ముళ్లకంపల వాస్తవంపై విరబూసిన కల్పన

ABN , First Publish Date - 2021-12-13T05:57:23+05:30 IST

1932లో సిగిజ్మండ్‌ క్రిష్జిజానోవ్‌స్కీ (Sigizmund Krzhizhanovsky) అనే ఒక రచయిత రాసిన ప్రచురణకు నోచుకోని కొన్ని కథల్ని పరిశీలించమని మాక్సిమ్‌ గోర్కీని కోరారట. ఆనాటికి సిగిజ్మండ్‌ సాహితీ రంగంలో ఏ విధమైన గుర్తింపూలేని రచయిత...

ముళ్లకంపల వాస్తవంపై  విరబూసిన కల్పన

1932లో సిగిజ్మండ్‌ క్రిష్జిజానోవ్‌స్కీ (Sigizmund Krzhizhanovsky) అనే ఒక రచయిత రాసిన ప్రచురణకు నోచుకోని కొన్ని కథల్ని పరిశీలించమని మాక్సిమ్‌ గోర్కీని కోరారట. ఆనాటికి సిగిజ్మండ్‌ సాహితీ రంగంలో ఏ విధమైన గుర్తింపూలేని రచయిత. గోర్కీ అప్పటికే ‘ఆల్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ సోవియెట్‌ రైటర్స్‌’కి తొలి చైర్మన్‌గా ఎంపిక కావడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా సోవియెట్‌ యువ రచయితలకు ‘సోషలిస్ట్‌ వాస్తవిక సాహిత్యం’ భవిష్యత్తు ఎలా ఉండాలో దిశానిర్దేశం చేస్తున్నారు. గోర్కీ దగ్గరికి రచనల్ని పంపటమనే ఈ తప్పిదానికి సిగిజ్మండ్‌ తరువాతి కాలంలో భారీమూల్యమే చెల్లించాల్సి వచ్చింది. గోర్కీ విమర్శలు సిగి జ్మండ్‌కు రచయితగా భవిష్యత్తు లేకుండా చేశాయి. మానవ జీవితంలో తాత్వికత ప్రాముఖ్యతను విస్మరిస్తూ గోర్కీ చేసిన విమర్శలో ప్రతి ఒక్క మాటా ప్రస్తావించకుండా సోవియట్‌ రచయితల్లో అనామకంగా మిగిలిపోయిన ‘సిగిజ్మండ్‌ క్రిష్జిజా నోవ్‌స్కీ’ అనే మహోన్నతమైన రచయితను గురించి చెప్పడం సాధ్యపడదు. సిగిజ్మండ్‌ రచనలు ఆనాటి ‘సోవియెట్‌ లిటరరీ ఎస్థెటిక్స్‌’కి  తీరని చేటు చేస్తున్నాయంటూ గోర్కీ ఆయన రచనల్ని ఈ విధంగా తూర్పారబట్టారు: ‘‘నేను మిస్టర్‌ క్రిష్జిజా నోవ్‌స్కీ రచనల్ని వాటి తాత్విక విలువను మాత్రమే దృష్టిలో పెట్టుకుని పరిశీలించలేను. బహుశా 1880ల్లో అయితే ఇవి మిక్కిలి ప్రజాదరణ పొందేవేమో. తీరుబడి వేళల్లో గ్రంథ పఠనం, పాండిత్య ప్రకర్ష ఆనాటి మేధావి వర్గాల్లో ఒక ఫ్యాషన్‌గా ఉండేది. పండితులందరూ సమోవర్‌ చుట్టూ సమా వేశమై కూర్చుని ప్రపంచ దృక్పథాన్ని నమ్మవచ్చా లేదా అనే దిశగా చేసే చర్చలు ఆనాడు మంచి కాలక్షేపంగా ఉండేవి. కానీ ప్రపంచమంతా తప్పించుకోలేని వినాశనాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న మన తరంలో ఎంత నిజాయితీగా రాసిన రాతలైనప్పటికీ ఈ కాలక్షేపపు పదవిన్యాసాలకు (కన్నింగ్‌ వర్డ్‌ ప్లే) చోటు లేదు. వేదాంతాన్ని ఎంత వినసొంపుగా, భావ గర్భంగా, వ్యంగ్యంగా వ్యక్తపరిచినప్పటికీ మెజారిటీ మానవ జాతి ఈ మెట్ట వేదాంతాలూ, తత్వాల కోసం పుట్టలేదు. ఈ నూతన శకంలో మనిషి సంపాదించిన జ్ఞానమంతా అతడి ఆలోచనా సరళి  ద్వారా కంటే అతడి చేతల ద్వారానే సృష్టించ బడింది. పదాల ద్వారా కంటే నిజాల ద్వారానే సామాజిక అభివృద్ధి దిశగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం జరుగు తోంది. అందువల్ల మిస్టర్‌ క్రిష్జిజానోవ్‌స్కీ రచనలకు ప్రచురణ కర్తలు దొరుకుతారనే నమ్మకం నాకేౖతే లేదు. ఒకవేళ  దొరికి నప్పటికీ వాళ్ళు చేసేదల్లా నేటి యువతను సందిగ్ధంలోకి నెట్టెయ్యడం తప్ప మరొకటి కాదు. అది వాళ్ళకి అవసరమా!’’


గోర్కీ అన్నట్లు సిగిజ్మండ్‌ను 19వ శతాబ్దానికి చెందిన రచయిత గానే భావించవచ్చు. ఆయన ఎస్థెటిక్స్‌పై 19వ శతాబ్దపు రష్యన్‌ సింబాలిజాన్ని ప్రభావితం చేసిన గొగోల్‌, ఎడ్గర్‌ అలాన్‌ పో వంటి రచయితల ప్రభావం ఎక్కువ. వింతైన నేపథ్యాలతో, కొంత అసహజంగానూ మరికొంత అతిశయోక్తిగానూ ధ్వనించే వ్యంగ్యంతో కూడిన సిగిజ్మండ్‌ శైలికీ  గొగోల్‌ శైలికీ చాలా పోలికలుంటాయి. ఉదాహరణకు ‘ది రన్‌అవే ఫింగర్స్‌’ (1922) అనే కథలో ఒక పియానిస్ట్‌ చేతి వేళ్ళు అతడి చెయ్యిని వదిలి పారిపోవడం గొగోల్‌ ‘ది నోస్‌’ కథను తలపిస్తుంది. సిగిజ్మండ్‌ కథానాయకులు కమ్యూనిస్టు రాజ్యంలో నిర్లిప్తంగా బ్రతుకుభారాన్ని మోస్తున్న సగటు మనుషులు. గొగోల్‌ ‘ది ఓవర్‌ కోట్‌’, సిగిజ్మండ్‌ ‘క్వాడ్రాటురిన్‌’ కథల్లో Akaky Akakievich, Sutulin వంటి కథా నాయకులు వృత్తి, ప్రవృత్తుల విషయాల్లో అనేక పోలికలతో ఈ సగటు మనుషులకు ప్రతినిధులుగా కనిపిస్తారు. ఏదేమైనా గోర్కీ అభిప్రాయపడ్డట్టే సిగిజ్మండ్‌ది వాస్తవాలను కుండబద్దలు కొట్టి చెప్పే శైలి కాదు. అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు కాకుండా, మెటఫోర్ల వెనుక పదబంధాల్లో చిక్కుపడిపోయిన ట్లుండే ఆయన కథలు అర్థం కావాలంటే పాఠకులకు కాస్త సహనం మరికొంత సృజనాత్మకతా అవసరపడతాయి. కానీ ముందు తరాలకు జిగ్సా పజిల్స్‌ లాంటి సిగిజ్మండ్‌ కథల్ని ఛేదించే బదులు ఇహలోకపు సమస్యలతో భౌతిక విషయాలపై మాత్రమే దృష్టిసారించడం అవసరమని హితవు చెప్పిన గోర్కీ వంటి వారి విమర్శలు నేటి తరం పాఠకుల పఠనాభిరుచులపై పరోక్షంగానైనా తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయనిపిస్తుంది.


సిగిజ్మండ్‌ డొమినికోవిచ్‌ క్రిష్జిజానోవ్‌స్కీ (1887-1950) ఉక్రెయిన్‌లోని కీవ్‌ పట్టణంలో పోలిష్‌ మాట్లాడే కుటుంబంలో పుట్టారు. 1919-1950ల మధ్య కాలంలో ఆరు వాల్యూముల కథా సంపుటుల్నీ, మూడు నవలికల్నీ రాసినప్పటికీ అందులో ఆయన జీవిత కాలంలో ప్రచురితమైనవి తొమ్మిది కథలు మాత్రమే. మాస్కో సాహితీలోకంలో పలు మేధావుల మన్ననలు అందుకున్నప్పటికీ క్రిష్జిజానోవ్‌స్కీ విలక్షణమైన శైలి విమర్శకుల, ప్రచురణకర్తల ఆదరణ పొందడంలో మాత్రం విఫలమైంది. ఈ కారణంగా ఆయన మాస్కో సాహితీలోకంలో విమర్శకునిగా, సంపాదకునిగా మాత్రమే పనిచేశారు, చనిపోయే వరకు. దీనికి తోడు స్టాలిన్‌ కంటే మూడేళ్ళు ముందుగానే సిగిజ్మండ్‌ మరణించడంతో ఆయన జీవితంలో కీలకమైన సమయమంతా యుద్ధ వాతావరణంతో కూడిన నియంతృత్వపు ఛాయల్లోనే గడిచిపోయింది. కీవ్‌లో ఈ విప్లవకాలానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సిగిజ్మండ్‌ 1920ల తొలి కాలంలో ఈ నియంతృ త్వపు కాలాన్ని ‘ఫెంటాస్టిక్‌’ శైలిలో రూపకాలు, ఉపమానాలతో కూడిన కాల్పనిక  సాహిత్యంగా మలిచే ప్రయత్నం చేశారు.


భావవ్యక్తీకరణ నేరమయ్యే నియంతృత్వపు రాజ్యంలో మీడియా సైతం పాలనా వ్యవస్థ కనుసన్నలలో భయపడుతూ మెలగవలసి ఉంటుంది. ఇటువంటి సమయంలోనే రచయి తలూ, కళాకారులూ వాస్తవాల్ని గొంతెత్తి చెప్పే దుస్సాహసాన్ని తమ భుజస్కంధాలపై వేసుకుంటారు. స్టాలిన్‌ శకంలో ఇటువంటి రచయితలు రెండు రకాలనుకోవచ్చు: అలెగ్జాండర్‌ సోల్జెనిత్సిన్‌, విక్టర్‌ సెర్జీ, మిఖాయిల్‌ బల్గకోవ్‌, బోరిస్‌ పాస్టర్నాక్‌ వంటి రచయితలు సోవియెట్‌ రష్యన్‌ విప్లవం, సివిల్‌ వార్‌ కాలం, స్టాలిన్‌ పాలన నాటి దారుణాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చే విధంగా వాస్తవాల్ని ప్రతిబింబిస్తూ రచనలు చేస్తే, రెండో వర్గం యుద్ధవాతావరణం కారణంగా ప్రజల హృద యాల్లో రక్తమోడుతున్న గాయాలకు లేపనం పూసే పనిని తమ మీద వేసుకున్నారు. క్రిష్జిజానోవ్‌స్కీ ఈ రెండో కోవకు చెందిన రచయిత. ఆయన రచనలు పాఠకుల్ని క్రూరమైన వాస్తవికతకు దూరంగా ఇంద్రియాలను ప్రేరేపించే సరికొత్త వాసనలూ, ఆకృతులూ కలగలిపిన గాఢమైన అబ్‌స్ట్రాక్ట్‌ ప్రపం చానికి తీసుకువెళతాయి. క్రిష్జిజానోవ్‌స్కీ తనను తాను ప్రప్రథ మంగా ‘ఎక్స్‌పెరిమెంటల్‌ రియలిస్టునని’ చెప్పుకునేవారు. స్టాలినిస్ట్‌ సెన్సార్షిప్‌ కారణంగా సిగిజ్మండ్‌ జీవితకాలంలో ప్రచురణకు నోచుకోని రచనలు ఆయన మరణానంతరం ఆరు వాల్యూముల రచనల రూపేణా 2001-13 మధ్యకాలంలో పలు ఆంగ్లానువాదాలుగా వెలువడ్డాయి.


యుద్ధంతో నాశనమైన కీవ్‌ పట్టణం నుంచి బయటపడి 1922లో మాస్కోలో స్థిరమైన ఉద్యోగం లేకుండా అతి చిన్నదైన ఇరుకు గదిలో నివాసం ఏర్పరుచుకున్నారు సిగిజ్మండ్‌. కాసేపు సిగరెట్‌ ముట్టించి అది కాలేలోగా కథ రాసి సిగరెట్‌ పీకను చెత్తబుట్టలోకి విసిరేసి కళాసేవ చేశామని భ్రమపడే రచ యితలున్న సాహితీరంగంలో తన వృత్తికీ, ప్రవృత్తికీ నిజాయి తీగా కట్టుబడి ఉండేవారు సిగిజ్మండ్‌. నార్వే రచయిత కనూట్‌ హాంసన్‌ బాటలోనే సిగిజ్మండ్‌ కూడా కథ రాయడం కోసం ఏకంగా శరీరాన్నే ఒక ప్రయోగశాలగా మార్చుకున్నారంటారు. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ఆయన అనువాదకుల్లో ఒకరైన కార్ల్‌ ఎమర్సన్‌ రాసిన కొన్ని వ్యాసాలున్నాయి. సిగిజ్మండ్‌ కథ రాయడం కోసం నిరాహారంగానూ, మంచులో గడ్డకట్టే చలి లోనూ ఉంటూ ఇంద్రియాలను ప్రేరేపించి తత్పరిణామంగా భ్రాంతి లేదా భ్రమ (hallucinatory literary purposes) ఉత్పన్నమయ్యే దిశగా తన శరీరంపై ప్రయోగాలు చేసుకునే వారట. నటుల విషయంలో శారీరకమైన ప్రదర్శన అవసరం కాబట్టి ఇటువంటివి సహజమే కానీ రచయితల్లో కూడా ఇటువంటి వారు ఉన్నారని తెలిసి ఆశ్చర్యం కలుగు తుంది. రచయితకు అవసరమైన సృజనాత్మకత కేవలం మెదడులో జనించి, మెదడులో అంతమయ్యేది కాదనీ, అది శారీరక- మానసిక సమతౌల్యంలో నుంచి పుడుతుందనీ సిగిజ్మండ్‌ లాంటి రచయితల జీవితాలు నిరూపిస్తాయి.


అక్షరాలకు ప్రాణం ప్రతిష్ఠ చెయ్యడం రచయితలు చేసే పని కాబట్టి ‘ది లెటర్‌ కిల్లర్స్‌ క్లబ్‌’ వంటి విచిత్రమైన పేరుని చూసి పాఠకుల్లో తలెత్తే అనేక ప్రశ్నలకు కార్ల్‌ ఎమర్సన్‌ ఆ రచనకు రాసిన ముందుమాటలో పొందుపరచిన క్రిష్జిజానోవ్‌స్కీ రచనా వ్యాసంగంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు ధీటైన సమాధానా లిస్తాయి. ఒక రచయితగా అనేక వైఫల్యాలను (?) చవి చూసిన క్రిష్జిజానోవ్‌స్కీ ఒక దశలో అక్షరాల్ని కూడా గుర్తు పట్టలేని స్థితిలోకి వెళ్లిపోయారు. సైకియాట్రిస్ట్‌ ‘‘డూ యూ లవ్‌ పుష్కిన్‌?’’ అని అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వలేక ‘‘ఐ... ఐ...’’ అని తడబడుతూ ఉన్నట్లుండి పసిపిల్లాడిలా ఏడ్చారు. ఈ విషయాన్ని చెప్తూ ఆయన భార్య బోవ్షెక్‌ ఆ సమయంలో ముప్ఫయ్‌ ఏళ్ళుగా అదిమిపట్టిన కన్నీళ్ళ ప్రవాహంలో ఒక రచయిత అమూల్యంగా భావించే అక్షరాలు కూడా ఆనవాలు లేకుండా కొట్టుకుపోయాయంటారు. 


క్రిష్జిజానోవ్‌స్కీ రచనల్లోని అబ్‌స్ట్రాక్ట్‌ కాన్సెప్ట్స్‌ను మరింత లోతుగా అర్థంచేసుకోడానికి ‘లెటర్‌ కిల్లర్స్‌ క్లబ్‌’లో టైడ్‌ (రచయిత) అనే పాత్ర ప్రస్తావించే ‘పీపుల్‌ ప్లాట్స్‌ గఖి పీపుల్‌ థీమ్స్‌’ అనే అంశం తోడ్పడుతుంది. కథలను అల్లే విధానాన్ని బట్టి సాహితీ ప్రపంచంలో ‘పీపుల్‌ ప్లాట్స్‌ VS పీపుల్‌ థీమ్స్‌’ అని రెండు రకాలుంటాయంటాడు టైడ్‌. వీటిల్లో పీపుల్‌ ప్లాట్స్‌ అనేవి వ్యక్తులను ఆధారంగా చేసుకుని అల్లే సాధారణమైన కథలన్నమాట. ఈ కథల్లో వీటిల్లో సహజంగా ఉండే ‘నేను’ ఉనికిని కోరుకుంటుంది. కానీ పీపుల్‌ థీమ్స్‌ అనేవి అరుదైనవి, ఇవి ఒక మనిషికి సంబంధించినవిగా కాక, ఒక ఆలోచనకీ, భావానికీ సంబంధించివై ఉంటాయి. మల్టీ డైమెన్షన్స్‌లో అందరి దృష్టికీ అందని ఈ థీమ్స్‌ అబ్‌స్ట్రాక్ట్‌గా, నిష్ర్కియాత్మకంగా, అంతర్ముఖంగా ఉంటూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చెయ్యవు, పాఠకులే వాటిని వెతుక్కుంటూ వెళ్ళాలి. స్వభావ రీత్యా అంతర్ముఖుడైన క్రిష్జిజానోవ్‌స్కీ ఈ రెండవ పద్ధతిలో రాసే రచయితే.


‘ది లెటర్‌ కిల్లర్స్‌ క్లబ్‌’లో ఒక్కో వారం ఒక్కో రచయిత ఒక కొత్త కథను చెబుతూ ఉంటాడు. రచయితలోని సృజనాత్మకత అక్షరరూపం దాల్చి కాగితం మీదకు చేరకుండానే వాటిని ఒకరి కొకరు చెప్పుకుని శబ్ద రూపంలో ఉండగానే అక్షరాలను చంపేస్తూ ఉంటారు. ఈ క్రమంలో దాస్‌ అనే రచయిత చెప్పే ‘ఎక్సెస్‌’ (Exes) అనే డిస్టోపియాన్‌ హారర్‌ స్టోరీ మరో కథల సంపుటి ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్‌ ఎ కార్ప్‌స్‌’లోని ‘ఎల్లో కోల్‌’ కథను తలపిస్తుంది. ఈ పూర్తి స్థాయి సైన్స్‌ ఫిక్షన్‌ కథలో ప్రత్యేకత ఏమిటంటే నేటి తరంలో చూస్తున్న ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, రోబోటిక్స్‌ లాంటి అంశాలను సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోలేని ఆ రోజుల్లోనే అలవోకగా రాశారు క్రిష్జిజానో వ్‌స్కీ. మరోచోట ఫెవ్‌ అనే రచయిత చెప్పిన ‘టేల్‌ ఆఫ్‌ ది త్రీ మౌత్స్‌’ అనే కథలో ఇంగ్‌, నిగ్‌, గ్ని అనే పేర్లు కలిగిన మూడు పాత్రలను విష్ణుశర్మ పంచతంత్రంలోని ముగ్గురు బ్రాహ్మణు లతో పోల్చడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటువంటివి చదివినప్పుడు క్రిష్జిజానోవ్‌స్కీని రష్యన్‌ బోర్హెస్‌గా ఎందుకు అభివర్ణిస్తారో పూర్తిగా అవగతమవుతుంది. ‘‘తన రచనలు అందరికోసమో, కొందరికోసమో కాదని’’ ఘంటాపథంగా చెప్పే బోర్హెస్‌ గళాన్ని తనదైన శైలిలో తన రచనల ద్వారా మరోసారి వినిపించే ప్రయత్నం చేశారు క్రిష్జిజానోవ్‌స్కీ.  ఈయన రచనల్లో భారతీయ పాఠకుల్ని ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురిచేసే మరో అంశం భారతీయ జానపదాల గురించిన ప్రస్తావనలు. మంచి రష్యన్‌ కథ మధ్యలో ఉన్నట్లుండి విక్రమార్కుడు-భేతాళుడి ప్రస్తావన ఎవరూహిస్తారు! బోర్హెస్‌, ఉర్సులా లెగైన్‌ వంటి కొందరు ‘ఫెంటాస్టిక్‌ జానర్‌’ రచయితల్లాగే క్రిష్జిజానోవ్‌స్కీకి కూడా అంతర్జాతీయ సాహిత్యం మీద, అందులోనూ మన భారతీయ జానపదాల మీద ఉన్న అవగాహన అబ్బుర పరుస్తుంది. దీనికి తోడు క్రిష్జిజానోవ్‌స్కీ ప్రాచీన భారతీయ తత్వాన్ని కూడా ఔపాసన పట్టారనడానికి ఆయన కథల్లో అనేక ఋజువులు కనిపిస్తాయి. గూగుల్‌ లేని కాలంలోనే పూర్వపక్షం గురించీ, పతంజలీ, వ్యాసుల గురించిన ప్రస్తావ నలు ఆయనకు దేశవిదేశీ  సాహిత్యంపై ఉన్న విస్తృతమైన అవగాహనకు కొన్ని మచ్చు తునకలు మాత్రమే. నిజానికి ఈయన సమకాలీనులైన బోర్హెస్‌, కాఫ్కా వంటి వారికి లభ్య మైన ఆధునిక గ్రంథాలు సిగిజ్మండ్‌కు అందుబాటులో లేనప్ప టికీ ఆయన లైబ్రరీలో పుష్కిన్‌, పో, గోగోల్‌ వంటివారు కొలువు దీరి ఉండేవారంటారు. ఇన్ని పరిమితుల మధ్య కూడా ఒక చిన్న ‘షూ బాక్స్‌’ సైజు గదిలో రెండు దశాబ్దాల తరబడి ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా రచనలు చేసిన క్రిష్జిజానోవ్‌స్కీని ఒక ఋషిగా భావించడంలో గానీ, ఆయన కలం నుండి వెలువడ్డ రచనల్ని అపురూపమైన కళాఖండాలు అనడంలో గానీ ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈ రష్యన్‌ రచయితను ఒకసారి చదివితే పాఠకులుగా ఇకముందు ఏ రచనను విశ్లేషించి చూడా లన్నా  క్రిష్జిజానోవ్‌స్కీని చదవక మునుపు, చదివిన తరువాత అనుకునేలా చేస్తాయి. మన దృష్టిని దాటిపోయిన అతి చిన్న బిందువు వద్దే క్రిష్జిజానోవ్‌స్కీ కథకు రూపకల్పన మొదలవు తుంది. అదే విధంగా మన ఊహాశక్తి  శూన్యగతిని చేరే చోటు లోనే ఆయన ఊహాలోకపు  ద్వారాలు తెరుచుకుంటాయి.


ఒక మనిషి కొన్ని పదాలు రాస్తే అందులో ఎంతో కొంత అతని ఆత్మ కనిపిస్తుంది. ఇంకొన్ని పదాలు రాస్తే ఆ సదరు వ్యక్తి అస్తిత్వాన్ని గురించి ఒక అవగాహనకు వస్తాం. కానీ క్రిష్జిజానోవ్‌స్కీ కథలెన్ని చదివినా పాఠకులకు ఆయన ఒక అంతుపట్టని ఎనిగ్మా గానే మిగిలిపోతారు. ఇలాంటి రచయి తలు పాఠకుల ఊహలకు రెక్కలిస్తారే గానీ దిశానిర్దేశం చెయ్యరు. వాస్తవానికీ, ఊహకీ మధ్య రెపరెపలాడే క్షణ కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే అరుదైన రచయిత ఆయన. వాస్తవంలో సాధ్యంకాని విషయాలను సృజనాత్మ కతతో సుసాధ్యం చెయ్యడంలో భాషని ఒక సాధనంగా ఎంత నేర్పుగా ఉపయోగీంచవచ్చో క్రిష్జిజానోవ్‌స్కీ కథలు చదివితే అర్థమవుతుంది. ఉర్సులా లెగైన్‌ అన్నట్లు అమెజాన్‌ టాప్‌ 100లోనో, మాన్‌ బుకర్‌, నోబెల్‌ ప్రైజుల్లోనో సాహిత్యాన్ని కొలుస్తున్న ఈ కాలంలో కూడా ఎక్కడో ఒక మారుమూల గదిలో క్రిష్జిజానోవ్‌స్కీ లాంటి వాళ్ళు గెలుపోటములతో ప్రమేయం లేకుండా అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టిస్తూ ఉండే ఉంటారు.

నాగిని కందాళ

nagini.kandala@gmail.com

Updated Date - 2021-12-13T05:57:23+05:30 IST