వరద నీటితో పొంగిపొర్లుతున్న నదులు

ABN , First Publish Date - 2022-07-09T16:32:58+05:30 IST

కుండపోతగా వర్షం కురుస్తుండడంతో నదులు, వంకలు, వాగుల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. బళ్లారి, విజయనగర, కొప్పళ, చిత్రదుర్గ

వరద నీటితో పొంగిపొర్లుతున్న నదులు

- తుంగభద్ర డ్యాంకు రెండురోజుల్లో 12 టీఎంసీల చేరిక

- నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు


బళ్లారి(బెంగళూరు), జూలై 8 (ఆంధ్రజ్యోతి): కుండపోతగా వర్షం కురుస్తుండడంతో నదులు, వంకలు, వాగుల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. బళ్లారి, విజయనగర, కొప్పళ, చిత్రదుర్గ జిల్లాల్లో భారీ వానలు కురుస్తుండగా తుంగభద్ర జలాశయం పై భాగంలో ఉండే శివమొగ్గ, ఇతర జిల్లాల్లో అతిభారిగా కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అతలాకుతలమయింది. తుంగభద్ర నదితీరంలోని విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి, హువ్వినహడగలి, హర్పనహళ్లి సమీపంలోని 15 గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలించారు. నది పరివాహక ప్రాంతాల జనం ఇక్కడ ఎవరూ ఉండరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుంగభద్ర జలాశయానికి రెండు రోజుల్లోనే 12 టీఎంసీల నీరు చేరాయి. శుక్రవారం ఉదయం నీటి లెక్కలు వేసే సమయానికి డ్యాంకు 64.728 టీఎంసీలు చేరాయి.  82,130 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 


ప్రమాదంలో నదీతీర గ్రామాలు

 తుంగభద్ర నదీ తీర గ్రామాలు పూర్థి స్థాయి ప్రమాదంలో చిక్కుకున్నాయి. గ్రామాలకు నాలుగు దిక్కులా నదులు, వంకలు, కాలువలు ఉండడం, నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఎలా బయటకు వెళ్లాలో తెలియక భయంతో ఆందోళన చెందుతున్నారు. హగరిబొమ్మనహళ్‌, హువ్వినఅడగలి తాలూకాల్లో ఉండే తండాలు పూర్తీగా జలధిగ్భంలో చిక్కుకున్నాయి. వీరిని రక్షించేందుకు విపత్తు సహాయ బృందాలను రంగంలోకి దింపినట్లు విజయనగర జిల్లా అధికారి శ్రావణ్‌ తెలిపారు. 

Updated Date - 2022-07-09T16:32:58+05:30 IST