హెపరిన్‌ ధర 50శాతం పెంపు!

ABN , First Publish Date - 2020-07-09T06:13:50+05:30 IST

రక్తాన్ని గట్టకట్టకుండా చేసే కీలక ఔషధం హెపరిన్‌ ధరను ఫార్మా కంపెనీలు 50 శాతం పెంచనున్నాయి. గుండె, ఊపిరితిత్తులు, కాళ్లు తదితరాల్లో రక్తం గడ్డకట్టేందుకు అవకాశం ఉన్న రోగులకు హెపరిన్‌ను...

హెపరిన్‌ ధర 50శాతం పెంపు!

  • అదే బాటలో మరిన్ని ఔషధాలు!
  • ముడి ఔషధాల ధరే కారణం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రక్తాన్ని గట్టకట్టకుండా చేసే కీలక ఔషధం  హెపరిన్‌ ధరను ఫార్మా కంపెనీలు 50 శాతం పెంచనున్నాయి. గుండె, ఊపిరితిత్తులు, కాళ్లు తదితరాల్లో రక్తం గడ్డకట్టేందుకు అవకాశం ఉన్న రోగులకు హెపరిన్‌ను వాడతారు. డయాలిసిస్‌ వంటి తీవ్ర రుగ్మతలతో బాధపడే వారి కి కూడా ఈ ఔషధం అవసరం. కొవిడ్‌-19 రోగులు ఐసీయూలో ఉన్నప్పుడు చికిత్సకు జారీ చేసిన క్లినికల్‌ మేనేజిమెంట్‌ మార్గదర్శకాల్లో కూడా ఆరోగ్య, కుటుంబ సంరక్షణ మంత్రిత్వ శాఖ దీన్ని చేర్చింది. తనకున్న అత్యవసర అధికారాలను వినియోగించి హెపరిన్‌ ఔషధం ధరలను 50 శాతం పెంచుకోవడానికి కంపెనీలకు నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) అనుమతి ఇచ్చింది. ఈ పెంపు ఈ ఏడాది డిసెంబరు చివరి వరకూ అమలులో ఉంటుంది. హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్‌ ఫార్మా ప్రధానంగా హెపరిన్‌ ఇంజెక్షన్లను తయారు చేస్తోంది. హెప్‌, హెప్‌-లాక్‌ బ్రాండ్‌లతో  ఈ ఔషధాన్ని విక్రయిస్తోంది. అబాట్‌, సెలాన్‌ లేబొరేటరీస్‌ తదితర కంపెనీలు కూడా హెపరిన్‌ ఇంజెక్షన్లను విక్రయిస్తున్నాయి. 1000 ఇంటర్నేషనల్‌ యూనిట్స్‌ పర్‌ మిల్లీలీటర్‌ (ఐయూ/ఎంఎల్‌) సామర్థ్యం ఉన్న ఒక ఎంఎల్‌ ఇంజెక్షన్‌ ధరను రూ.24.39,  5000 ఐయూ/ఎంఎల్‌ ఇంజెక్షన్‌ ధరను రూ.60.54గా ఎన్‌పీపీఏ నిర్ణయించింది. 


మరిన్ని ఔషధాలకూ ధరల పోటు?

మరిన్ని ఔషధాల ధరలు కూడా పెరగడానికి అవకాశాలు లేకపోలేదని వీటిని తయారు చేసే కంపెనీలు ఫార్ములేషన్ల ధరలను సవరించాలని కోరుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత కొద్ది నెలల్లో ఫార్ములేషన్లను తయారు చేసే ఏపీఐ, కీలక ముడి పదార్ధాల  ధరలు సగటున 30-35 శాతం పెరిగాయం టున్నారు. చైనాలో కొవిడ్‌కు ముందు  కఠినమైన పర్యావరణ నిబంధనలు అమలు చేయడంతో సగానికి సగం ఏపీఐ తయారీ యూనిట్లు మూతపడ్డాయి. లాక్‌డౌన్‌, సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు తదితర అంశాల కారణంగా కూడా ధరలు పెరిగాయి. తాజాగా చైనా నుంచి వచ్చిన ఏపీఐ కన్‌సైన్‌మెంట్లకు అనుమతులు రాక పోర్టుల్లోనే ఉండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పారాసిటమోల్‌, సిప్లాఫ్లాక్సాసిన్‌ వంటి 25 రకాల యాంటీబయాటిక్స్‌, విటమిన్ల ధరలను పెంచడానికి వీలుందని చెబుతున్నారు. అత్యవసర అధికారాలను ఉపయోగించి గత ఏడాది డిసెంబరులో టీబీ ఔషధాలు, విటమిన్‌ సీ, యాంటీబయాటిక్స్‌ వంటి 21 ఔషధాల ధరలను ఎన్‌పీపీఏ 50 శాతం పెంచింది. 


‘హెపరిన్‌ అత్యవసర ఔషధం. డయాలిసిస్‌ వంటి కీలకమైన రుగ్మతలతో బాధపడే వారికి ఈ ఔషధం అవసరం. లాజిస్టిక్స్‌ తదితర వ్యయాలు బాగా పెరిగాయి. ముడి ఔషధాల లభ్యతలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఫార్ములేషన్లకు తగిన ధర లభించకపోతే కంపెనీలు కొనసాగడం కష్టం. ముఖ్యంగా చిన్న కంపెనీలు మూతపడే పరిస్థితి వస్తుంది’. 

- వేంకట హరీశ్‌ పెరుమాళ్ల, ఫార్మా విశ్లేషకుడు


ఏపీఐ ధర 211శాతం పెరిగింది

చైనా నుంచి దిగుమతి చేసుకునే ముడి ఔషధం ధర పెరగడం, కొరత కారణంగా హెపరిన్‌ ఫార్ములేషన్‌ ధరను పెంచడానికి ఎన్‌పీపీఏ అనుమతి ఇచ్చింది. హెపరిన్‌ ఫార్ములేషన్ల తయారీలో దిగుమతి చేసుకునే ముడి ఔషధం, ఏపీఐ వ్యయమే అధిక భాగం ఉంటుందని, చైనా నుంచి దిగుమతి అయ్యే ముడి ఔషధం ధర పెరిగినందు వల్ల ఫార్ములేషన్‌ ధరను పెంచాలని ఎన్‌పీపీఏను కంపెనీలు కోరాయి. ధర పెంచకపోతే హెపరిన్‌ ఇంజెక్షన్లు తయారు చేయడం కష్టమని తెలిపాయి. 2018, సెప్టెంబరుతో పోలిస్తే.. హెపరిన్‌ యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రిడియెంట్‌ (ఏపీఐ) ధర 211 శాతం పెరిగింది. 


Updated Date - 2020-07-09T06:13:50+05:30 IST