Abn logo
Sep 12 2020 @ 10:20AM

కర్ణాటకలో మళ్లీ వర్ష బీభత్సం.. లోతట్టు ప్రాంతాలు జలమయం!

బెంగళూరు: ఇటీవల కర్ణాటక రాష్ట్రాన్ని కుదేలు చేసిన వర్షాలు మరోసారి విజృంభించాయి. ఓ నాలుగు రోజులు తగ్గినట్లే కనిపించినా, ఇప్పుడు మళ్లీ రాష్ట్రాన్ని నీట ముంచుతున్నాయి. గురువారం నుంచీ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాలకు మంగళూరు ప్రాంతం నీట మునిగింది. ప్రజలు కనీసం ఇళ్ల నుంచి బయటకు కూడా రాలేని పరిస్థితి. ముఖ్యంగా జప్పినమొగారు, కొట్టార చౌకి తదితర ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దీంతో ఈ ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం నుంచీ ఈ ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు పని ప్రారంభించాయి. ఈ ప్రాంతాల్లో పర్యటించిన మేయర్ దివాకర్ పందేశ్వర్ పరిస్థితిని స్వయంగా సమీక్షించారు.

కర్ణాటకలో ఇటీవల వర్షాలు విజృంభించడంతో వరదలు పోటెత్తాయి. ఈ వరదల ధాటికి ధార్వాడ్, బెళగావి, కొడగు, చిక్‌మంగళూరు తదితర ప్రాంతాల్లో కొండచెరియలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో రహదారులు కూడా ధ్వంసమయ్యాయి. పంటలు, తోటలు నాశనమైపోయాయి. ఈ వరదల కారణంగా రాష్ట్రానికి కనీసం 80వేల కోట్ల నష్టం జరిగి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థికసాయం కోరింది. ఈ అభ్యర్థన అందుకున్న కేంద్ర ప్రభుత్వం.. జాయింట్ సెక్రెటరీ కేవీ ప్రతాప్ నేతృత్వంలో కర్ణాటకకు ఓ బృందాన్ని పంపింది. కర్ణాటకలో రెండు రోజులపాటు పర్యటించిన ఈ బృందం.. వరదల ధాటికి తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను సందర్శించింది. అధికారుల నివేదికలు తీసుకొని, స్థానికుల అభిప్రాయాలను సేకరించి తిరిగి ఢిల్లీ వెళ్లింది. మరోసారి ఈ బృందం కర్ణాటకలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటన అనంతరం రాష్ట్రంలో వరదల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేస్తారు.

ఇలా కేంద్ర బృందం ఢిల్లీ తిరిగి వెళ్లిందో లేదో మరోసారి కర్ణాటకను ముంచెత్తాయి. బుధవారం రాత్రి చిన్నగా మొదలై గురువారం ఉదయానికి భారీ వర్షాలుగా మారాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో చాలా మంది లోతట్టు ప్రాంతాల్లో నివశించే వారు నానా ఇబ్బందులూ పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావడం కూడా పెద్ద సమస్యగా మారింది. పరిస్థితి తెలుసుకున్న సర్కారు.. వెంటనే సహాయ చర్యలు ప్రారంభించింది. అగ్నిమాపక సిబ్బంది, రెస్య్యూ టీంలను రంగంలోకి దింపింది. రోడ్లన్నీ జలమయం కావడంతో నడవడం కూడా కష్టంగా మారింది. వాహనాలు మొరాయిస్తున్నాయి. ఈ క్రమంలో నీట మునిగిన ఆయా ప్రాంతాలను చేరుకున్న రెస్క్యూ టీం.. రబ్బర్ బోట్ల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. 

వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. కాలువ కట్టలు తెగి పంటలు నీట మునిగాయి. డ్రైనేజీలు నిండిపోవడంతో రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరింది. ఇళ్లలోకి కూడా ఈ నీరు చేరడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. వంట గదిలోకి డ్రైనేజీ నీరు చేరడంతో ఆహారం వండుకోలేక అవస్థలు పడ్డారు. పుత్తూరు, బంత్వాల్, సుళ్లియ, బెళ్తాంగడి, మూడిబిద్రి, కదాబా తదితర ప్రాంతాల్లో వర్షపాతం ఓ మోస్తరుగానే పడింది. ఈ పరిస్థితిని సమీక్షించిన వాతావరణ శాఖ.. మరో 48 గంటలపాటు రాష్ట్రంలో మెరుపులతో కూడిన భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదే పరిస్థితి శనివారం ఉదయం వరకూ కొనసాగొచ్చని తెలిపింది. ముఖ్యంగా శుక్రవారం, శనివారం తీరప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. 

శుక్ర, శని, ఆదివారాల్లో ఉడిపి జిల్లాలో భారీ నుంచి అతిభారీ స్థాయిలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు.. జిల్లాస్థాయి అధికారులెవరూ సెలవులు పెట్టొద్దని, ప్రతి ఒక్కరూ హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితి ఎదురైతే స్పందించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిన ఉన్నతాధికారులు.. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెంటనే 1077, 0820-2574802 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ప్రకటించారు.

Advertisement
Advertisement
Advertisement