తగ్గిపోతున్న భారత పాస్‌పోర్ట్ ‘పవర్’..!

ABN , First Publish Date - 2021-10-26T03:26:24+05:30 IST

హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్.. వివిధ దేశాల పాస్‌పోర్టుల ‘పవర్’ ఎంతో చెప్పే సూచి! హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ 2021లో జపాన్, సింగపూర్ పాస్‌పోర్టులు సంయుక్తంగా అగ్రస్థానం సంపాదించగా.. భారత పాస్‌పోర్టు 90వ స్థానంలో నిలిచింది.

తగ్గిపోతున్న భారత పాస్‌పోర్ట్ ‘పవర్’..!

ఇంటర్నెట్ డెస్క్: హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్.. వివిధ దేశాల పాస్‌పోర్టుల ‘పవర్’ ఎంతో చెప్పే సూచి! హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ 2021లో జపాన్, సింగపూర్ పాస్‌పోర్టులు సంయుక్తంగా అగ్రస్థానం సంపాదించగా..  భారత పాస్‌పోర్టు 90వ స్థానంలో నిలిచింది. భారత్ పాస్‌పోర్టు ఉన్న వారికి కేవలం 58 దేశాల్లో మాత్రమే వీసా-ఫ్రీ ఎంట్రీకి అవకాశం ఉంది. అంటే.. ఆయా దేశాలకు వెళ్లే ముందే వీసా తీసుకోవాల్సిన అవసరం లేకుండా.. అక్కడ విమానం దిగాక వీసా పొందవచ్చు. ఇక ఈ సూచిలో తొలిస్థానాన్ని  కైవసం చేసుకున్న జపాన్, సింగపూర్ దేశాల పాస్‌పోర్టు ఉన్న వారికి ఏకంగా 192 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీకి అవకాశం ఉంది. 


వాస్తవానికి గత పదేళ్లుగా భారత్ పాస్‌పోర్టు పవర్ తగ్గిపోతూనే ఉందని పరిశీలకులు చెబుతున్నారు. 2011లో మన దేశ పాస్‌పోర్టు 78వ ర్యాంకు సాధించగా.. ఆ మరుసటి ఏడాది ఇది 82కు పడిపోయింది. 2013లో మన ర్యాంకు 75తో కాస్త మెరుగైనా.. 2014 మళ్లీ 76కు పడిపోయింది. కానీ.. 2015లో భారత్ పాస్‌పోర్టు ర్యాంకు ఏకంగా 88 స్థానానికి దిగింది. ఇక 2019, 2020 సంవత్సరాల్లో 82వ స్థానంలో కొనసాగిన భారత్ పాస్‌పోర్టు ర్యాంకు.. 2021లో మాత్రం ఏకంగా 90వ స్థానానికి చేరుకుంది. 


బ్రిక్స్ దేశాలైన రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌తో పోల్చినా కూడా భారత్ పాస్‌పోర్టు పవర్ తక్కువే! హెన్లీ ఇండెక్స్‌లో 20వ స్థానంతో బ్రెజిల్ పాస్‌‌పోర్టు ముందంజలో ఉండగా.. ఆ తరువాతి స్థానాల్లో రష్యా(52 ర్యాంకు), దక్షిణాఫ్రికా(58), చైనా(72) ఉన్నాయి. కాగా.. భారత్ పాస్‌పోర్టు ఉన్న వారికి.. ఫిజీ, ఇరాన్, ఖతార్, జోర్డాన్, అల్బేనియా, సెర్బియా, బార్బడోస్, జమైకా, ట్రినిడాడ్, టొబాగో, ఇండోనేషియా, మాల్దీవులు, థాయ్‌ల్యాండ్, శ్రీలంక, మారిషస్, మెడగాస్కర్, ట్యూనిషియా, జింబాబ్వే తదితర 58 దేశాల్లో వీసా-ఫ్రీ ఎంట్రీకి అవకాశం ఉంది. భారత్ దాయాది దేశమైన పాక్‌ కూడా 113వ ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

Updated Date - 2021-10-26T03:26:24+05:30 IST