Heavy rain: బెంగళూరు - మైసూరు మధ్య రాకపోకలకు అంతరాయం

ABN , First Publish Date - 2022-08-30T18:29:40+05:30 IST

వరుణుడు కుదిపేస్తున్నాడు. రెండున్నర నెలలుగా రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే జలాశయాలు నిండుకుండలా

Heavy rain: బెంగళూరు - మైసూరు మధ్య రాకపోకలకు అంతరాయం

- రామనగర, మండ్య, మైసూరు జిల్లాల్లో భారీ వర్షం

- జనజీవనం అస్తవ్యస్తం

- మర్రిచెట్టు కూలి ఒకరి మృతి

- రామనగర జిల్లాలో సీఎం పర్యటన


బెంగళూరు, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): వరుణుడు కుదిపేస్తున్నాడు. రెండున్నర నెలలుగా రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే జలాశయాలు నిండుకుండలా మారాయి. వారం రోజులపాటు తగ్గిందని భావిస్తున్న తరుణంలో మూడు రోజులుగా మళ్లీ జోరందుకుంది. శనివారం నుంచి బెంగళూరు, మండ్య, రామనగర, మైసూరు(Bangalore, Mandya, Ramanagara, Mysore) ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తమయింది. బెంగళూరు - మైసూరు మధ్య పది లేన్ల రహదారిలో సోమవారం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండ్య, రామనగర, చామరాజనగర జిల్లాల వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తుండడంతో అక్కడ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జాతీయ రహదారిపై పలు చోట్ల వర్షపునీరు నిల్వ ఉండడంతో ప్రజలు ముందుకెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. రామనగరలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. బిడది నగరసభ పరిధిలోని తోరదొడ్డిలో మర్రిచెట్టు కూలిన ప్రమాదంలో కారులో వెళుతున్న బోరేగౌడ (50) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తోరదొడ్డి వద్ద నల్లిగుడ్డ చెరువు నుంచి ప్రమాదస్థాయికి మించి నీరు ప్రవహిస్తోంది. రామనగర వైపు వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బసవనపుర, మధుర గార్మెంట్స్‌ మధ్య వాహనంలో ఇరుక్కున్నారు. రామనగర జిల్లా వ్యాప్తంగా పరిస్థితి తారస్థాయికి చేరుతోందని వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని సీఎం బసవరాజ్‌ బొమ్మైని కుమారస్వామి కోరారు. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) రామనగర జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితిని సమీక్షించారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అశ్వత్థనారాయణకు పలు సూచనలు చేశారు. బెంగళూరు - మైసూరు మార్గాల మధ్య సంచరించే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గం మీదుగా ప్రయాణాలకు వీలు కల్పించాలని సూచించారు. బెంగళూరులో సీఎం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, 16 జిల్లాల అధికారులతో చర్చించానన్నారు. బెంగళూరు - మైసూరు మధ్య వాహనాల్లో వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. రామనగర, చెన్నపట్టణ ప్రాంతాలలోని వర్షపీడిత ప్రాంతాలను సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కుమారస్వామి, మంత్రులు అశ్వత్థనారాయణ, అశోక్‌  పాల్గొన్నారు. 




Updated Date - 2022-08-30T18:29:40+05:30 IST