HYD : అన్నను చెల్లెళ్ల చెంతకు చేర్చిన హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌

ABN , First Publish Date - 2021-10-25T16:17:40+05:30 IST

తోబుట్టువులకు దూరమై.. ఒంటరిగా.. అనాథగా ఆస్పత్రిలో చికిత్స...

HYD : అన్నను చెల్లెళ్ల చెంతకు చేర్చిన హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌

హైదరాబాద్‌ సిటీ : తోబుట్టువులకు దూరమై.. ఒంటరిగా.. అనాథగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మానసిక స్థితి సరిగాలేని వ్యక్తిని హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ కుటుంబం చెంతకు చేర్చింది. చాలా రోజుల తర్వాత తన సోదరుడిని చూసి చెల్లెళ్లు ఆనందభాష్పాలు రాల్చారు. లాలాపేటకు చెందిన విజయ్‌కుమార్‌(45)కు ముగ్గురు తోబుట్టువులు. తల్లిదండ్రులు లేరు. అతడికి మానసికంగా ఆరోగ్యపరిస్థితి సరిగా లేదు. గతనెల 5న బయటకు వెళ్లిన విజయ్‌కుమార్‌ తిరిగి రాకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 


ఉస్మానియా ఆస్పత్రి అనాథ వార్డులో స్వచ్ఛందగా సేవలు అందించే హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ వలంటీర్‌ ఎండీ సిరాజ్‌ రెండు రోజుల క్రితం బస్‌పాస్‌ రెన్యూవల్‌ కోసం సికింద్రాబాద్‌ బస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ గోడపై అతికించిన ప్రకటను చదివాడు. ఉస్మానియా ఆస్పత్రిలో అనాథ వార్డులో చికిత్స పొందుతున్న వ్యక్తి విజయ్‌కుమార్‌గా గుర్తించి హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌కు సమాచారం ఇచ్చాడు. హెచ్‌హెచ్‌ఎఫ్‌ సభ్యులు విజయ్‌కుమార్‌ కుటుంబ సభ్యులకు వీడియో కాల్‌ చేసి రోగిని చూపించారు. తోబుట్టువులు అతడిని గుర్తించారు. అన్నను తమ వద్దకు చేర్చిన హెచ్‌హెచ్‌ఎఫ్‌ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. విజయ్‌కుమార్‌ వారం రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రి గేటు వద్ద ఉంటే అనాథ వార్డులో వైద్య సేవలు అందిస్తున్నట్లు ముజ్తాబ్‌ అక్సర్‌ అన్సారీ తెలిపారు.

Updated Date - 2021-10-25T16:17:40+05:30 IST