Abn logo
Oct 20 2021 @ 01:42AM

ఆమె నైపుణ్యం బంగారం!

మానావకాశాల సంగతి తరువాత... కనీస అవకాశాలైనా కల్పిస్తే తమ సామర్థ్యాన్ని మహిళలు పూర్తిస్థాయిలో నిరూపించుకోగలరు’ అంటారు ఎస్‌.శంకరి. తమిళనాడుకు చెందిన ఆమె... దాదాపుగా పురుషులే కనిపించే బంగారం పనిలో గొప్ప నైపుణ్యం సాధించారు. అభ్యంతరం చెప్పిన వాళ్ళే అసూయపడే స్థాయికి చేరుకున్నారు. 


బంగారు ఆభరణాలంటే మహిళలకి ఎంతో మక్కువ. కానీ వాటిని తయారు చేసే మహిళలు అంతగా కనిపించరు. ఇది దాదాపు పురుషులకే పరిమితమైన వృత్తి. దానిలో ప్రవేశించడమే కాకుండా, తనదైన ముద్ర వేస్తున్నారు ఎస్‌.శంకరి. ఈ మధ్యే రాత్రికిరాత్రి వెయ్యి బంగారు ఉంగరాల మీద హ్యాండ్‌ కట్‌ డిజైన్లు తయారు చేసి... అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. 


శంకరి స్వస్థలం తమిళనాడులోని విల్లుపురం. ఆభరణాల తయారీ మీద తనకు ఆసక్తి పెరిగింది పెళ్ళయిన తరువాతేనంటారామె. ‘‘చిన్నప్పుడు నేను జిల్లా కలెక్టర్‌ కావాలనుకొనేదాన్ని. కానీ ఇంట్లో పరిస్థితుల కారణంగా పదో క్లాసుతో బడి మానేయాల్సి వచ్చింది. కొన్నాళ్ళకు శివతో నాకు పెళ్ళయింది. ఆయన బంగారం పని చేస్తారు. ఇంట్లో నా పనులన్నీ పూర్తయ్యాక... ఆయన ఆభరణాలు ఎలా చేస్తారో చూస్తూ కూర్చొనే దాన్ని. నా ఆసక్తిని గమనించి... నన్నూ నేర్చుకోమని ఆయన ప్రోత్సహించారు’’ అని చెప్పారు శంకరి.


అది గొప్ప విజయం

2010లో... పురుషులు మాత్రమే పని చేసే బంగారు నగల వర్క్‌షాపులో, ఆమె తొలిసారి అడుగు పెట్టినప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ‘‘నా బంధువుల్లో చాలా మంది ఈ మూర్ఖపు ఆలోచన మానుకోవాలనీ, పిల్లల పెంపకం మీద దృష్టి పెట్టాలనీ ఒత్తిడి చేశారు. ఇప్పుడు వాళ్ళే... ఆభరణాల తయారీని నేను కెరీర్‌గా మార్చుకోవడం, ఆర్థిక స్వతంత్రం సాధించడం చూసి ఈర్ష్య పడుతున్నారు’’ అని ఆమె చెప్పారు. 


‘‘పదేళ్ళకు పైగా ఈ రంగంలో ఉంటున్నాను. నా కుటుంబానికి ఆర్థికంగా సాయపడే సాధికారత సాధించాననిపిస్తోంది. మిగిలిన ప్రాంతాల సంగతి నాకు పెద్దగా తెలీదు. కానీ మా విల్లుపురం జిల్లాలో ఈ పరిశ్రమలో ఉన్న మహిళను నేను మాత్రమే. ఇది నాకు గొప్ప విజయం. మరిన్ని క్లిష్టమైన నగల తయారీ మెళకువలు నేర్చుకోవాలనుకుంటున్నాను’’ అన్నారామె. 


ఏకాగ్రత కావాలి...

శంకరి ఒక పక్క ఇంటి పనులు చూసుకుంటూనే మరోవైపు రోజూ 300 నుంచి 400 ఉంగరాలు కట్‌ చేస్తూ ఉంటారు. ‘‘ఈ పనికి చాలా ఏకాగ్రత అవసరం. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా వేలు తెగిపోతుంది. పని పూర్తయ్యాక వెంటనే లేవడానికి కుదరదు. ఎందుకంటే నా దుస్తుల నిండా బంగారు రజను ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా సేకరించకపోతే... నా సంపాదనలో కోత పడిపోతుంది. అంతేకాదు, ఒక్క నిమిషం పాటు చేసే పనైనా కళ్ళు, వేళ్ళు, భుజాలు, మెడ నొప్పులు పెట్టేస్తాయి. ఈ పని కోసం ఉపయోగించే మిషన్‌ టాటూ గన్‌లా వైబ్రేట్‌ అవుతూ ఉంటుంది. గంటల కొద్దీ దాంతో పని చేస్తున్నప్పుడు భుజాల ఎముకలు బలహీనమైపోతాయి. వీటికి తోడు ఇంటిపనులు కూడా చేస్తాను కాబట్టి అలసట చాలా ఎక్కువగా ఉంటుంది’’ అంటున్న శంకరి ఆదాయం నెలకు సుమారు పాతిక వేల రూపాయల వరకూ ఉంటుంది. పండగల సమయంలో దీనికి రెట్టింపు కూడా వస్తుంటుంది. బంగారు ఉంగరాలు, లాకెట్లు, ముక్కు పుడకల మీద హ్యాండ్‌ కట్‌ డిజైన్లు ఎక్కువగా వేస్తూ ఉంటారు. ‘‘అన్ని వృత్తులలోనూ మహిళలు ప్రమాదాలనూ, సవాళ్ళనూ ఎదుర్కొంటున్నారు. కానీ శ్రామిక శక్తిలో మహిళలు, పురుషుల సమతుల్యత ఉండాలంటే... వాళ్ళు ప్రతి రంగంలోనూ ప్రవేశించాలి’’ అని చెబుతున్నారామె.