Abn logo
Sep 24 2020 @ 00:26AM

ఆమె కళ్లు అచ్చం మ్యాగీలా...

Kaakateeya

మ్యాగీ.. కుర్‌కురే... లేస్‌.. బ్రిటానియా ఫిఫ్టీ ఫిఫ్టీ... ఈ స్నాక్స్‌ను మనందరం లొట్టలేసుకుంటూ తింటాం. కానీ దుబాయ్‌కి చెందిన మేకప్‌ ఆర్టిస్ట్‌ దివ్యా ప్రేమ్‌చంద్‌ మాత్రం ఈ స్నాక్స్‌ను ప్యాకింగ్‌ కవర్‌లా తన ముఖానికి రంగులు అద్దుకుంటుంది.  ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ బ్యూటీ బ్లాగర్‌ పోస్ట్‌ చేసిన స్నాక్‌ మేకప్‌ ఫొటోలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. మేకప్‌లో ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడే ఆమె రంగుల ప్రయాణం ఇది...


దివ్య ‘ఇండియన్‌ స్నాక్‌ సిరీస్‌’ పేరుతో తన స్నాక్‌ మేకప్‌ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తోంది. స్నాక్‌ మేకప్‌ ఒక్కటే కాదు ప్రముఖ నటులు, వ్యక్తులు, వివిధ రకాల ఆహారపదార్థాలను తలపించేలా మేకప్‌ వేసుకొని అలరిస్తుంది.


మేకప్‌ ఆర్టిస్ట్‌గా తన ఆభిరుచిని కొనసాగిస్తున్న దివ్య కనుబొమల మేకప్‌ను చూస్తే కుర్‌కురే స్నాక్‌ గుర్తొస్తుంది. ఆమె కనురెప్పల మీద నల్లని ఐ లైనర్‌తో గీసిన గీతలు రెండు నిమిషాల్లో పూర్తయ్యే మ్యాగీని తలపిస్తాయి. కనురెప్పల రంగు ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్‌ ప్యాకెట్‌ను తలపిస్తాయి. దివ్య తల్లితండ్రులు దుబాయ్‌లో స్థిరపడినా, ఆమెకు మాత్రం భారత్‌ మీద ఎంతో ప్రేమ. ఆ ప్రేమను ఆమె స్నాక్‌ మేకప్‌ రూపంలో చాటాలనుకున్నారు. ‘‘నాకు భారతదేశ పద్ధతులు, ఆచారాల మీద గౌరవం ఎక్కువ. నేను ఇప్పటి వరకూ భారత్‌కు వచ్చింది లేదు. మా బంధువులు దుబాయ్‌ వచ్చినప్పుడల్లా ఇండియాలో దొరికే కుర్‌కురే, మ్యాగీ వంటి స్నాక్స్‌ తీసుకొచ్చేవారు. వాటిని నేను ఇష్టంగా తినేదాన్ని. కొందరు చీటోస్‌, ఇతర స్నాక్స్‌ను ప్రతిబింబించేలా మేకప్‌ వేసుకోవడం నేను చూశాను. అప్పుడే నాకు స్నాక్‌ మేకప్‌తో నా బాల్యపు రోజులను గుర్తుతెచ్చుకోవచ్చనే ఆలోచన కలిగింది’’ అని స్నాక్‌ మేకప్‌ పట్ల తాను ఎలా ఆకర్షితులరాలయిందో చెబుతుంది దివ్య. 


అంత తేలిగ్గా సాధ్యం కాలేదు...

ఆలోచన రాగానే ఇండియన్‌ స్నాక్స్‌ మీద స్టడీ చేసింది దివ్య. వాళ్ల నాన్న సాయం కూడా తీసుకుంది. ‘‘వీటిలో సగం వరకూ మానాన్న సాయంతో చేసినవే. నేను, నాన్న ఆయన చిన్నప్పుడు, నా చిన్నతనంలో తిన్న స్నాక్స్‌ గురించి మాట్లాడుకునేవాళ్లం. మాకూ మల్లే  విదేశాల్లో స్థిరపడిన భారతీయులందరికీ ఈ స్నాక్స్‌తో అనుబంధం ఉంటుంది. ఒకరోజు స్థానిక దుకాణంలో నాన్నకు పాపిన్స్‌ స్నాక్‌ తెచ్చి ఇచ్చాను. ఆయన వాటిని ఎంతో ఇష్టంగా తిన్నారు. మనం గుర్తుపెట్టుకోము కానీ మన ఇంట్లో కనిపించే చిప్స్‌ ప్యాకెట్‌ లేదా చిన్న చాక్లెట్‌ కవర్‌ కూడా మనకు ఎంతో ఫీల్‌ని ఇస్తాయి’’ అంటుందీ మేకప్‌ ఆర్టిస్ట్‌. హాంకాంగ్‌లో మేకప్‌ ఆర్టిస్ట్‌గా శిక్షణ పొందిన దివ్యకు మేకప్‌లో కొత్త కొత్త ప్రయోగాలు చేయడమంటే చాలా ఇష్టం. అయితే ఆమెకు స్నాక్‌ ప్యాకింగ్‌ కవర్‌ రంగుకు మ్యాచ్‌ అయ్యేలా మేకప్‌ వేసుకోవడం అంత సులువుగా సాధ్యం కాలేదు. స్నాక్‌ మేకప్‌ చక్కగా వచ్చేందుకు స్నాక్స్‌ తెప్పించుకొని వాటి కలర్‌ థీమ్‌, ఆకారం, డిజైన్‌ను గమనించేది. దుబాయ్‌లో ‘మినీ ఇండియా’గా పేరొందిన మీనా బజార్‌కు వెళ్లేది. అక్కడ ఇండియన్‌ స్నాక్స్‌, వాటి ప్యాకింగ్‌కు మ్యాచ్‌ అయ్యే బంగారు ఆభరణాలు కొని, ఇంటికి వచ్చాక స్నాక్‌ మేకప్‌ వేసుకోవడం మొదలెట్టేది. రెండు మూడు గంటల్లో స్నాక్‌ మేకప్‌ ముగించేది. 


మేకప్‌లో ప్రయోగాలంటే ఇష్టం

‘‘నేను స్నాక్‌ మేకప్‌ మొదలెట్టే ముందు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో వాటికి సంబంధించిన హింట్స్‌ పోస్ట్‌ చేసేదాన్ని. అందరూ నేను తరువాత చేసే స్నాక్‌ మేకప్‌ను ముందే పసిగట్టేవారు. వివిధ ప్రాంతాలకు చెందిన వారు మెసేజ్‌లు పంపేవారు. అంతేకాదు తమ అనుభవాలను పంచుకునేవారు’’ అంటున్న దివ్య ‘ఇండియన్‌ స్నాక్‌ సిరీస్‌’ పేరుతో తన స్నాక్‌ మేకప్‌ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తోంది. స్నాక్‌ మేకప్‌ ఒక్కటే కాదు ప్రముఖ నటులు, వ్యక్తులు, వివిధ రకాల ఆహారపదార్థాలను తలపించేలా మేకప్‌ వేసుకొని అలరిస్తుంది. సృజనాత్మకతతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న దివ్యకు సోషల్‌మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement