పురిటి నొప్పులు.. కరోనా టెస్ట్‌కు తిప్పలు!

ABN , First Publish Date - 2021-05-07T09:55:20+05:30 IST

అది కోఠిలోని ప్రసూతి ఆస్పత్రి. గురువారం ఉదయం ఓ నిండు గర్భిణికి సిజేరియన్‌ చేయాల్సి రావడంతో శస్త్ర చికిత్సాలయానికి తీసుకువెళ్లేందుకు ఆమెకు సిబ్బంది పేషంట్‌ గౌన్‌ ధరింపజేశారు. అయితే ఆమె ఆపరేషన్‌ థియేటర్‌లోకి పంపలేదు.

పురిటి నొప్పులు.. కరోనా టెస్ట్‌కు తిప్పలు!

కోఠి ప్రసూతి ఆస్పత్రిలో గర్భిణుల కష్టాలు

నొప్పులుపడుతూ టెస్ట్‌ కోసం గేటు వద్ద క్యూలో  

లోపల వార్డుల్లోనే ఏర్పాటు చేయొచ్చు కదా!

ఎందుకలా చేయరు? ప్రశ్నిస్తున్న సహాయకులు

వివరణ కోరితే ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నిర్లక్ష్యం

మీకెందుకు చెప్పాలి.. నన్నెవరూ భయపెట్టలేరు అని ఆగ్రహం


మంగళ్‌హాట్‌, మే 6(ఆంధ్రజ్యోతి): అది కోఠిలోని ప్రసూతి ఆస్పత్రి. గురువారం ఉదయం ఓ నిండు గర్భిణికి సిజేరియన్‌ చేయాల్సి రావడంతో శస్త్ర చికిత్సాలయానికి తీసుకువెళ్లేందుకు ఆమెకు సిబ్బంది పేషంట్‌ గౌన్‌ ధరింపజేశారు. అయితే ఆమె ఆపరేషన్‌ థియేటర్‌లోకి పంపలేదు. అదే గౌనులో చేతిలో ఓ చీటీ పట్టుకొని ఆస్పత్రి బయట గేటు వద్దకు వచ్చింది. అక్కడ లైన్లో నిల్చుని పురుటినొప్పులు తాళలేక ఓ చోట కూర్చుండిపోయింది. మరో నిండు చూలాలిదీ ఇదే అవస్థ. ఆమెకు శుక్రవారం సిజేరియన్‌ చేస్తామని చెప్పిన వైద్యులు కరోనా పరీక్షలు చేయించుకొని రావాలని సూచించారు. ఆమె అడ్మిట్‌ కార్డ్‌ పట్టుకొని ఓపీ గేటు వద్ద కొవిడ్‌ టెస్టింగ్‌ సెంటర్‌ దగ్గర దాదాపు గంట సేపు వేచి ఉండి పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది. 


...ఇలా కాన్పు కోసం పురిటి నొప్పులతో వస్తున్న గర్భిణులకు కోఠి ప్రసూతి ఆస్పత్రి వద్ద విషమ ‘పరీక్ష ఎదురవుతోంది. ప్రసవవేదనతో అవస్థలు పడుతున్నా ఏమాత్రం పట్టనట్లుగా కరోనా టెస్ట్‌ చేయించుకొని రావాలని వైద్యులు తాపీగా చెబుతున్నారు. ఆస్పత్రి గేటు వద్ద కరోనా టెస్ట్‌ కోసం గంటలతరబడి వేచిచూస్తూ గర్భిణుల పడుతున్న వేదన అంతాఇంతాకాదు. వారి ఇబ్బందులు అక్కడున్నవారిని కంటతడి పెట్టిస్తున్నాయి. 160 పడకల సామర్థ్యం గల ఈ ఆస్పత్రిలో ఇటీవల నూతన భవనం అందుబాటులోకి వచ్చింది. ఈ కారణంగా మరో 240 పడకలు అందుబాటులోకి వచ్చాయి. రోజుకు వెయ్యి మందికి పైగా ఓపీ చికిత్సల నిమిత్తం ఈ ఆస్పత్రికి వస్తుంటారు. నిత్యం 30 నుంచి 40 దాకా ప్రసవాలు జరుగుతుంటాయి. అయితే నెలలు నిండిన గర్భిణులు ప్రసవానికి వస్తే కొవిడ్‌ పరీక్షలు చేయించాలంటూ ఆస్పత్రి ఓపీ గేటు వద్ద ఏర్పాటు చేసిన కొవిడ్‌ టెస్టింగ్‌ సెంటర్‌కు పంపుతున్నారు. అక్కడ అప్పటికే 50-60 మందితో రద్దీ నెలకొనడంతో ఆ గుంపులో గర్భిణులు నిల్చోలేక. కూర్చోలేక అవస్థలు పడుతున్నారు. క్యూ పద్ధతిని నియంత్రించే వారు కూడా లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో మహిళలు పరస్పరం తోసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత జరుగుతున్నా ఆస్పత్రి సూపరింటెండెంట్‌  ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. అడ్మిట్‌ చేసుకున్న గర్భిణులకు వారి వార్డుల్లోనే నమునాలు సేకరించి కొవిడ్‌ పరీక్షలు చేయించాలని కోరినా స్పందించడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


మారని ఆస్పత్రి తీరు...

కోఠి ప్రసూతి ఆస్పత్రి తీరు ఇప్పుడే కాదు.. కరోనా మొదటి దశలోనూ తీవ్ర వివాదాస్పమైంది. అప్పట్లో మలక్‌పేట్‌తో పాటు నగర శివారలు ప్రాంతాల నుంచి ఆస్పత్రికి వచ్చిన గర్భిణులను అడ్మిట్‌ చేసుకోకుండా ఆస్పత్రి ప్రాంగణంలోని చెట్ల కిందకూర్చొబెట్టారు. ‘‘మీరు ఎక్కడెక్కడి నుంచో వస్తే మేం ఇక్కడ చేర్చుకోవాలా?’’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో అప్పట్లో గర్భిణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని ప్రస్తుతం ఆస్పత్రి సిబ్బందే గుర్తు చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖలోని ఓ ఉన్నతాధికారి అండదండలు ఉండటంతో ఆస్పత్రి అధికారుల ఆగడాలు మితి మీరుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భిణులకు అండగా ఉండాల్సిన ఓ మహిళా అధికారే వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగి సహాయకులు వాపోతున్నారు. సదరు అధికారిణిపై చర్యలు తీసుకోవడంతో పాటు నెలలు నిండిన గర్భిణులకు వార్డుల్లోనే కొవిడ్‌ పరీక్షల నిమిత్తం నమూనాలు స్వీకరించేలా చూడాలని రోగి సహాయకులు కోరుతున్నారు. 


మీకెందుకు చెప్పాలి? 

నెలలు నిండిన గర్భిణిని టెస్టింగ్‌ సెంటర్‌కు పంపడంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజ్యలక్ష్మిని వివరణ కోరగా మీకెందుకు చెప్పాలి? నన్ను ఎవరూ బయపెట్టలేరు. అసలు నాకు మాట్లాడాల్సిన పని లేదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.    

Updated Date - 2021-05-07T09:55:20+05:30 IST