Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 24 Jan 2022 03:28:20 IST

ఆస్తి కక్కుర్తితో భార్యకు నరకం!

twitter-iconwatsapp-iconfb-icon
ఆస్తి కక్కుర్తితో భార్యకు నరకం!

  • తనకు బదలాయించాలని భర్త వేధింపులు
  • బలవంతంగా సూసైడ్‌ నోట్‌.. నోట్లో యాసిడ్‌ 
  • ఆమె కేకలతో భయపడి ఆస్పత్రికి తరలింపు  
  • కోలుకున్నాక ఇంట్లో వివస్త్రను చేసి నిర్బంధం
  • రక్షించండండంటూ వివాహిత వేడుకోలు


సైదాబాద్‌, జనవరి 23(ఆంధ్రజ్యోతి): భార్యకు నరకం చూపాడో భర్త. నోట్లో యాసిడ్‌ పోసి హత్యాయత్నం చేశాడు. వివస్త్రను చేసి కొన్ని రోజుల పాటు ఓ గదిలో నిర్బంధించాడు! అంతా ఆస్తి కోసమే! ‘నాకు ఆస్తులొద్దు.. ఏమీ వద్దు ప్రాణాలతో ఉంటే చాలు’ అంటూ ఆమె వేడుకునేంత స్థాయిలో వేధింపులకు గురిచేశాడు! ఈ మేరకు నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ)గా పనిచేస్తున్న  భర్త నుంచి ప్రాణహాని ఉందని, తనను రక్షించాలని పోలీసులను ఓ మహిళ వేడుకుంది. ఏసీబీ స్వాధీనం చేసుకొని, తిరిగిచ్చేసిన ఆస్తులను తన పేరిట బదిలీ చేయాలని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనను భర్త ప్రాణాలతో వదలడని ఆందోళన వ్యక్తం చేసింది. నగర పోలీస్‌ కమిషనర్‌ వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది. బాధితురాలి పేరు బోడ పద్మజ (47). ఆదివారం మలక్‌పేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆ వివరాల ప్రకారం.. ఆమె భర్త కొర్ర ధర్మానాయక్‌. 1989లో వీరి వివాహం జరిగింది. ధర్మానాయక్‌.. ప్రస్తుతం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటి పారుదల శాఖ ఎస్‌ఈగా ఉన్నారు. ఈ దంపతులు, సైదాబాద్‌ సరస్వతీనగర్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. 2008లో ఏఈగా పనిచేస్తున్న కాలంలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో సైదాబాద్‌లోని వీరి ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. 


పలు ఆస్తులను స్వాధీనం చేసుకుంది, అప్పటి నుంచే పద్మజపై ధర్మానాయక్‌ వేధింపులు మొదలయ్యాయి. ఆమె చేస్తున్న బ్యాంకు ఉద్యోగానికి కూడా రాజీనామా చేయించాడు. ఆస్తులను తన పేరిట చేయాలని భర్త వేధింపులకు గురిచేస్తున్నారంటూ సైదాబాద్‌ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ధర్మానాయక్‌పై పోలీసులు 498ఏ కేసు నమోదు చేయగా, కుటుంబ పెద్దల జోక్యంతో రాజీ కుదిరింది. అయితే కొన్ని నెలల తర్వాత ఆమెకు భర్త నుంచి మళ్లీ వేధింపులు మొదలయ్యాయి. ఆయన హింసలకు తాళలేక ఆమె ఈ నెల 2న ఇంట్లో నుంచి వెళ్లిపోయి కొత్తపేటలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. 4వ తేదీన ఆమె ఇంటికి  ధర్మానాయక్‌.. తల్లి లక్ష్మీబాయి, తమ్ముడు నాగరాజు, చిన్నమ్మ కాంతతో వచ్చాడు. పద్మజను బలవంతంగా కారులో ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఆమె, తన ఫోన్‌ నుంచి షీ టీం, సైదాబాద్‌ పోలీసులకు మేసేజ్‌ పెట్టింది. దీన్ని గమనించి ఆ ఫోన్‌ను ధ్వంసం చేశారు. అనంతరం సరస్వతీనగర్‌లోని ఇంటికి తీసుకెళ్లి బలవంతంగా సూసైడ్‌ నోటు రాయించారు. నోట్లో యాసిడ్‌ పోశారు. పద్మజ గట్టిగా కేకలు వేయడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆస్పత్రిలో ఆమెకు నాలుగు సర్జరీలు జరిగాయి. ఇంటి నుంచి బయటకు వస్తే వారి బండారం బయటపడుతుందనే భయంతో ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిన అనంతరం ఆమెను ఓ గదిలో వివస్త్రను చేసి బంధించారు. ఎలాగోలా అతికష్టమ్మీద  తప్పించుకొంది. కాగా పద్మజ శనివారం ఇంట్లోంచి వెళ్లిపోవడంతో తన భార్య కనిపించడం లేదంటూ ధర్మనాయక్‌, సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పైగా 50 తులాల బంగారు నగలు రూ.50 వేల నగదును ఆమె తీసుకువెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు వారు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. 


అన్యాయంగా నిందలు: ధర్మానాయక్‌

 భార్య పద్మజ.. ఆమె తల్లి, తమ్ముడు, ఇతర కుటుంబసభ్యులతో ఉన్న గొడవల కారణంగా మానసికంగా ఇబ్బందులు పడుతోందని.. తనను అన్యాయంగా ఇరికిస్తున్నారని ఎస్‌ఈ ధర్మానాయక్‌ తెలిపారు. ఆమె చేస్తున్న ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎలాంటి విచారణకైనా  సిద్ధమని చెప్పారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.