‘హీరో’ వాటాదారులకు బొనాంజా

ABN , First Publish Date - 2021-05-07T06:26:11+05:30 IST

దేశీయ ద్విచక్ర వాహ న దిగ్గజ సంస్థ హీరో మోటోకార్ప్‌ తన వాటాదారులకు భారీ డివిడెండ్‌ ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2020-21) గాను ఒక్కో షేరుకు రూ.25 తుది డివిడెండ్‌తోపాటు...

‘హీరో’ వాటాదారులకు బొనాంజా

  • ఒక్కో షేరుకు రూ.35 డివిడెండ్‌ 
  • క్యూ4 లాభం రూ.885 కోట్లుగా నమోదు 

ముంబై: దేశీయ ద్విచక్ర వాహ న దిగ్గజ సంస్థ హీరో మోటోకార్ప్‌ తన వాటాదారులకు భారీ డివిడెండ్‌ ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2020-21) గాను ఒక్కో షేరుకు రూ.25 తుది డివిడెండ్‌తోపాటు మరో రూ.10 ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించాలని కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. 2020-21లో హీరో మోటోకార్ప్‌ ప్రకటించిన మధ్యంతర, తుది డివిడెండ్‌ మొత్తం రూ.90కి.. ప్రత్యేక డివిడెండ్‌ రూ.15కు చేరుకోనుంది. అంటే, గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన వాటాదారులకు మొత్తం రూ.105 డివిడెండ్‌ (ఒక్కో షేరుకు) చెల్లించినట్లవుతుంది. 

కాగా మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో హీరో మోటోకార్ప్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 44 శాతం పెరిగి రూ.885 కోట్లకు చేరుకుంది. ఆదాయం 39.2 శాతం వృద్ధితో రూ.8,689 కోట్లుగా నమోదైంది. జనవరి-మార్చి కాలానికి మొత్తం 15.68 లక్షల యూనిట్ల బైక్‌లు, స్కూటర్లు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. 2020-21 మొత్తానికి గాను అమ్మకాలు 58 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. 


చైర్మన్‌గా పవన్‌ ముంజాల్‌ పునర్నియామకం 

హీరో మోటోకార్ప్‌ చైర్మన్‌, సీఈఓగా పవన్‌ ముంజాల్‌ పునర్నియమితులయ్యారు. ఈ ఏడాది అక్టోబరు నుంచి ఈ నియామకం అమలులోకి రానుంది. మరో ఐదేళ్లపాటు ఆయన ఈ పదవుల్లో కొనసాగుతారు.  


Updated Date - 2021-05-07T06:26:11+05:30 IST