ఆమె స్థానం అత్యున్నతం

ABN , First Publish Date - 2020-03-05T05:30:00+05:30 IST

ఒక సమాజం మంచి చెడ్డలను మహిళలకు ఇచ్చే ప్రాధాన్యం ఆధారంగానే అంచనా వేయగలం. మహిళల పట్ల గౌరవ మర్యాదలతో..

ఆమె స్థానం అత్యున్నతం

ఒక సమాజం మంచి చెడ్డలను మహిళలకు ఇచ్చే ప్రాధాన్యం ఆధారంగానే అంచనా వేయగలం. మహిళల పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరించే సమాజం ఉత్తమ సమాజం అవుతుంది. కనుకనే ఇస్లాం ధర్మం మహిళలకు సముచితమైన స్థానాన్ని కల్పించింది. దైవ ప్రవక్త మహమ్మద్‌ ఆవిర్భావానికి పూర్వం మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. వారి హక్కులన్నీ పురుషుల పాదాల కింద అణచివేతకు గురవుతూ వచ్చాయి. ఆత్మలేని శరీరంలా వారు జీవితాలను గడిపేవారు. తల్లి గర్భంలోంచీ బయటకు వచ్చిన ఆడ శిశువులను సజీవ సమాధి చేసే దారుణాలు కూడా జరిగేవి. మహిళల శ్రేయస్సే ధ్యేయంగా కరుణామయుడైన అల్లాహ్‌ నిర్దేశించిన హక్కులను దైవ ప్రవక్త ప్రకటించారు. మహిళలు వారి హక్కులను నెరవేర్చుకోవడంలో ఆటంకం కల్పించిన వారు ఇహ, పరలోకాలలో శిక్షలకు అర్హులవుతారని హెచ్చరించారు. ఆ హక్కులు ఏమిటో ఇస్లామ్‌ ధర్మం స్పష్టంగా తెలిపింది. షరియత్‌ కోటలో ఆమె స్థానాన్ని సురక్షితం చేసింది. మహిళలు శుభప్రదమైన వారనీ, వారిని పెంచి, పోషించిన వారు అనేక బహుమతులు పొందుతారనీ, ఉన్నతమైన లోకాలలోకి ప్రవేశిస్తారనీ అల్లాహ్‌ వాగ్దానం చేశాడు. ఆడబిడ్డల పుట్టుకను అశుభంగా భావించి, వారి పట్ల మంచిగా ప్రవర్తించని తల్లితండ్రుల ముఖాలను ప్రళయ దినాన కన్నెత్తి కూడా చూడనని హెచ్చరించాడు. అలాగే తల్లి పాదాల కింద స్వర్గం ఉన్నదనీ, తల్లిని సేవించి స్వర్గాన్ని కైవసం చేసుకోవాలనీ ఉత్తేజపరిచాడు. తల్లిని సేవించని, గౌరవించని సంతానానికి స్వర్గంలో ప్రవేశం లేదని స్పష్టం చేశాడు. అలాగే, తల్లితండ్రులు, భర్త, కుమారులు, అన్నదమ్ముల ఆస్తిలో మహిళలకు హక్కును ఇస్లాం అందించింది.


వ్యక్తిత్వాన్నీ, స్వభావాలనూ తీర్చిదిద్దడంలో, నైతిక, ఆధ్యాత్మిక, ఆర్థిక వికాసాలలో విద్య కీలకపాత్ర వహిస్తుంది. విద్యావంతుడయిన ప్రతి పురుషుడూ ‘తల్లి ఒడి’ అనే బడి నుంచి ప్రాథమిక శిక్షణ పొందుతాడు. ఆమె పరిశీలనాత్మకమైన పెంపకంలో నైతికత, ఆధ్యాత్మికత అలవరచుకుంటాడు. ఆ తరువాతే ప్రాపంచికమైన పరీక్షలను ఎదుర్కొంటాడు. కాబట్టే మొదటి గురువైన మహిళకు విద్యా హక్కును ఇస్లాం ప్రకటించింది. తన ధర్మంలో స్త్రీకి అత్యున్నత స్థానం కల్పించింది.

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2020-03-05T05:30:00+05:30 IST