Advertisement
Advertisement
Abn logo
Advertisement

నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలను ముంచెత్తిన భారీ వర్షాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు వీడడంలేదు. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇటీవల వర్షాలు మిగిల్చిన కష్టం నుంచి కోలుకోకముందే మళ్లీ రాయలసీమలో వర్షాలు కురవడం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది. చెరువులు నిండుగా ఉండడంతో వర్షాపునీరు రోడ్లపై పారుతోంది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొన్ని గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమశిలకు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. అనంతసాగర మండలం వైకుంఠపాడు దగ్గర అలుగు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.


కడప జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగడంతో పల్లెలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. రైల్వే కోడూరు శివారులోని ఒడ్డున ఉన్న రెండిళ్లు కుప్పకూలి నదిలో కలిసిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇళ్లంతా పగుళ్లు రావడంతో ఇంట్లోవాళ్లు ముందే బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది.


చిత్తూరు జిల్లా నగరి మండలం తెరని గ్రామం దగ్గర బ్రిడ్జి తెగిపోయింది. శ్రీకాళహస్తి మండలంలో కాండ్రకుంట చెరువు తెగింది. తిరుమల, తిరుపతిలోనూ ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం నాటికి మరింత బలపడే అవకాశముంది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ అల్పపీడనం తీవ్రవాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 3 రాత్రి నుంచి ఉత్తరకోస్తా, ఒడిశాలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement