హెమోఫిలియా రోగులకు శాపంగా మారిన కరోనా

ABN , First Publish Date - 2020-10-20T00:13:42+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సిబ్బంది, ఆస్పత్రులు...

హెమోఫిలియా రోగులకు శాపంగా మారిన కరోనా

న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సిబ్బంది, ఆస్పత్రులన్నీ ప్రస్తుతం కోవిడ్‌–19 రోగుల పైనే దృష్టిని కేంద్రీకరించాయి. దీంతో కరోనాయేతర రోగుల చికిత్సలో తీవ్ర అవరోధాలు ఎదురవుతున్నాయి. ప్రత్యేకించి హెమోఫిలియా రోగుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఈ వ్యాధి పట్ల అవగాహన లేమి, నిపుణుల కొరత హెమోఫిలియా రోగులకు మరింత కష్టంగా మారింది. కరోనా సోకుతుందోననే భయం కారణంగా ఆస్పత్రులకు వెళ్లడానికి కూడా రోగులు భయపడుతున్నారు. ఇదే భయం ఇప్పుడు వారి ప్రాణాలమీదికి తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో నిమ్స్ ఆస్పత్రి పాథాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెస్ డాక్టర్‌ రాధిక కనకరత్న మాట్లాడుతూ ‘‘కరోనా మహమ్మారి వెలుగుచూశాక హెమోఫిలిక్‌ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా ఆస్పత్రులకు వచ్చే హెమోఫిలిక్‌ రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. నెలలో కేవలం 5–6 రోగులు మాత్రమే ఆస్పత్రికి వస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్సకు అవసరమైన సదుపాయాలు ఉన్నా, డయాగ్నోసిస్‌ కేంద్రం పనిచేస్తున్నా... రోజువారీ చికిత్స ప్రక్రియ మాత్రం అంతగా ముందుకు సాగడం లేదు. సాధారణ ప్రజల్లాగానే హెమోఫిలిక్స్‌ కూడా కోవిడ్‌–19 ప్రమాద బారిన పడేందుకు అవకాశాలున్నాయి. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చికిత్స కొనసాగించాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. హెమోఫిలియా రోగులు సాధారణ జీవితం గడపాలంటే ముందుగా రోగ నిర్థారణ జరగడం, చికిత్స నందించడం, ఫిజియోథెరఫీ అనేవి అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు. ఫ్యాక్టర్‌ రీప్లేస్‌మెంట్‌ చికిత్స, ఫిజియోథెరఫీ అందుబాటులో ఉన్నందువల్ల హెమోఫిలియా రోగులు... ప్రత్యేకించి చిన్నారులు ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడగలుగుతున్నారని డాక్టర్ రాధిక పేర్కొన్నారు. అవగాహన లేమి,  సకాలంలో చికిత్స అందించకపోవడం వల్ల మరణాల సంఖ్య అధికంగా ఉంటుందన్నారు. వంశపారంపర్య జన్యు లోపం కారణంగా వచ్చే వ్యాధి హెమోఫిలియా. ఇందులో హెమోఫిలియా ఏ, హెమోఫిలియా బీ అని రెండు రకాలు ఉంటాయి. ఈ వ్యాధి వల్ల శరీరం రక్తాన్ని గడ్డకట్టించే సామర్థ్యాన్ని కోల్పోతుంది.  అధికంగా రక్త స్రావం కావడం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. 

Updated Date - 2020-10-20T00:13:42+05:30 IST