మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!

ABN , First Publish Date - 2020-10-18T22:46:59+05:30 IST

గత మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే.

మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!

హైదరాబాద్ : గత మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ భారీ వర్షాల నుంచి ఇంకా తేరుకోకమునుపే వాతావరణ శాఖ ఒకింత షాకింగ్ న్యూస్ తెలిపింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణాంధ్ర తీరానికి దగ్గరలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 1.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఉందని అధికారులు తెలిపారు. తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఉండటంతో దీని ప్రభావం వలన రాగల 24 గంటలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తదుపరి 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని.. తద్వారా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది.


భయం.. భయం..!

ఇప్పటికే భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు హడలెత్తిపోతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రెండు రాష్ట్రాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజుల పాటు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జనాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక వర్షాల ప్రభావం హైదరాబాద్‌పై అధికంగానే ఉంది. రాజధాని నగరంలోని పలు కాలనీలు, బస్తీలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి.

Updated Date - 2020-10-18T22:46:59+05:30 IST