ఏడాదంతా పండుగ..!

ABN , First Publish Date - 2021-01-18T06:58:55+05:30 IST

వారసత్వ కట్టడాలకు నెలవైన నగరానికి ఈ ఏడాదొక ప్రత్యేకత ఉంది.

ఏడాదంతా పండుగ..!
బ్రిటీష్‌ రెసిడెన్సీ(ఫైల్‌)

చారిత్రాత్మక భవనాల స్మారకోత్సవాలు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): వారసత్వ కట్టడాలకు నెలవైన నగరానికి ఈ ఏడాదొక ప్రత్యేకత ఉంది. గోల్కొండ కోటలో కుతుబ్‌షాహీలు అడుగుపెట్టి 525 ఏళ్లు. నగర నిర్మాణానికి 430 ఏళ్లు. సికింద్రాబాద్‌ ఆవిర్భావానికి 215 ఏళ్లు. బ్రిటిష్‌ రెసిడెన్సీకి 215 ఏళ్లు. ఈ నాలుగు భవనాల చరిత్ర స్ఫూర్తిని భావితరాలకు చాటేందుకు నాలుగు హెరిటేజ్‌ క్లబ్‌లు కలిసి ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. 

నగరం పుట్టి 430 ఏళ్లు.. 

హైదరాబాద్‌ చరిత్రలో కుతుబ్‌షాహీల స్థానం ప్రత్యేకం. కుతుబ్‌షాహీలు మొదట బహమనీ సుల్తానుల కొలువులో ఉద్యోగులు. వారి ఆదేశాలతోనే సుల్తాన్‌ కులీ కుతుబ్‌ బేగ్‌ 1496లో గోల్కొండ సుబేదార్‌(గవర్నర్‌)గా బాధ్యతలు స్వీకరించారని చారిత్రక అధ్యయనాల్లో వెల్లడైం ది. అంటే, కుతుబ్‌షాహీలు కోటలోకి అడుగుపెట్టి ఇప్పటికి 525 ఏళ్లు. తర్వాత బహమనీల రాజ్యంలో అస్థిరత ఏర్పడటంతో, బేగ్‌ కుమారుడు కులీ కుతుబ్‌ఉల్‌ముల్క్‌ గోల్కొండను తమ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. అనంతరం ఐదో కులీ హయాంలో ఆనాటి అవసరాలకు తగినట్టుగా 1591లో హైదరాబాద్‌ నగరం నిర్మితమైంది. కొత్తనగరం తొలికట్టడంగా చార్మినార్‌ చరిత్రలో నిలిచింది.  ఆధునిక, సాంకేతిక, వైజ్ఞానిక, పారిశ్రామిక రంగాలకు పెట్టని కోటగా మారిన నగరం పుట్టి 430 ఏళ్లు అవుతోంది. 

215 ఏళ్ల పండుగ...

నిజాం రాజ్యంతో ఈస్‌ ్టఇండియా కంపెనీ 1798లో సైనిక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు చరిత్రకారులు చెబుతారు. ఐదువేల మంది సైనిక పటాలం కలిగిన బ్రిటీష్‌ సైనిక స్థావరం హుస్సేన్‌సాగర్‌కి ఉత్తరాన కొలువుదీరి, కంటోన్మెంట్‌ ప్రాంతంగా అభివృద్ధి చెందింది. 1803, జనవరి 3న నిజాం బ్రిటీష్‌  రెసిడెంట్‌గా కెప్టెన్‌ థామస్‌ సడెనహమ్‌ బాధ్యతలు స్వీకరించారు. అదే ఏడాది ఈ ప్రాంతానికి పేరు పెట్టాల్సిందిగా మూడో నిజాం సికిందర్‌ జాకు రెసిడెం ట్‌ లేఖ రాశారు. స్పందించిన నిజాం తనపేరు కలిసొచ్చేలా ఆ ప్రాంతాన్ని ‘సికింద్రాబాద్‌’గా పిలవాలని ఫర్మానా జారీచేశారు. అదే ఏడాది మూసీ ఒడ్డున అరవై ఎకరాల విస్తీర్ణంలో రాజసం ఉట్టిపడేలా బ్రిటీష్‌ రెసిడెన్సీ నిర్మితమైంది. ఈ కట్టడం వైట్‌హౌస్‌ ను పోలుంటుందని కన్సర్వేషన్‌ ఆర్కిటెక్ట్‌ తురగా వసంతశోభ చెప్పారు. ఐదో బ్రిటీష్‌ రెసిడెంట్‌ కిర్క్‌ ప్యాట్రిక్‌ విజ్ఞాపన మేరకు నిజాం సొంత ఖర్చుతో ఆ భవనాన్ని నిర్మించారు. బ్రిటీష్‌ రాయల్‌ ఇంజినీర్‌ లెఫ్టినెంట్‌ శామ్యూల్‌ రెస్సెల్‌ పర్యవేక్షణలో మొదలైన భవనం 1805 నాటికి పూర్తి అయిందని చరిత్ర అధ్యయనకారులు చెబుతున్నారు. 

నాలుగు హెరిటేజ్‌ క్లబ్బులు..

ఈ నాలుగు చారిత్ర ప్రాముఖ్యం ఉన్న సందర్భాలు కలిసి రావడంతో నగరవాసుల్లో చరిత్రపై మక్కువ పెంచేందుకు హెరిటేజ్‌ క్లబ్‌లు ముందుకు వచ్చాయి. హైదరాబాద్‌ ట్రైల్స్‌ నిర్వాహకుడు ఏబీ గోపాలకృష్ణ, వసామహా ఆర్కిటెక్ట్స్‌ వసంత శోభ, హెరిటేజ్‌ ఫ్యూచర్స్‌ మాధవ్‌ తదితరులు కలిసి ఈ ఏడాది పొడవునా ‘హైదరాబాద్‌ హెరిటేజ్‌ ఫెస్ట్‌’ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు నాలుగు చారిత్రాత్మక కట్టడాలకు సంబంధించిన విశేషాలను స్మరించుకునేలా వివిధ కార్యక్రమాలను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. అందులో భాగంగా చార్మినార్‌ హెరిటేజ్‌ క్లబ్‌, సికింద్రాబాద్‌ హెరిటేజ్‌ క్లబ్‌, బ్రిటీష్‌ రెసిడెన్సీ, చాదర్‌ఘాట్‌ హెరిటేజ్‌ క్లబ్‌, సికింద్రాబాద్‌ హెరిటేజ్‌ క్లబ్‌లను ప్రారంభించినట్లు వసంత శోభ వివరించారు. తద్వారా ఈ నేల చరిత్రగొప్పతనాన్ని, సంస్కృతి ఔన్నత్యాన్ని , కట్టడాల ప్రాముఖ్యతను నేటితరానికి పరిచయం చేసేందుకు సదస్సులు, వాక్‌లు, చిత్ర ప్రదర్శనలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌  హెరిటేజ్‌ ఫెస్ట్‌ బాధ్యులు చెబుతున్నారు. ఆసక్తిగల వారు 79004 95379 నెంబర్‌లో సంప్రదించవచ్చునని నిర్వాహకులు తెలిపారు. 

Updated Date - 2021-01-18T06:58:55+05:30 IST