ఆమె వ్యాపార సూత్రం పర్యావరణహితం

ABN , First Publish Date - 2021-03-25T05:30:00+05:30 IST

కొబ్బరిపీచు, కొబ్బరిపెంకులు... దేనికీ పనికి రావని పడేస్తాం. కానీ వాటితోనే రోజూ ఉపయోగించే వస్తువులను తయారుచేస్తోంది నితిక. ఆ వస్తువులకు వెదురు జోడించి వంటింట్లో ఉపయోగపడే వస్తువుల

ఆమె వ్యాపార సూత్రం పర్యావరణహితం

పనికి రాని వస్తువులు ఆమె చేతిలో కొత్త రూపం పొందుతాయి. పర్యావరణహితమైన వస్తువుల తయారీలో తనదైన ముద్ర వేస్తోంది నితికా సాంఖియా. ‘మైఆన్‌ఎర్త్‌’ పేరుతో సంస్థను స్థాపించి ఏడాదిలోపే యాభై లక్షల టర్నోవర్‌ సాధించింది. ఎకోఫ్రెండ్లీ వస్తువులను ప్రజలు ఉపయోగించేలా చేయడం కష్టమైన పనికాదంటున్న ఈ యువ వ్యాపారవేత్త విజయబావుట ఇది...


కొబ్బరిపీచు, కొబ్బరిపెంకులు... దేనికీ పనికి రావని పడేస్తాం. కానీ వాటితోనే రోజూ ఉపయోగించే వస్తువులను తయారుచేస్తోంది నితిక. ఆ వస్తువులకు వెదురు జోడించి వంటింట్లో ఉపయోగపడే వస్తువుల నుంచి ఫ్యాషన్‌, హోమ్‌ డెకర్‌, ట్రావెల్‌, పర్సనల్‌కేర్‌, స్టేషనరీ వస్తువులను తయారుచేసి అందిస్తుంది. కొబ్బరిపెంకులతో  కట్లరీ గృహోపకరణాలు, వెదురుతో టూత్‌బ్రష్‌ను తయారుచేస్తుంది. నితిక ఎకో-ఫ్రెండ్లీ వస్తువులకు స్వదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగానూ ఎంతో గిరాకీ ఉంది. ‘ఎర్తీ క్రాఫ్ట్స్‌’, క్లాడియా, ఆండ్రియా వంటి సంస్థలు ఆమె క్లయింట్లుగా ఉన్నాయి. తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో మొదట మార్కెట్‌లో అడుగుపెట్టింది. వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఈ వస్తువులను కస్టమర్లకు అందిస్తున్నారామె.


ఎకో-ఫ్రెండ్లీ సస్టైనబుల్‌ బ్రాండ్లకు ప్రాధాన్యం ఇచ్చే ఈ-కామర్స్‌ స్టోర్స్‌తోనే నితిక వ్యాపార ఒప్పందాలు చేసుకుంది. ‘‘మా వస్తువులు ప్రకృతి సిద్ధమైనవి. వాటి తయారీ ఎంతో సున్నితంగా ఉంటుంది. అందుకే వాటిని కస్టమర్లకు అందించడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం.  ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా  అవి పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే రోజూ పెద్దమొత్తంలో రవాణా చేసే అమెజాన్‌లాంటి వ్యాపార వేదికలను నా వస్తువుల రవాణాకు ఎంచుకోలేదు’ అంటుంది నితిక.



మహిళలకు ఉపాధి కల్పిస్తూ...

నితిక తన సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. జైపూర్‌లో స్థానిక మహిళలకు ఉపాధి చూపుతున్న ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి నితిక పనిచేస్తోంది. దాదాపు 50 మంది మహిళా కళాకారులు  ‘మైఆన్‌ఎర్త్‌’ కు పలు రకాల కళాత్మక వస్తువులను డిజైనింగ్‌ చేస్తున్నారు. ఈ వస్తువులన్నీ మహిళలు ఇంటిపట్టునే ఉండి తయారుచేసేవే. కరోనా సంక్షోభ సమయంలో స్థానిక మహిళలకు ఇది మంచి ఆదాయమార్గంగా నిలిచింది.


స్టార్టప్‌ లక్ష్యం కూడా అదే!

నితిక మొదట పది లక్షలతో వ్యాపారాన్ని ప్రారంభించింది. క్రమంగా బిజినెస్‌ విస్తరణకు మెట్రోపాలిటన్‌ నగరాలపై దృష్టిసారించింది. సామాజిక వేదికలను ప్రభావితం చేసే వారి తోడ్పాటుతో తన ఉత్పత్తులను అమ్మడం,    ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ బిజినెస్‌ను విస్తరించే ప్రయత్నం చేసింది. ఎకో-ఫ్రెండ్లీ పరికరాలకు డిమాండ్‌   ఉందని నితిక అభిప్రాయపడుతుంది. తన ఉత్పత్తులను ఎక్కువమంది కస్టమర్లకు చేరేలా చేయడమే కాకుండా వాటి ధర కూడా అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తున్నాని, తన స్టార్టప్‌ లక్ష్యం కూడా అదేనని చెబుతుందీ యువ వ్యాపారవేత్త.


‘‘మైఆన్‌ఎర్త్‌’ ఉత్పత్తులను మొదట సూపర్‌ మార్కెట్లలో, ఆ తర్వాత కిరాణా షాపుల్లో, స్థానిక స్టోర్స్‌లో అందుబాటులో ఉంచాలనుకుంటున్నా. ఇలాంటి ఉత్పత్తులు మందులషాపులు, కిరాణా షాపుల్లో సైతం అందుబాటులో ఉండాలి’’ అంటారామె. అయితే ఇలాంటి కళాత్మక వస్తువుల ధర ఎక్కువగా ఉండడానికి  కారణం వాటిని చేత్తో తయారుచేయాల్సి రావడమే.   ‘‘మొదట్లో మేము తయారుచేసిన వెదురు బ్రష్‌ ధర 90 రూపాయలు. వీటి వినియోగం పెరగడంతో   ఇప్పుడు 60 రూపాయలకు అమ్ముతున్నాం. దీని ధర ఇంకా తగ్గించాలన్నది నా ఆలోచన’ అంటుంది నితిక. మొత్తానికి ఒక సంవత్సరం లోపే తన బిజినెస్‌ టర్నోవర్‌ని 50 లక్షలకు చేర్చడంలో నితిక విజయం సాధించింది.  పర్యావరణహితమైన వస్తువులదే భవిష్యత్తు అంటున్న నితిక కొత్తగా ఆలోచించాలనుకునే వారికి స్ఫూర్తిగా నిలుస్తోంది.     


మా వస్తువులు ప్రకృతి సిద్ధమైనవి. వాటి తయారీ ఎంతో సున్నితంగా ఉంటుంది. వాటిని కస్టమర్లకు అందించడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. 


Updated Date - 2021-03-25T05:30:00+05:30 IST