ఆతిథ్యంలో ఆమె ముద్ర

ABN , First Publish Date - 2021-01-07T07:01:36+05:30 IST

బార్‌లో డ్రింక్స్‌ అందించడం సవాల్‌తో కూడినదే కాదు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన ఉద్యోగం కూడా. అలాంటి ఉద్యోగంలో చేరడమే కాదు సొంతంగా బార్‌నే ప్రారంభించారు మీనాక్షీ సింగ్‌.

ఆతిథ్యంలో ఆమె ముద్ర

బార్‌లో డ్రింక్స్‌ అందించడం సవాల్‌తో కూడినదే కాదు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన ఉద్యోగం కూడా. అలాంటి ఉద్యోగంలో చేరడమే కాదు సొంతంగా బార్‌నే ప్రారంభించారు మీనాక్షీ సింగ్‌. వైవిధ్యమైన కాక్‌టైల్‌ రుచులు, మెరుగైన ఆతిథ్యంతో రెండేళ్లలోనే ఆమె బార్‌ ప్రపంచంలోని వంద అత్యుత్తమ బార్‌లలో ఒకటిగా నిలిచింది. మహిళలు చాలా అరుదుగా కనిపించే ఈ రంగంలో పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగిన ఆమె విశేషాలివి... 


అవి 2000 సంవత్సరం తొలిరోజులు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చదువుతున్న మీనాక్షి సింగ్‌ పాకెట్‌ మనీ కోసం ప్రైవేట్‌ పార్టీలు, ఫంక్షన్లలో డ్రింక్‌ అందించేందుకు వెళ్లేవారు. ఆమెకు కాక్‌టైల్స్‌ మిక్స్‌ చేయడం అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టాన్నే కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నారు. డిగ్రీ అవగానే మీనాక్షి బార్‌లో డ్రింక్స్‌ అందించే ఉద్యోగంలో చేరారు. అయితే తక్కు కాలంలోనే ఈ రంగంలో నిలదొక్కుకోవడం ఎంత కష్టమో ఆమెకు అర్థమైంది.


‘‘నేను బార్‌లో మద్యం అందించే ఉద్యోగం చేస్తున్నానని నా తల్లిదండ్రులకు చెప్పడానికి మనసొప్పేది కాదు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదవిన నేను ఏ మేనేజర్‌గానో పనిచేయాలి గానీ బార్‌లో డ్రింక్స్‌ అందిచడం ఏంటి! అని మా పేరెంట్స్‌ ఆందోళనపడేవారు. నేను ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నానో మా వాళ్లకు అర్థమయ్యేది కాదు. కానీ నా పట్టుదల చూసి మా నాన్న ప్రోత్సహించారు’’ అని తొలి రోజులను గుర్తుచేసుకుంటారు మీనాక్షి.


కల నిజమైన వేళ

ఎప్పటికైనా సొంతంగా బార్‌ ప్రారంభించాలనేది మీనాక్షి కల. బివరేజ్‌ ఇండస్ట్రీలో అనుభవం ఉన్న యంగ్‌దూప్‌ లామా పరిచయం మీనాక్షి కలలకు రెక్కలు తొడిగింది. అప్పటిదాకా గడించిన అనుభవంతో ఇద్దరూ కలిసి గురుగ్రామ్‌లో సొంతంగా ‘కాక్‌టైల్స్‌ అండ్‌ డ్రీమ్స్‌ స్పీక్‌ఈజీ’ పేరుతో బార్‌ ప్రారంభించారు. వెరైటీ కాక్‌టైల్స్‌, మెరుగైన ఆతిథ్యంతో కొద్ది రోజుల్లోనే వీళ్ల బార్‌కు మంచి పేరొచ్చింది. దాంతో పలు చోట్ల బ్రాంచెస్‌ తెరవండని చాలామంది సలహాలు ఇచ్చారు.


కానీ ఢీల్లీ మధ్యలో రద్దీగా ఉండే వీధుల్లో బార్‌ తెరవాలనే ఆలోచనతో ఉన్న మీనాక్షి అయిదేళ్ల తరువాత తన కలల బార్‌ ‘సైడ్‌కార్‌’ను తెరిచారు. ‘‘మా వద్ద డబ్బులు ఉంటే ఇంతకు ముందే ఇలాంటి బార్‌ ప్రారంభించేవాళ్లం. మొదట్లో మేము అందించే కాక్‌టైల్స్‌, బార్‌లో వినిపించే జాజ్‌ మ్యూజిక్‌ అందరికీ ప్రత్యేకంగా అనిపించేది. మా బార్‌ను భారతదేశంలోనే ఉత్తమ బార్‌గా నిలిపేందుకు మేము వేసిన తొలి అడుగులు అవి’’ అంటారామె. అనుకున్నట్టుగానే ‘సైడ్‌కార్‌’ బార్‌ మొదటి ఏడాదిలోనే 30 బెస్ట్‌ బార్స్‌లో ఒకటిగా నిలిచింది. 2020లో ప్రపంచంలోని 100 అత్యుత్తమ బార్‌లలో మనదేశం నుంచి మా ‘సైడ్‌కార్‌’ ఒక్కటే (91వస్థానం) ఎంపికైంది.   



లాభాల కోసం కాదు

‘‘కాక్‌టైల్స్‌ మిక్స్‌ చేయడం, డ్రింక్స్‌ను అందించడం, అతిథులతో మాట్లాడడం నాకు ఎంతో థ్రిల్‌నిస్తుంది. మేము లాభాల కోసం ఈ బార్‌ తెరవలేదు. అతిథులకు డ్రింక్‌ సర్వ్‌ చేయడం, కొత్త రుచులను పరిచయం చేయడం.. ఇవే మా ప్రాధమ్యాలు. వీటికి ఇప్పటికీ కట్టుబడి ఉండడమే మా విజయరహస్యం’’ అంటున్న మీనాక్షి ఈ రంగంలోకి వచ్చేందుకు ఆసక్తి ఉన్న మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. 


‘సైడ్‌కార్‌’ బార్‌ లోపలి భాగం ఆహ్లాదంగా ఉంటుంది. ఒక పాత గ్రంథాలయం, బిలియర్డ్‌ రూమ్‌ను తలపిస్తుంది. అన్నీ క్లాసిక్‌ కాక్‌టైల్స్‌తో కూడిన మెనూ ఆకర్షిస్తుంది. పోటీని తట్టుకోవడానికి మీనాక్షి టీమ్‌ ప్రత్యేకమైన రుచులను బార్‌లోనే తయారు చేస్తారు. అంతేకాదు డ్రింక్స్‌ తయారీలో ఉపయోగించే దినుసులను బార్‌ వెనక ఉన్న గార్డెన్‌లో పండిస్తారు. 


Updated Date - 2021-01-07T07:01:36+05:30 IST