హలో...డాక్టర్‌!

ABN , First Publish Date - 2020-03-30T10:27:51+05:30 IST

‘హలో...డాక్టర్‌’ అంటూ తమకు కావాల్సిన వైద్య సేవలను ప్రస్తుతం పలువురు రోగులు ఫోన్‌లోనే పొందుతున్నారు.

హలో...డాక్టర్‌!

కార్పొరేట్‌ ఆస్పత్రుల ఫోన్‌ ఇన్‌ సేవలు

చిన్నచిన్న సమస్యలకు ఫోన్‌లోనే సలహాలు

అత్యవసరమైతేనే ఆస్పత్రికి రావాలని సూచన

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిర్ణయం

ప్రభుత్వ ఆస్పత్రులు, క్లినిక్‌ల వైద్యుల దారీ ఇదే

కేజీహెచ్‌, సీఎం ఆరోగ్య కేంద్రాల్లోనే అత్యవసర ఓపీ సేవలు


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం):‘హలో...డాక్టర్‌’ అంటూ తమకు కావాల్సిన వైద్య సేవలను ప్రస్తుతం పలువురు రోగులు ఫోన్‌లోనే పొందుతున్నారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌, నేపథ్యంలో చాలా కార్పొరేట్‌ ఆస్పత్రులు అవుట్‌ పేషెంట్‌(ఓపీ) సేవలకు స్వస్తి చెప్పేశాయి. ఆ స్థానంలో రెగ్యులర్‌గా తమవద్దకు వచ్చే రోగులకు ఫోన్‌లో సేవలందిస్తున్నాయి. బీపీ, షుగర్‌ వంటి చిన్నచిన్న సమస్యలకు ఆస్పత్రికి రావద్దని, ఫోన్‌ చేస్తే ఏం చేయాలో సలహాలు ఇస్తామని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా అత్యవసర సేవలు మినహా అన్నీ నిలిచిపోవడంతో ఆ ప్రభావం రెగ్యులర్‌గా వైద్య సేవలు పొందే వారిపై తీవ్రంగా కనిపిస్తున్నది. వీరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొంత మంది కార్పొరేట్‌/ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు ఫోన్‌లో అందుబాటులో ఉంటున్నారు. పలు ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు కూడా ఈ విధమైన సేవలను ఫోన్‌లో అందిస్తున్నారు. దీంతో దీర్ఘకాలంగా వైద్యసేవలు పొందుతున్న వారికి ఈ కష్టకాలంలో కొంత అక్కరకు వస్తోందని రోగులు చెబుతున్నారు.


చిన్నపాటి అనారోగ్య సమస్యలకు ఎక్కడికి వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేదని, నిత్యం వెళ్లే వైద్యుడు ఫోన్‌లోనే సలహాలు ఇవ్వడంతోపాటు మందులు కూడా చెప్పారని మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి లక్ష్మణరావు తెలిపారు. అదేవిధంగా కేజీహెచ్‌తోపాటు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు కూడా ఫోన్‌ చేస్తే సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిల్లో అత్యవసరమైతే తప్ప ఆస్పత్రికి రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితి ప్రజల కోసమేనని, ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమై వైరస్‌కు దూరం కావాలని సూచిస్తున్నారు.


ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ

నగర పరిధిలోని కేజీహెచ్‌, ఘోషా, సీఎం ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర ఓపీ సేవలను అందిస్తున్నారు. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే ఇక్కడ వైద్య సేవలు పొందేందుకు అవకాశముంది. సీఎం ఆరోగ్య కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాధారణ ఓపీ సేవలను అందిస్తున్నాయి. తప్పనిసరి అనుకున్నవాళ్లు మాత్రమే రావాలని వైద్యులు సూచిస్తున్నారు.


ఇకపోతే, కేజీహెచ్‌లో ప్రతిరోజూ నిర్వహించే అత్యవసర ఓపీకి 40-50 మంది వస్తుండగా, ఘోషాలో 8-9 నెలల గర్భిణుల కోసం నిర్వహించే ఓపీకి 10-12 మంది వరకు వస్తున్నారు. కేజీహెచ్‌లో ప్రస్తుతం 350 మంది ఇన్‌పేషెంట్‌లు ఉండగా, ప్రతిరోజు అత్యవసరంగా 30 మంది వరకు ఇన్‌పేషెంట్‌లుగా చేరుతున్నారు. 25-30 వరకు చిన్నా, పెద్ద సర్జరీలు, 13-15 డెలివరీలు అవుతున్నాయి. ఘోషాలో ప్రస్తుతం 90 మంది ఇన్‌పేషెంట్‌లు ఉండగా, ప్రతిరోజూ 10 వరకు డెలివరీలు అవుతున్నాయి. ఇక సీఎం ఆరోగ్య కేంద్రాలకు 10-20 మంది వరకు వస్తున్నారు. 

Updated Date - 2020-03-30T10:27:51+05:30 IST