ఆమె నిషేధ స్థలాలు

ABN , First Publish Date - 2021-01-11T07:29:07+05:30 IST

అందరి ముందు నవ్వొద్దు దేన్నయినా దాచుకోవచ్చు నవ్వెట్లా...

ఆమె నిషేధ స్థలాలు

అందరి ముందు నవ్వొద్దు 


దేన్నయినా దాచుకోవచ్చు

నవ్వెట్లా..?

ఎవరికీ కనపడకుండా

ఎన్ని రోజులుగానో 

ముఖంలో దాచిపెట్టిన 

దాదీమా నవ్వు..

అమాస అర్ధరాత్రి చీకటిలో 

పెదవుల కొమ్మలపై పూసిన 

నిశ్శబ్ద పూల నక్షత్రాలు..

ఇప్పటికీ ఆస్మాన్‌లో 

చెక్కు చెదరలేదు..!

కారణం లేకుంట 

తన కోసమే తను నవ్వుకున్న నవ్వు

నాకు చెప్తూ ఆమె నవ్విన నవ్వుకు 

ప్రతి రూపాలే అవన్నీ...!


చిక్కని చీకట్లో మెరిసే మిణుగురులు 

ఆ ఒంటరి సంచరిత నవ్వులు..

ఎవరివో...? ఏ నిషేధ వో..?


వాకిట్ల ఏడ్వగూడదు..

గొంతులో గుచ్చుకునే

దుఃఖ ముల్లు 

మింగలేకా కక్క లేక 


ఆనాటి జాలట్ల 

గోడలకి అతుక్కున్న 

రాగి రంగు రాళ్లు 

బహుశా నానీమా 

ఎవరి కంట పడకుండా 

రాల్చిన కన్నీళ్ళ శిలాజాలు...


ఎన్నెన్ని గడ్డకట్టిన 

కన్నీళ్ళు.. ఏ కళ్ళవో...?

మౌనమే భాషయిన 

జీవుల చిత్రలిపి కన్నీళ్ళు!


గట్ల అరుగు మీద కూసొవద్దు 

స్టూళ్ల మీదా కుర్చీలల్ల.. కూసొవద్దు 

ఎన్ని యుగాలు నిలబడాలె...?

అర్ధరాత్రిళ్ళు కూర్చొని

కుతి తీరిన మదితోని 

కుమిలి ఏడ్చి...


కాళ్ళు ఇరిగిన కుర్చీలు

బీటలు వారిన బల్ల పీటలు 

ఆత్మలింకా తచ్చాడుతున్నయా...

ఏడుస్తున్నయా...

ఇంటి ఇల్లాలు కూసోనీకి 

బతుకంతా ఎదురు చూపే 

ఆమె ముట్టకుంటనే 

ముక్కాలి పీట 

మూలన పడి...


లోకం వెలుగును

దోచుకుంటదని తెలిసీ 

దీపం వెలిగించి

వెలుతురుకు అంటరానిదై 

చీకటిగా మిగిలి...!


మొహం వెలుగు ఎవరికీ

కనపడక పోతే మానే

గుండెనిండా

గాలి పీల్చుకోవాలని తపన

నాలుగు గోడల మధ్య 

తెల్లారితేనేమి.. పొద్దుగూకితేనేమి

ప్రపంచానికి తనో చీకటి ముద్ద

తన రాతలన్నా వెలుగు చూడనివ్వండి

నాలుగు అక్షరాలన్నా 

తనలోకి వంపుకోనివ్వండి

చీకటి పోత పోసిన నల్ల రెబెకా

ఇంటి మ్యూజియంలో 

పాతిన శాశ్వత శిల్పమ్‌

ఆమెకు ప్రపంచం నిషేధమా

ఆమె ప్రపంచానికి నిషేధమా...


ఎన్నెన్ని చీకట్లు కలిసి 

ఇంత పెద్ద చీకటి అయిందో..

ఎన్నెన్ని చిక్కని చీకటి నిండిన 

హృదయాలు కలిస్తే

ఇంత నల్లని రాత్రులయినయో 


అయ్యో...

ఆమెకు.,.

ఎన్నెన్ని నిషేధ స్థలాలు..? 

షాజహానా


Updated Date - 2021-01-11T07:29:07+05:30 IST