Chitrajyothy Logo
Advertisement

ఆమె నటన నాలో అసూయ పెంచింది!

twitter-iconwatsapp-iconfb-icon

ర భాష నుంచి కథానాయికల్ని తెలుగులోకి దిగుమతి చేసుకోవడం కొత్తేం కాదు. ఈమధ్య అది మరింత ఎక్కువైంది. అయితే... తొలి సినిమాలోనే అగ్ర నిర్మాణ సంస్థలో పనిచేయడం ఓ అరుదైన విషయం. మృణాల్‌ ఠాకూర్‌కి ఆ అదృష్టం వరించింది. ‘సీతారామం’తో తెలుగులో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన మృణాల్‌ వెనుక పదేళ్ల సినీ అనుభవం ఉంది. సహాయ దర్శకురాలిగా తన ప్రయాణం మొదలెట్టింది. టీవీ సీరియల్స్‌ చేసింది. ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టులలో తాను కూడా భాగం పంచుకొంది. త్వరలోనే ‘సీతారామం’ విడుదల అవుతున్న నేపథ్యంలో మృణాల్‌తో ‘నవ్య’ చిట్‌ చాట్‌.


తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు... ఇక్కడి వాతావరణం ఎలా ఉంది? 

నటిగా నాకేం కొత్తగా అనిపించలేదు. కాకపోతే... ఇక్కడి మర్యాదలు ఇదివరకెప్పుడూ చూడలేదు. సినిమా అంటే ప్రాణం ఇచ్చే మనుషుల్నీ నేను కలవలేదు. ఎవరితో మాట్లాడినా.. ‘సినిమా’ తప్ప మరో టాపిక్‌ ఉండదు. ప్రొఫెషనలిజం, ప్యాషన్‌.. ఇవన్నీ టాలీవుడ్‌లో ఇంకొంచెం ఎక్కువగా కనిపించాయి.


భాష ఇబ్బంది అనిపించలేదా?

తెలుగు పూర్తిగా కొత్త. అందుకే నాతో ఎవరు మాట్లాడినా ‘తెలుగులోనే మాట్లాడండి’ అని చెప్పేదాన్ని. నేను తెలుగులో సమాధానం చెప్పలేకపోయినా, భావాన్ని అర్థం చేసుకోవడానికి ఈ హోం వర్క్‌ బాగా ఉపయోగపడింది. ‘సీతారామం’ సినిమా ఒప్పుకొనే ముందుతో పోలిస్తే... ఇప్పుడు నాకు తెలుగు కొంత వచ్చినట్టే. ఎవరేం మాట్లాడినా సులభంగా అర్థం అవుతోంది. మరో రెండు మూడు సినిమాలు చేస్తే.. నేను కూడా గల గల తెలుగు మాట్లాడేస్తా. నిజానికి నాకు కొత్త భాషలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. ఎక్కడకు వెళ్లినా, అక్కడి భాషని వినడానికి, అర్థం చేసుకోవడానికీ ప్రయత్నిస్తా.


అసలు ‘సీతారామం’ అవకాశం ఎలా వచ్చింది?

‘జెర్సీ’ హిందీ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు దర్శకుడు హను రాఘవపూడి అక్కడకి వచ్చారు. నాకు కథ చెప్పారు. ఆ కథ వినగానే నేను బౌల్డ్‌ అయిపోయా. ‘యస్‌..’ చెప్పడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఓ కథానాయిక పాత్రని ఇంత గొప్పగా చిత్రీకరించిన సినిమా వచ్చి... పదేళ్లు అయ్యుంటుంది. ఈ సినిమాలో నేనున్నాననో, సీత పాత్ర నాకొచ్చిందనో ఈ మాట చెప్పడం లేదు. మనస్ఫూర్తిగా, నిజాయతీగా అంటున్నా. హను రాఘవపూడి గురించి నేను చాలా విన్నాను. ఆయన పెద్ద దర్శకుడు. లవ్‌ స్టోరీల్ని బాగా తీస్తారు. పైగా ఇది వైజయంతీ మూవీస్‌ సినిమా. 


ఓ పరభాషా నటికి తెలుగులో ఇంతకంటే గొప్ప డెబ్యూ ఉండదేమో..?

పురాణాల్లో సీత పాత్రకు ఉండే లక్షణాలు మీలో ఏమున్నాయి?

నేను సీతని, సత్యభామని, రుక్మిణిని కూడా.  వాళ్లలో ఉండే లక్షణాల్ని మిక్స్‌ చేస్తే మృణాళిని ఠాకూర్‌ అవుతుంది. ‘సీతారామం’లో సీత పాత్ర కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆ సీతలా మారడానికి నేను చాలా కష్టపడ్డా. కానీ ఆ కష్టంలో ఇష్టం ఉంది. ‘జెర్సీ’ సమయంలో నేను కాస్త స్లిమ్‌గా ఉండేదాన్ని. ‘నా సీత కాస్త బొద్దుగా ఉంటే బాగుంటుంది.. మీరు కొంచెం బరువు పెరగాలి’ అని హను నాతో చెప్పారు. అంటే ఎంత  కావాలంటే, ఏది కావాలంటే అది తినొచ్చన్నమాట. ఓ కథానాయికకు ఇంత కంటే బంపర్‌ ఆఫర్‌ ఉంటుందా? అందుకే ‘సీతారామం’ షూటింగ్‌కి ముందు ఇష్టమైనవన్నీ లాగించేసి.. కొంచెం బరువు పెరిగా.


పదేళ్ల సినీ ప్రయాణం ఏం నేర్పించింది?

ఓ సినిమాకి నేను సహాయ దర్శకురాలిగా పనిచేశా. ఫోర్త్‌ ఏడీని. పెద్దగా పని ఉండేది కాదు. కంటిన్యుటీ చూసుకోమనే వారు. ఆ సినిమాకి నాకు జీతం కూడా ఇవ్వలేదు. అక్కడ కట్‌ చేస్తే... ఇప్పుడు తెలుగులో ఓ పెద్ద సినిమాలో కథానాయికను. నా వెనుక పదేళ్ల అనుభవం ఉంది. నటిగా నన్ను గుర్తించారు. దర్శకులు నాపై నమ్మకం ఉంచారు. నాకు తెలియని భాషలో కూడా నేను నటిస్తున్నాను. ఇంతకంటే ఏం కావాలి?  కెరీర్‌ ప్రారంభంలో ‘కుంకుమ భాగ్య’ అనే ధారావాహికలో నటించాను. ఇది అన్ని భాషల్లోనూ డబ్‌ అయ్యింది. అలా.. సినిమాల్లోకి రాకముందే కొంచెం పాపులారిటీ సంపాదించుకొన్నాను. నా తొలి చిత్రం ‘లవ్‌ సోనియా’లో నా పాత్రకు మంచి పేరొచ్చింది. కానీ.. సినిమా సరిగా ఆడలేదు. 

ఆమె నటన నాలో అసూయ పెంచింది!

మరో ఆవకాశం రావడానికి చాలా సమయం పట్టింది. ఈలోగా.. ఇంట్లోనే ఉండి, వంటా వార్పూ చేసుకొంటూ, ఓ సగటు అమ్మాయిలానే గడిపాను. ‘మళ్లీ నాకు ఆఫర్లు వస్తాయా, రావా’ అనే బెంగ ఉండేది. అదృష్టవశాత్తూ ‘సూపర్‌ 30’, ‘భాట్లా హౌస్‌’ లాంటి మంచి సినిమాలు నా ఖాతాలో పడ్డాయి. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.


‘జెర్సీ’ హిందీ రీమేక్‌ సరైన ఫలితం ఇవ్వలేదు కదా..?

జెర్సీ సినిమా అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. గౌతమ్‌ ఈ సినిమాని డీల్‌ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. ‘మీరు ఏ భాషలో ఈసినిమా చేసినా.. ఈ పాత్రని నేనే చేస్తా..’ అని ఆయన్ని బతిమాలేదాన్ని. ‘జెర్సీ’ని అంతగా మనసులోకి తీసుకొన్నా. ఇక ఫలితం అంటారా.. దాని గురించి నేను పట్టించుకోను. గౌతమ్‌ లాంటి సెన్సిబుల్‌ దర్శకుడితో పనిచేయడం కంటే ఇంకేం కావాలి? నాపై ఆయనకు నమ్మకం ఎక్కువ. ‘నీకు తెలుగులో త్వరలోనే ఓ మంచి అవకాశం వస్తుంది’ అనే వారు. ఆయన అన్నట్టుగానే ‘సీతారామం’ సినిమాలో ఛాన్స్‌ వచ్చింది.


తెలుగు సినిమాలు చూసేవారా?

బాగా. ‘మహానటి’ని మీ అందరికంటే ముందు నేనే చూశా. ఎందుకంటే.. ‘మహానటి’ని విడుదలకు ముందే ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో ప్రదర్శించినప్పుడు నేను అక్కడే ఉన్నా. ఆ సినిమా చూసి ఆశ్చర్యపోయా. కీర్తి సురేష్‌ నటన నన్ను అబ్బురపరిచింది. ఆ పాత్ర చూసి నాకు అసూయ వేసింది. ‘ఇలాంటి పాత్ర కదా నేను చేయాలి’ అనిపించింది. కీర్తికి జాతీయ అవార్డు వస్తుందని అప్పుడే ఊహించాను. నేను అనుకొన్నట్టుగానే కీర్తి అవార్డు అందుకొంది. ‘మహానటి’ తెరకెక్కించిన సంస్థ ఇప్పుడు ‘సీతారామం’ రూపొందించడం యాదృచ్ఛికం.


ఎలాంటి పాత్రల కోసం ఎదురు చూస్తున్నారు?

పాజిటీవ్‌, నెగెటివ్‌, గ్రే షేడ్స్‌.. ఇలా రకరకాల పాత్రలు చేయాలని ఉంది. ‘ఈ పాత్ర నేను చేయగలనా?’ అనిపించాలి. ఆ పాత్ర కోసం నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలి. అప్పుడే.. ప్రేక్షకులు గుర్తిస్తారు. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేసుకొంటూ పోతే, త్వరగా బోర్‌ కొట్టేస్తాం.

అన్వర్‌


సీతారామం ఓ ఉత్తరం చుట్టూ తిరిగే కథ. ఉత్తరం అనేది ఓ అనిర్వచనీయమైన అనుభూతి. మనం ఎదురుగా కూర్చుని మాటల్లో చెప్పలేని భావాలు అక్షరాలు చెబుతాయి. నేను చాలామందికి ఉత్తరాలు రాసేదాన్ని. స్నేహితుల పుట్టిన రోజు వస్తే.. గ్రీటింగ్‌ కార్డు నేనే తయారు చేసేదాన్ని. నాకొచ్చిన గ్రీటింగ్‌ కార్డులన్నీ  జాగ్రత్తగా దాచుకొన్నా. అవన్నీ అద్భుతమైన జ్ఞాపకాలు. ‘సీతారామం’ చేస్తున్న దగ్గర్నుంచి నాకు కూడా ఉత్తరాలు రాయడం మొదలెట్టారు. అయితే ప్రేమ లేఖలు ఎవరూ రాయలేదు. రాస్తే బాగుంటుందని ఇప్పుడు అనిపిస్తోంది.


సీతారామంలో పూర్తిగా సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తా. ఓ సినిమా మొత్తం ఇలాంటి దుస్తులు ధరించడం ఇదే తొలిసారి. నిజంగానే.. నాకు ఇవే బాగున్నాయనిపిస్తోంది. చీరలో చాలా సౌకర్యంగా అనిపిస్తోంది. మెడ్రన్‌ దుస్తులు ధరించినా.. అందులోనూ మనదైన సంప్రదాయం ఉట్టిపడేలా గాజులో, చమ్కీలో, నగలో వేసుకోవాలని అనిపిస్తోంది.


నేను చాలా త్వరగా నేర్చుకొంటా. కాసేపు ఎవరితోనైనా మాట్లాడితే చాలు. వాళ్ల ప్లస్సులూ, మైనస్సులూ అర్థమవుతాయి. ‘వీళ్ల నుంచి నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా?’ అని ఆలోచిస్తా. నిరభ్యంతరంగా స్వీకరిస్తా. ‘సీతారామం’లో నాకు సీత పాత్ర గురించి చెప్పినప్పుడు ‘కుంకుమ భాగ్య’లో ఓ బామ్మ పాత్ర ఉంటుంది. ఆమె మాట్లాడే తీరు, కూర్చునే పద్ధతీ.. ఇవన్నీ సీతకు అన్వయించుకోవచ్చు అనిపించింది. వెంటనే.. నేను ఆమెను అనుకరించడం మొదలెట్టాను. అది నాకెంతో ఉపయోగపడింది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

మీకు తెలుసా !..Latest Telugu Cinema Newsమరిన్ని...