వాయుసేనకు ‘ప్రచండ’ శక్తి!

ABN , First Publish Date - 2022-10-04T09:30:32+05:30 IST

భారత వాయుసేన (ఐఏఎఫ్‌) అమ్ములపొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది.

వాయుసేనకు ‘ప్రచండ’ శక్తి!

దేశీయంగా తయారైన యుద్ధ హెలికాప్టర్లు

ప్రచండ్‌గా నామకరణం..


జోధ్‌పూర్‌, న్యూఢిల్లీ, అక్టోబరు 3: భారత వాయుసేన (ఐఏఎఫ్‌) అమ్ములపొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌ (ఎల్‌సీహెచ్‌) ప్రచండ్‌ వాయుసేనలో చేరింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వేదికగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తొలివిడతగా నాలుగు హెలికాప్టర్లను లాంఛనంగా వాయుసేనలోకి ప్రవేశపెట్టారు. వాటికి ప్రచండ్‌ అని నామకరణం చేశారు. అనంతరం కాసేపు దీనిలో ప్రయాణించారు. కార్యక్రమంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌, చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. ఈ తేలికపాటి హెలికాప్టర్లు సరిహద్దుల్లో భారత వాయుసేన పోరాట సామర్థ్యాలను గణనీయంగా పెంచుతాయని అన్నారు. పగలైనా, రాత్రి వేళల్లో అయినా ఇవి అద్భుతంగా పనిచేస్తాయని, శత్రు లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదిస్తాయని చెప్పారు.


ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమమైన ఎల్‌సీహెచ్‌లలో ఇదికూడా ఒకటని కొనియాడారు. 1999 కార్గిల్‌ యుద్ధం తర్వాత పర్వత శ్రేణుల్లో మరింత పరాక్రమాన్ని ప్రదర్శించే హెలికాప్టర్ల అవసరాన్ని గుర్తించిన కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టింది. సైన్యం అవసరాలకు అనుగుణంగా హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని తయారు చేసింది. 2020లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన భద్రతా కేబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) స్వదేశీ తేలికపాటి హెలికాప్టర్లను సమకూర్చకునేందుకు ఆమోదం తెలిపింది. తొలుత 15 హెలికాప్టర్ల కోసం రూ.3,887 కోట్లు కేటాయించింది. వాటిలో 10 వాయుసేనకు, ఐదు ఆర్మీకి కేటాయించారు. జోధ్‌పూర్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో నాలుగు ప్రచండ్‌లను వాయుసేనలోకి ప్రవేశపెట్టారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రచండ్‌లను సమీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వాయుసేన అధికారులు వెల్లడించారు. రాబోయే సంవత్సరాల్లో వాయుసేన, ఆర్మీకి 160 ఎల్‌సీహెచ్‌లు అవసరమవుతాయని అంచనా. పర్వత ప్రాంతాల్లో మోహరింపు కోసం ఒక్క ఆర్మీనే 95 హెలికాప్టర్లు సమకూర్చుకోవాలని చూస్తోంది. తూర్పు లద్దాక్‌లోని కొన్ని ఎత్తయిన ప్రాంతాలతోపాటు భారత్‌-చైనా బోర్డర్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వాయుసేనలోకి ప్రచండ్‌ల చేరిక మరింత బలాన్నిస్తోంది.


ప్రచండ్‌ ప్రత్యేకతలివీ...

 రెండు ఇంజన్లప్రచండ్‌ 5.8 టన్నుల బరువు ఉంటుంది.

 ప్రచండ్‌కు అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్‌ ‘ధ్రువ్‌’తో కొన్ని సారూప్యతలు ఉన్నాయి. 

 ప్రత్యర్థి వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పించే విధంగా ఇది ఎయిర్‌ టు ఎయిర్‌ మిసైల్స్‌ను మోసుకెళ్లగలదు. 20ఎంఎం టర్రెట్‌ గన్స్‌, 70ఎంఎం రాకెట్‌ వ్యవస్థ, ఇతర ఆయుధాలను ప్రయోగించే సత్తా దీనిలో ఉంది. 

 రాత్రి వేళల్లో కూడా ఇది శత్రువుల యుద్ధ ట్యాంకర్లు, బంకర్లు, డ్రోన్లను గుర్తించి దాడి చేయగలదు.

 సముద్ర, ఎడారి ప్రాంతాలతోపాటు సియాచిన్‌ వంటి ప్రతికూల వాతావరణంలోనూ ఈ హెలికాప్టర్ల పనితీరుని పరీక్షించారు.  

 వీటిని 20వేల కంటే ఎక్కువ ఎత్తున్న పర్వత ప్రాంతాలతోపాటు అన్ని భూభాగాలపైనా మోహరించవచ్చు. తద్వారా చైనాతో సరిహద్దు వెంబడి భారత సైనిక సామర్థ్యాన్ని ప్రచండ్‌ పెంచగలదు.

Updated Date - 2022-10-04T09:30:32+05:30 IST