Abn logo
Jun 1 2020 @ 01:50AM

హెర్డ్‌ ఇమ్యూనిటీ వ్యూహం ప్రమాదకరం

  • ముందుజాగ్రత్తే శ్రీరామరక్ష: సీఎస్‌ఐఆర్‌


న్యూఢిల్లీ, మే 31: కరోనా మహమ్మారిపై పోరాడేందుకు హెర్డ్‌ ఇమ్యూనిటీ వ్యూహం ఏ దేశానికైనా చాలా ప్రమాదకరమని శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎ్‌సఐఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఎం.శేఖర్‌ అన్నారు. ఎప్పటికపుడు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెప్పారు. జనాభాలో 60 నుంచి 70 శాతం వారికి అంటురోగాలను తట్టుకునే సామర్థ్యం వచ్చినప్పుడే హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించవచ్చని, అయితే దీనిపై ఆధారపడడం ఏ దేశానికైనా చాలా ప్రమాదకరమని ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. ‘భవిష్యత్తులో కేసుల సంఖ్య తగ్గుతుంది. అంతమాత్రాన సంతోషించరాదు. ఈ సమయంలోనే అందరూ జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికపుడు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే కరోనా మళ్లీ రెచ్చిపోయే ప్రమాదం ఉంది’ అని ఆయన హెచ్చరించారు. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెగతెంపులు చేసుకోవడంపై స్పందిస్తూ అది మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు.

Advertisement
Advertisement
Advertisement