‘అసాని’ ప్రభావం... సముద్రం అల్లకల్లోలం

ABN , First Publish Date - 2022-05-12T14:06:48+05:30 IST

‘అసాని’ ప్రభావం రాష్ట్రంలోనూ వణుకు పుట్టిస్తోంది. తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు సముద్ర తీరప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో చెంగల్పట్టు, కడలూరు,

‘అసాని’ ప్రభావం... సముద్రం అల్లకల్లోలం

- బిక్కుబిక్కుమంటున్న తీరం

- మరో మూడు రోజులు వర్షాలు

- చెన్నైలో పలు విమానాల రద్దు


చెన్నై: ‘అసాని’ ప్రభావం రాష్ట్రంలోనూ వణుకు పుట్టిస్తోంది. తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు సముద్ర తీరప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో చెంగల్పట్టు, కడలూరు, తంజావూర్‌, కన్నియాకుమారి వంటి జిల్లాల్లో ఆందోళన నెలకొంది. అయితే చెన్నైలోని కొన్నిచోట్ల మాత్రం సముద్రుడు గంభీరంగా దర్శనమివ్వగా, మరికొన్ని చోట్లు అలలు అల్లకల్లోలంగా తీరంవైపు పరుగులుతీశాయి. ముఖ్యంగా, కడలూరు జిల్లా తాళంగుడ తీర ప్రాంతంలో అలలు 20 నుంచి 30 అడుగుల ఎత్తున ఎగసిపడ్డాయి. దీంతో, తీర ప్రాంతాల్లోని కొబ్బరి చెట్లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. రాష్ట్రంలో చేపల వేటపై నిషేధం ఉన్న నేపధ్యంలో, ఫైబర్‌ పడవలు తీరానికి పరిమితం కాగా, నాటు పడవల్లో మాత్రమే జాలర్లు చేపల వేటకు వెళుతున్నారు. తుఫాను కారణంగా వాతావరణ శాఖ హెచ్చరికలతో నాటు పడవల జాలర్లు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. 


తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో 

‘అసాని’ ప్రభావంతో మరో మూడు రోజులు తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తామని వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులు మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ తుఫాను కారణంగా రాష్ట్రంలో ఎలాంటి విపత్తులు సంభవించకపోయినా, అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని నగరం చెన్నైలో రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటూ కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. పగటి ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 26 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.


బుధవారం కూడా...

వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో బుధవారం చెన్నై నుంచి వెళ్లే 17 విమానాలు రద్దయ్యాయి. విశాఖకు వెళ్లాల్సిన మూడు విమానాలు, విజయవాడకు వెళ్లే రెండు, రాజమండ్రికి వెళ్లాల్సిన ఒక విమానం రద్దయింది. అలాగే, విశాఖపట్టణం, విజయవాడ, రాజమండ్రి నుంచి చెన్నై రావాల్సిన ఆరు విమానాలు రద్దయ్యాయి. బెంగుళూరు, జైపూర్‌, కోల్‌కతా, హైదరాబాద్‌ తదితర నగరాలకు వెళాల్సిన ఐదు విమానాలు రద్దయ్యాయి. ఇక, చెన్నై నుంచి అండమాన్‌కు ఉదయం 8.15 గంటలకు బయల్దేర్సాన విమానం 11.30 గంటలకు, 8.30 గంటలకు బయల్దేరాల్సిన విమానం మధ్యాహ్నం ఒంటిగంటకు వెళ్లాయి. తుఫాను కారణంగా సోమవారం చెన్నై నుంచి వెళ్లాల్సిన పది విమానాలు రద్దయిన విషయం తెలిసిందే.

Read more