Abn logo
May 6 2021 @ 10:22AM

కరోనా కథ ముగిసిందట.. ఇకపై మాస్కులు అక్కర్లేదట.. బీజేపీ నేతల వింత వ్యాఖ్యలెన్నో..!

భారతదేశంలో ప్రస్తుతం కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీనికి ప్రభుత్వ పెద్దల అలక్ష్యమే కారణమని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. విదేశీ పత్రికలు కూడా మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కథనాలు ప్రచురించాయి. కరోనాను అధికార బీజేపీ పెద్దలు, నాయకులు సీరియస్ గా తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణమని అంతా ఆరోపిస్తున్నారు. కరోనా గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా మాట్లాడాల్సింది పోయి, దాన్ని ప్రజలు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కరోనా గురించి పలుమార్లు ప్రధాని సహా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతేడాది లాక్‌డౌన్ విధించిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. దేశానికి కరోనాపై విజయం సాధించడానికి 21 రోజుల లాక్‌డౌన్ సరిపోతుందని వ్యాఖ్యానించారు. అయితే ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్ పెంచుకుంటూ పోయారు. ప్రస్తుతం దేశంలో ప్రతిరోజూ లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా చాలా ఎక్కువగా సంభవిస్తున్నాయి. శవాల దిబ్బలు, శ్మశానాల ముందు క్యూలు, ఆస్పత్రుల ముందు పడిగాపులు, ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు.. ఇదీ నేటి భారత దేశ ముఖచిత్రం. ఇంతటి ఘోర పరిస్థితులు ఉండగా పలు సందర్భాల్లో బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద, నిర్లక్ష్య వాఖ్యల జాబితాను మీరూ ఒక లుక్కేయండి..


1. కరోనా పోరాటంలో చివరి దశలో ఉన్నాం - ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్


కరోనా పరిస్థితిపై పూర్తి బాధ్యత వహించాల్సిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్.. దేశంలో రోజురోజుకూ నమోదవుతున్న కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్న సందర్భంలో నిర్లక్ష్య పూరిత వ్యాఖ్యలు చేశారు. కరోనా విషయంలో మెరుగైన స్థితిలోనే ఉన్నామని, ఈ పోరాటం చివరిదశకు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

2. ఆక్సిజన్ డిమాండ్‌ను కంట్రోల్ చేయాలి - పీయూష్ గోయల్


దేశంలో ఒకవైపు మెడికల్ ఆక్సిజన్ కొరతతో ప్రజల ప్రాణాలో పోతుంటే, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాత్రం ఈ డిమాండ్‌ను కంట్రోల్ చేయాలంటూ రాష్ట్రాలకు సూచనలు చేశారు. దేశంలో నలుమూలల నుంచి ఆక్సిజన్ కొరత కారణంగా డిమాండ్ పెరగడంపై గోయల్ స్పందించారు.. ‘‘సప్లై నిర్వహణ ఎంత ముఖ్యమో, డిమాండ్ నిర్వహణ కూడా అంతే ముఖ్యం. రాష్ట్రాలు ఆక్సిజన్ డిమాండ్‌ను నియంత్రించాలి’’ అన్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఆక్సిజన్‌ను అధికంగా ఉపయోగించి వృధా చేస్తున్నారని కూడా ఆయన అనడంతో.. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.


3. ఇంత భారీ జనసందోహాన్ని ఎన్నడూ చూడలేదు - మోదీ


దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఎన్నికలు నిర్వహించడమే తప్పనే వాదనలు వినిపించాయి. అలాంటిది పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో సాక్షాత్తు ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఇంత భారీ జనసందోహాన్ని ఎన్నడూ చూడలేదు’ అన్నారు. అంతమంది ప్రజలు గుమిగూడటం ప్రమాదకరం అనే విషయం ప్రధానికి తెలియదా? పోనీ వచ్చిన వారంతా మాస్కులు ధరించిందీ, లేనిదీ గమనించారా? ఏమీ లేకుండా సభకు ప్రజలు వచ్చినందుకు ప్రధాని సంతోషిస్తున్నానంటూ చేసిన వ్యాఖ్యల వల్ల ఆయన విమర్శలపాలయ్యారు.

4. మహమ్మారి కథ ముగిసింది, మాస్కులు అక్కర్లేదు - హిమాంత బిస్వా శర్మ


కరోనా సెకండ్ వేవ్ దేశంలో విజృంభించడం మార్చి నెలలో ప్రారంభమైంది. అలాంటిది ఏప్రిల్ ప్రారంభంలో దీని గురించి మాట్లాడిన అస్సాం ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు హిమాంత బిస్వా శర్మ.. ‘‘కరోనా కథ ముగిసింది. ఇక మనకు మాస్కులు అక్కర్లేదు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలందరూ తమ మాస్కులు తీసేయొచ్చని సలహాలు కూడా ఇచ్చారు.


5. గంగామాత ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కరోనా ఉండదు - తిరథ్ సింగ్ రావత్


దేశంలో కరోనా ఉధృతికి ప్రధాన కారణాల్లో హరిద్వార్ కుంభమేళా ఒకటని నిపుణులు తేల్చేశారు. అసలు కరోనా ఇంతలా ఉండగా కుంభమేళాను రద్దు చేయకుండా నిర్వహించడమేంటని ప్రభుత్వంపై కూడా నిరసనలు వెల్లువెత్తాయి. అయితే తొలి నుంచి కరోనా తీవ్రతను తోసిపుచ్చుతూ వచ్చిన ఉత్తరాఖండ్ సీఎం తిరథ్ సింగ్ రావత్ మాట్లాడుతూ.. ‘‘కుంభమేళ గంగానది ఒడ్డున జరుగుతుంది. ఇక్కడ గంగా మాత ఆశీస్సులు ప్రవహిస్తుంటాయి. కాబట్టి కరోనా ఉండే అవకాశం లేదు’’ అని చెప్పడం వివాదాస్పదం అయింది.

6. కష్టపడే బీజేపీ కార్యకర్తలకు కరోనా రాదు - గోవింద్ పటేల్


అందరూ మాస్కులు పెట్టుకోండి, సామాజిక దూరం పాటించండి, కరోనా ఎవరికైనా రావొచ్చు అంటూ ఒకపక్క వైద్యనిపుణులు హెచ్చరికలు చేస్తుంటే.. గుజరాత్‌కు చెందిన ఒక బీజేపీ ఎమ్మెల్యే మాత్రం హాస్యాస్పద కామెంట్స్ చేశారు. మార్చి చివర్లో గోవింద్ పటేల్ మాట్లాడుతూ.. ‘‘పనిచేసేవారు, శ్రమ చేసేవారిపై కరోనా ప్రభావం ఉండదు. బీజేపీ కార్యకర్తలు ఇవి చేస్తారు. కాబట్టి వారికి కరోనా వచ్చే ఛాన్సే లేదు’’ అని తేల్చేశారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ కామెంట్లు చేయడానికి కొన్ని నెలల ముందు గోవింద్ పటేల్‌కే కరోనా వచ్చింది. దాన్నుంచి కోలుకున్న తర్వాత ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


7. కరోనాపై భారత్ పోరాటం.. ప్రపంచానికే స్ఫూర్తి - ప్రధాని నరేంద్ర మోదీ


కరోనా మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటం ప్రపంచానికే స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ప్రధాని మోదీ చెప్పారు. ఆయన ఈ మాటలు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన రెండు నెలల్లోనే ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు మనదేశంలో నమోదవడం మొదలైంది. ప్రస్తుతం దేశంలో కరోనా ఎలా విజృంభిస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సమయంలో ప్రజలకు అత్యవసరమైన టీకాల విషయంలోనూ ప్రభుత్వం అలక్ష్యం వహిస్తోందన్న విమర్శలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి.

8. కరోనా ఔషధంగా కరోనిల్‌కు మద్దతు - కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, నితిన్ గడ్కరీ 


యోగా గురు, బిజినెస్‌మేన్ బాబా రాందేవ్.. ఫిబ్రవరి నెలలో ఒక మెడిసిన్‌ను తీసుకొచ్చారు. కరోనిల్ అని పేరు పెట్టిన ఈ మెడిసిన్ కరోనాపై పనిచేస్తుందని, ఆయుర్వేద విధానాల్లో తయారైన ఈ మెడిసన్ కరోనాను తగ్గిస్తుందని ఆయన ప్రకటించారు. దీన్ని రాందేవ్‌కు చెందిన పతంజలి సంస్థ తయారు చేసింది. ఈ మెడిసిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం కూడా ఉందని రాందేవ్ ప్రకటించారు. అయితే ఆ వెంటనే ట్విట్టర్ వేదికగా డబ్ల్యూహెచ్‌వో ఈ ప్రకటనలను ఖండించింది. ఈ మెడిసిన్ ఆవిష్కరణ సమయంలో కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, నితిన్ గడ్కరీ పక్కనే ఉండగా ఇంతటి అబద్ధాలు చెప్పడం ప్రజలను ఆశ్చర్యచకితులను చేసింది. ఈ బూటకపు ఔషధానికి ప్రభుత్వ మద్దతు ఉన్నట్లు చూపించడానికి ఈ నాటకం ఆడారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి.


9. వయసైపోతే ప్రజలు చచ్చిపోతారు - ప్రేమ్ సింగ్ పటేల్


ఒక పక్క దేశంలో కరోనా మహమ్మారి విజృంభించి ప్రజలు రోజురోజుకూ పండుటాకుల్లా రాలిపోతుంటే.. మరోపక్క కొందరు నేతలకు ప్రజల కష్టాలు అసలు కంటపడటంలేదు. మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ ఆ కోవకు చెందినవారే. ఏప్రిల్ నెల నుంచి భారత్‌లో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాలు ప్రపంచ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. మృతుల అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు శ్మశానాల వద్ద క్యూలు కట్టారు. ఎటు చూసినా శవాల దిబ్బలే కళ్లముందు కదలాడుతున్నాయి. అలాంటి సమయంలో ప్రేమ్ సింగ్ పటేల్ మాట్లాడుతూ.. ‘ఈ చావులను ఎవరూ ఆపలేరు. అందరూ కరోనా నుంచి రక్షణ గురించి మాట్లాడుతున్నారు. ప్రజలకు వయసు పెరుగుతుంది, వాళ్లు చచ్చిపోక తప్పదు’ అని ఈ దయనీయ పరిస్థితులను ఒక్కమాటలో కొట్టిపారేశారు.


10. చైనా సపోర్టర్ కుమారుడు చైనా వైరస్‌కు బలయ్యాడు - మిథిలేష్ కుమార్ తివారి

దేశంలో అత్యంత సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరు, అందరూ గౌరవించే కమ్యూనిస్టు పార్టీ నాయకుడు సీతారం ఏచూరి. ఆయన కుమారుడు ఆశిష్ కరోనా మహమ్మారికి బలయ్యారు. ఆ సమయంలో బిహార్ బీజేపీ నేత మిథిలేష్ కుమార్ తివారీ వివాదాస్పద ట్వీట్ చేశారు. ‘చైనా మద్దతుదారుడైన సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ చైనీస్ కరోనాకు బలయ్యాడు’ అంటూ చాలా దిగజారుడు కామెంట్ చేశారు. ఈ ట్వీట్‌పై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. దీంతో మిథిలేష్ కుమార్ తన ట్వీట్ డిలీట్  చేశారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement