ప్రగతికి సహకారం

ABN , First Publish Date - 2021-01-27T06:45:45+05:30 IST

జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని, తద్వారా జిల్లాను ప్రగతి పథాన నడిపించేందుకు అన్నివర్గాల ప్రజలు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ కోరారు.

ప్రగతికి సహకారం
ఒంగోలు పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేస్తున్న కలెక్టర్‌ పోలా భాస్కర్‌, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌, ఎంపీ మాగుంట, ఇతర అధికారులు

1.38 లక్షల మందికి ఇళ్లపట్టాలు

వచ్చే నెల నుంచి ఇంటింటికీ రేషన్‌ 

2022 డిసెంబర్‌ నాటికి  వెలిగొండ పూర్తి

201 గ్రామాల్లో అమూల్‌  ద్వారా పాలసేకరణ

గణతంత్ర దినోత్సవ సభలో  కలెక్టర్‌ పోలా భాస్కర్‌

ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన


గణతంత్ర  వేడుకలు జిల్లాలో ఉత్సాహంగా జరిగాయి. ఒంగోలు పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన ప్రధాన కార్యక్రమంలో కలెక్టర్‌ పోలా భాస్కర్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. వేడుకలకు హాజరైన వివిధవర్గాల వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సేవలో ఉత్తమ పనితీరు ప్రదర్శించిన 545మంది  అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటుచేసిన శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా సాగగా, దేశభక్తి గీతాలకు చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అలరింపజేశాయి. అలాగే జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ పార్టీల కార్యాలయాలతోపాటు పలు ప్రైవేటు, సేవాసంస్థల  వద్ద జాతీయజెండాలను ఎగురవేశారు.

ఒంగోలు, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని, తద్వారా జిల్లాను ప్రగతి పథాన నడిపించేందుకు అన్నివర్గాల ప్రజలు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ కోరారు. భారత 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసినకార్యక్రమంలో జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ పరిపాలన సమర్థవంతంగా, ప్రజలకు చేరువగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తెచ్చిన సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందుతున్నాయన్నారు. జిల్లాలో 1,30,838 మంది లబ్ధిదారులకు 3,158 ఎకరాల్లో 1,921 లేఅవుట్లలో ఇళ్ల స్థల పట్టాలు గతేడాది డిసెంబరు 20నుంచి అందజేస్తున్నట్లుతెలిపారు. జిల్లాలో 2,151 రేషన్‌ దుకాణాల పరిధిలో 9.77 లక్షల మంది కార్డుదారులకు 16 దఫాలుగా కొవిడ్‌ సమయంలో బియ్యం, కందిపప్పు అందించామని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ చెప్పారు. వచ్చేనెల నుంచి జిల్లాలో 589 వాహనాల ద్వారా రేషన్‌ సరుకులను కార్డుదారులకు ఇళ్ల వద్దనే ఇవ్వనున్నట్లు తెలిపారు. 


ఆగస్టుకు తొలిదశ పూర్తి

వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఇప్పటికే తొలి సొరంగం తవ్వకం పూర్తయిందన్నారు. ఈ ఏడాది ఆగస్టు ఆఖరుకు తొలిదశ, తవ్వకం పూర్తికి అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇతర సాగునీటి ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలో అమూల్‌ మొదటి విడతలో భాగంగా 143 రైతుభరోసా కేంద్రాల ద్వారా 201 గ్రామాల నుంచి రోజుకు 17వేల లీటర్ల పాలను సేకరిస్తుందన్నారు. దీంతో రైతులకు లీటర్‌కు రూ.5 నుంచి రూ.10 వరకు అదనపు ఆదాయం లభిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో కరోనా నియంత్రణకు యంత్రాంగం అహర్నిశలు కృషిచేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో డ్వామా ద్వారా ఉపాధి హామీ పథకం కింద పెద్దఎత్తున కూలీ పనులు కల్పనతో పాటు మెటీరియల్‌ కోటా నిధులతో భారీగా నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.835కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉన్నామన్నారు. ఈ ఏడాది 2.644 కోట్ల పని దినాలు లక్ష్యం కాగా 2.47కోట్ల పని దినాలు కల్పించినట్లు తెలిపారు. 


పురోగతిలో నిర్మాణాలు

జలసిరి పథకం కింద ఉచిత బోర్ల కోసం 22వేలమంది దరఖాస్తు చేసుకోగా అర్హతను బట్టి మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయన్నారు. అలాగే ఉపాధి పథకం మెటీరియల్‌ కోటా నిధుల ద్వారా చేపట్టిన సచివాలయ, రైతుభరోసా, హెల్త్‌ క్లినిక్‌ భవన నిర్మాణాలు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, ఎస్సీ సిద్ధార్థకౌశల్‌ పాల్గొన్నారు. 






Updated Date - 2021-01-27T06:45:45+05:30 IST