ప్రతీ సినిమాల్లో ఫీమేల్ క్యారెక్టర్‌ను స్ట్రాంగ్‌గా చూపిస్తాను. ఇందులో కూడా అలానే ఉంటుంది. కానీ ఆ గ్యాంగులో ఎవరికీ ఉద్యోగం రాకుండా ఆ అమ్మాయికి మాత్రమే వస్తుందని కడుపు మంటతో అలా మాట్లాడతారు. వివాదమనిపిస్తే, నిజంగానే ఎవరైనా హర్ట్ అవుతారని నాకు అనిపిస్తే నేనే ముందుగా సీన్లు తీసేయమని అంటాను. ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకంటే.. తెలుగు హీరోలందరినీ నేను ఆరాధిస్తాను. అందరినీ ఇష్టపడతాను. పెద్ద ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు, చిరంజీవిగారు.. ఇలా అందరినీ నేను గొప్పగా చూస్తుంటాను. మన హీరోలను గౌరవించుకునే అవకాశం వస్తే నేను దాన్ని వాడుకుంటాను. వాళ్లంతా గొప్ప వాళ్లు కాబట్టే స్టార్లు అయ్యారు. నాకు ఈ సినిమాలో ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం వచ్చింది. ఇందులో ఎన్టీఆర్‌పై వచ్చే సీన్లన్ని చాలా పాజిటివ్‌గా ఉంటాయి. అలాగే తెలుగు టైటిల్స్ నాకు చాలా ఇష్టం. తెలుగులో టైటిల్ పెట్టేందుకే నేను ఎక్కువగా మొగ్గు చూపుతుంటాను. అలా మధ్య మధ్యలో సంస్కృత పదాలు కూడా పెడుతుంటాను. ఈ తరం వాళ్లకు అర్జున ఫల్గుణ అనేది ఎవ్వరికీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఒకరో ఇద్దరూ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. 


నాకు చాలా మొహమాటం. కానీ క్లోజ్ అయితే చాలా దూరం వెళ్తాను. నా డైరెక్షన్ టీం, కెమెరా డిపార్ట్మెంట్ ఇలా అందరి మీద చేతులు వేసుకుని మాట్లాడుతాను. కెమెరా ముందు పోజులు పెట్టాలంటే కూడా నాకు చాలా సిగ్గు. ఓ అరవై రోజులు ఒకే చోట ఉంటాం కాబట్టి అందరితో కలిసిపోవడానికి ట్రై చేస్తాను. నిర్మాత నిరంజన్ రెడ్డిగారు ‘వైల్డ్ డాగ్’, ఆ తర్వాత చిరంజీవిగారితో ‘ఆచార్య’ మధ్యలో మాతో ఈ చిత్రం చేశారు. కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. ఎప్పుడూ కూడా ఆయన మమ్మల్నీ ఏమీ అడగలేదు. ఆయన మమ్మల్ని చాలా నమ్మారు.


రియలిస్టిక్ సినిమాలు చేయడం అంత ఈజీ కాదు. కెరీర్‌లో ఒకటో రెండో రియలిస్టిక్ కథలు వస్తాయి. కానీ నా దగ్గరకు వచ్చిన ప్రతీ కథను రియలిస్టిక్ చేసేందుకు ప్రయత్నిస్తాను. నా సినిమాలన్నీ నాచురల్‌గా ఉంటాయని అందరూ అంటుంటారు. రియలిస్టిక్‌ కథలే నా బలం. నేను పెద్దగా ప్రయోగాలు ఏమీ చేయలేదు. నార్మల్ కథనే కాస్త కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాను. తిప్పరా మీసం సినిమాను బాగా నమ్మాం. అమ్మ సెంటిమెంట్‌తో ఆ సినిమా చేశాను. అంతకు ముందే బ్రోచేవారెవరురా అంటూ ఫుల్ కామెడీ సినిమాను తీశాను. తిప్పరా మీసం కూడా ఎక్కువ సరదాగా ఉంటుందని అనుకున్నారు. కానీ అది పూర్తిగా మదర్ సెంటిమెంట్‌తో ఉంటుంది. కానీ నా వరకు అదే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన చిత్రం. ఈ చిత్రం తర్వాత ‘భళా తందనాన’ అనే సినిమా చేస్తున్నాను. లక్కీ మీడియాలో మరో చిత్రం చేస్తున్నాను. భళా తందనాన పెద్ద స్పాన్ ఉన్న సినిమా. మంచి యాక్షన్ డ్రామా. లక్కీ మీడియాలో చేస్తోన్నది పోలీస్ ఆఫీసర్ బయోగ్రఫీ. ఇందులో ఐదు ఏజ్ గ్రూపులుంటాయి.


పెద్ద సినిమాల హవా అంటే.. మనకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. రాజ రాజ చోర కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే విడుదల చేశాం. ఒమిక్రాన్ వస్తుందంటే మనం ఏం చెప్పలేం. ఇక పెద్ద సినిమాల హవా ఇప్పట్లో తగ్గదు. మాకు కనీసం ఓ వారం సోలోగా దొరికిందని సంతోషంగా ఉన్నాం. కొత్త ఏడాదిని ఇలా పాజిటివ్ సినిమాతో ప్రారంభిస్తే బాగుంటుందని అనిపించింది. ఇది కరెక్ట్ సీజన్. ముందు డిసెంబర్ మొదటి రెండు వారాల్లో అనుకున్నాం. కానీ చివరకు ఇలా డిసెంబర్ చివరన వస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. వాళ్లే ఈ సినిమాకు హీరో అనేలా ఫీలయ్యారు. వారి కష్టం రేపు తెరమీద అందరూ గుర్తిస్తారని నమ్ముతున్నాను..’’ అని అన్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement