రిమ్స్‌కు వెళ్లాలంటే నరకమే..!

ABN , First Publish Date - 2021-11-29T05:47:32+05:30 IST

నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌)కు వెళ్లాలంటే అవస్థలు తప్పడం లేదు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా, ప్రాణాల మీదకు వచ్చినా ఉరుకులు పరుగుల మీద ఆసుపత్రికి వెళ్తుంటారు. కానీ పుట్లంపల్లె రైల్వే లోలెవల్‌ బ్రిడ్జి కింద వర్షపు నీరు నిల్వ ఉండడంతో కొద్దిరోజులుగా రాకపోకలు నిలిచి పోయాయి. రిమ్స్‌కు వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. తద్వారా రోగులకు, సిబ్బందికి, కళాశాల విద్యార్థులకు వ్యయ ప్రయాసలు తప్పడం లేదు. వివరాల్లోకెళ్తే...

రిమ్స్‌కు వెళ్లాలంటే నరకమే..!
బ్రిడ్జి కింద నిలిచిన వర్షపు నీరు

రోగుల అవస్థలు తీరవా..!

శాశ్విత పరిష్కారం కోసం ఎదురుచూపు

కడప(సెవెన్‌రోడ్స్‌), నవంబరు 28: నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌)కు వెళ్లాలంటే అవస్థలు తప్పడం లేదు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా, ప్రాణాల మీదకు వచ్చినా ఉరుకులు పరుగుల మీద ఆసుపత్రికి వెళ్తుంటారు. కానీ పుట్లంపల్లె రైల్వే లోలెవల్‌ బ్రిడ్జి కింద వర్షపు నీరు నిల్వ ఉండడంతో కొద్దిరోజులుగా రాకపోకలు నిలిచి పోయాయి. రిమ్స్‌కు వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. తద్వారా రోగులకు, సిబ్బందికి, కళాశాల విద్యార్థులకు వ్యయ ప్రయాసలు తప్పడం లేదు. వివరాల్లోకెళ్తే... 


సాధారణంగానే రిమ్స్‌.. నగరానికి దూరంగా ఉంటుంది. కడప ఆర్టీసీ బస్టాండు నుంచి కలెక్టరేట్‌ మీదుగా (6 కి.మీ., 15 నిమిషాల్లో) రిమ్స్‌కు చేరుకోవచ్చు. కానీ ఈ దారిలోని పుట్లంపల్లె రైల్వే లోవెల్‌ బ్రిడ్జి కింద గత వారం కురిసిన వర్షాలకు నీరు నిల్వ ఉండి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఆసు పత్రికి చేరాలంటే ఐటీఐ సర్కిల్‌ నుంచి ఊటుకూరు రింగురోడ్డు మీదుగా (11కి.మీ., 30 నిమిషాలు), అటువైపు నుంచి వచ్చే వారు జేఎంజే కళాశాల వద్ద నుంచి ఉన్న రోడ్డు గుండా (13 కి.మీ 40 నిమిషాలు) వెళ్లాల్సిందే. దీనివల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతు న్నారు. ముఖ్యంగా యాక్సిడెంటు అయిన వారు, గర్భిణీలు, సీరియస్‌ కేసుల రోగుల బాధలు వర్ణణాతీతం. 


విద్యార్థులు, వైద్యులు, రోగుల కష్టాలు  

ఈ రైల్వే బ్రిడ్జి గుండా అనేక మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈ మార్గం ద్వారానే ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, మెడికల్‌ కళా శాల, సింగపూర్‌ సిటీ, ఇందిరానగర్‌, శిల్పారామం, నగరవనం, అపార్టుమెంట్లు, రామకృష్ణమిషన్‌, కేంద్రీయ విద్యాలయం, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, స్పోర్ట్స్‌ స్కూల్‌ ఇంకా అనేక ప్రైవేటు విద్యాలయాలు, పాలకొండలు మొదలగు వాటికి ఈ దారి గుండానే వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ దారిలోని బ్రిడ్జి కింద వర్షపు నీరు నిల్వ ఉండడంతో చుట్టూ తిరిగి వెళ్లక తప్పడం లేదు. పైగా దూరంతో పాటు ఆటోల ఖర్చు కూడా ఎక్కువవుతుందని నగరవాసులు అంటున్నారు. ఆర్టీసీ బస్టాండు నుంచి రిమ్స్‌కు రూ.30 అయితే ఊటుకూరు రింగురోడ్డు గుండా, లేదా జేఎంజే కళాశాల మీదుగా వెళ్లాంటే రూ.100 తక్కువ కావడం లేదని లబోదిబోమంటున్నారు. ఇప్పటి కైనా శాశ్వత పరిష్కారాన్ని చూపాలని అధికారు లను కోరుతున్నారు. 


సమయం వృథా అవుతోంది 

నగరం నుంచి ఆస్పత్రికి రావాలంటే ఎంతో ప్రయాసపడాల్సి వస్తోంది. చుట్టూ తిరిగి వచ్చేందుకు కనీసం అరగంట సమయం పడుతుంది. రోగులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. శాశ్విత పరిష్కారం చూపితే అందరికీ మేలే. 

- డాక్టర్‌ గురవయ్య, వైద్యుడు


ఆటోలు రావడం లేదు 

అనారోగ్యం పాలై ఆసుపత్రికి రావాలంటే దూర ప్రయాణంతో ఇబ్బందిగా ఉంది. పైగా చుట్టూ తిరిగి రావడం వల్ల ఆటోల ఖర్చు ఎక్కువగానే ఉంది. అత్యవసరమైనా త్వరగా చేరుకోలేకపోతున్నాం. 

- సరస్వతి, చాపాడు

Updated Date - 2021-11-29T05:47:32+05:30 IST