అదనపు పంచాయతీ.. పని భారంతో కార్యదర్శుల ఉక్కిరిబిక్కిరి

ABN , First Publish Date - 2020-08-10T17:27:30+05:30 IST

పంచాయతీ కార్యదర్శులు పని భారంతో సతమతం అవుతున్నారు. ఉన్న పనులతోనే ఇబ్బందులు పడుతుంటే అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆందోళన చెందుతున్నారు.

అదనపు పంచాయతీ.. పని భారంతో కార్యదర్శుల ఉక్కిరిబిక్కిరి

ఇతర పనులతో బెంబేలు 

కొత్త చట్టం ప్రకారం పెరిగిన బాధ్యతలు 

ఉపాధి హామీ పథకం.. రేషన్‌ బియ్యం పంపిణీ బయోమెట్రిక్‌ నమోదు కూడా..

మహబూబ్‌నగర్‌ జిల్లాలో రాజీనామా చేసిన పది మంది


మహబూబ్ నగర్(ఆంధ్రజ్యోతి): పంచాయతీ కార్యదర్శులు పని భారంతో సతమతం అవుతున్నారు. ఉన్న పనులతోనే ఇబ్బందులు పడుతుంటే అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆందోళన చెందుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పది మంది కార్యదర్శులు రాజీనామా చేయడం పని ఒత్తిడికి నిదర్శనంగా చెప్పొచ్చు.


విధి నిర్వహణ ఇలా..

ఉదయాన్నే ఏడు గంటలకు పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత తాగునీటి సరఫరాను పరిశీలిస్తారు.

పంచాయతీ పరిధిలోని ఆవాసాల్లో నాటిన మొక్కలను పరిశీలించి, ప్రతి మొక్క సంరక్షించడమే లక్ష్యంగా సిబ్బందితో రోజూ సమీక్ష చేస్తారు. రోజూ నర్సరీల నిర్వహణను పరిశీలిస్తారు.

ట్రాక్టర్ల నిర్వహణ, పన్నుల వసూళ్లపై సమీక్ష, పల్లె ప్రగతిలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, గ్రామ సభలు, పంచాయతీ సమావేశాలు, సర్పంచులకు అందుబాటులో ఉండి పంచాయతీ కార్యకలాపాలు, రికార్డుల నిర్వహణ చూస్తారు.

తాజాగా కొవిడ్‌-19 నిరోధక చర్యల పర్యవేక్షణ తాజాగా తప్పనిసరి అయ్యింది. 

నెలలో వారం రోజుల పాటు రేషన్‌ బియ్యం పంపిణీకి డీలర్ల వద్ద బయోమెట్రిక్‌ నమోదులో ఇబ్బందులుండే లబ్ధిదారులకు సంబంధించి బయోమెట్రిక్‌ నమోదు చేస్తారు.

ఏడు నెలలుగా ఉపాధి హామీ పథకం కింద ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించడంతో ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


ఆ పనుల నుంచి తప్పించండి..

ఈ పనులన్నింటి నిర్వహణతో రోజంతా పని ఒత్తిడి ఉంటోందని, ఉదయం ఏడు గంటలకు మొదల య్యే దినచర్య రాత్రి పది గంటల వరకు కొనసాగుతోందని కార్యద ర్శులు అంటున్నారు. దీంతో తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి లోనవుతున్నామని వాపోతున్నారు. కొత్తగా నియమితులైన జూని యర్‌ పంచాయతీ కార్యదర్శులైతే పని ఒత్తిడిని తట్టుకోలేక రాజీనా మాలు చేసే పరిస్థితి ఏర్పడు తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈ నాలుగు నెలల్లో పది మంది కార్యదర్శులు రాజీనామా చేసి, వేరే వృత్తుల్లోకి వెళ్లడం పని ఒత్తిడికి నిదర్శనం. పంచాయతీ రాజ్‌ కొత్త చట్టం ప్రకారం కార్య దర్శులు చేయాల్సిన విధులను తప్పనిసరిగా నిర్వహిస్తామని, అదే సమయంలో అదనంగా తమపై ఉంచిన ఉపాధి హమీ పథకం అమలు, రేషన్‌ బియ్యం పంపిణీకి బయెమెట్రిక్‌ పనుల బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.


ఉపాధి పథకం నిర్వహణపై శిక్షణకు ఆదేశం

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనుల ఎంపిక, నిర్వహణ, కూలీల మస్టర్ల నమోదుపై కార్యదర్శులకు శిక్షణ ఇప్పించాలని కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో కార్యదర్శుల్లో ఆందోళన మొదలైంది. ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు సమ్మెకు దిగడంతో జనవరిలో వారిని సస్పెండ్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచి తాత్కాలికంగా వారి బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. జూలై 27న ఫీల్డ్‌ అసిస్టెంట్లను రిమూవ్‌ చేస్తూ, సర్క్యులర్‌ నంబర్‌ 4776ను జారీ చేసింది. తాజాగా కార్యదర్శులకు ఉపాధి పనుల నిర్వహణకు అవసరమైన శిక్షణ ఇప్పించాలని కలెక్టర్లకు ఆదేశాలు రావడంతో ఇకపై శాశ్వతంగా వారికే ఈ విధులను అప్పగించే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2020-08-10T17:27:30+05:30 IST