కేరళను కుదిపేస్తున్న భారీ వరదలు.. ఏడు జిల్లాలలో ఆరెంజ్ హెచ్చరిక

ABN , First Publish Date - 2021-10-13T01:41:07+05:30 IST

భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. వరదలు బీభత్సం సృష్టిస్తుండడంతో భారత వాతావరణ శాఖ నేడు

కేరళను కుదిపేస్తున్న భారీ వరదలు.. ఏడు జిల్లాలలో ఆరెంజ్ హెచ్చరిక

తిరువనంతపురం: భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. వరదలు బీభత్సం సృష్టిస్తుండడంతో భారత వాతావరణ శాఖ నేడు (మంగళవారం) ఏడు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.  ఇందులో తిరువనంతపురం, కొల్లాం, పతనంథిట్ట, అళప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాలు ఉన్నాయి. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తిరువనంతపురం జిల్లాలోని అరువిక్కర, నెయ్యర్, పెప్పర రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేశారు. 


ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు నాలుగు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. కాగా, మలప్పురంలో ఇల్లు కూలి ఇద్దరు చిన్నారులు మరణించారు. ఈ ఉదయం కొండచరియలు విరిగిపడి ఇంటి వెనక భాగాన్ని బలంగా తాకడం ఇల్లు కూలిపోయింది. గాయపడిన ఇద్దరు చిన్నారులను కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే వారు మృతి చెందారు.


కొల్లాంలో 65 ఏళ్ల వృద్ధుడు గోవిందరాజ్ లోయలాంటి ప్రదేశంలో పడి ప్రాణాలు కోల్పోయాడు. వర్షాల కారణంగా ఆ ప్రదేశం పూర్తిగా నీటితో నిండి ఉండడంతో రోడ్డును గుర్తించలేక అందులో పడి మరణించాడు. భారీ వర్షాలతోపాటు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ఇడుక్కి జిల్లా కలెక్టర్ రాత్రి ప్రయాణాలను రద్దు చేశారు. 

Updated Date - 2021-10-13T01:41:07+05:30 IST