రాష్ట్రంలో నేడు, రేపు అతి భారీ వర్షాలు

ABN , First Publish Date - 2022-08-07T07:53:10+05:30 IST

కృష్ణా బేసిన్‌తో పాటు కర్ణాటకలోని బీమా, తుంగభద్ర క్యాచ్‌మెంట్‌ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది.

రాష్ట్రంలో నేడు, రేపు అతి భారీ వర్షాలు

నెమ్మదించిన కృష్ణమ్మ ! 

శ్రీశైలం ప్రాజెక్టుకు తగ్గిన వరద.. జలాశయం క్రస్ట్‌ గేట్ల మూసివేత


నేడు 12 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

1.34 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 

సాగర్‌, తుంగభద్రకు 70వేల క్యూసెక్కులు 

రాష్ట్రంలో నేడు, రేపు అతి భారీ వర్షాలు 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

కృష్ణా బేసిన్‌తో పాటు కర్ణాటకలోని బీమా, తుంగభద్ర క్యాచ్‌మెంట్‌ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో శనివారం రాత్రి  7.20 గంటల సమయానికి ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్లను మూసివేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 884.70 అడుగులు ఉంది. పూర్తి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకుగాను ప్రస్తుతం 213.8824 టీఎంసీలుగా నమోదైంది. ప్రస్తుతం 1.34 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. నాగార్జునసాగర్‌ జలాశయానికి 76 వేల క్యూసెక్కులు, తుంగభద్ర ప్రాజెక్టుకు 71 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది.


కృష్ణాకు ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో తగ్గింది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 30 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... ఔట్‌ఫ్లో లేదు. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 4 వేలు, జూరాలకు 67 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక, గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 78 వేలు, ఎల్లంపల్లికి 1.99 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీకి 1.60  లక్షల క్యూసెక్కులు, తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీకి 2.92 లక్షల క్యూసెక్కులు, దుమ్ముగూడెం(సీతమ్మసాగర్‌)కు 3.28 లక్షల క్యూసెక్కులు, అన్నారం(సరస్వతి) బ్యారేజీకి 1.38 లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా... వచ్చింది వచ్చినట్లే దిగువకు వదిలిపెడుతున్నారు. ఇక సుందిళ్ల (పార్వతి) బ్యారేజీకి 1.76 లక్షల క్యూసెక్కులు రాగా... దిగువకు 1.69 లక్షల క్యూసెక్కులను వదిలిపెడుతున్నారు.


కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు 4353 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. కాగా, ఉమ్మడి ఖమ్మం, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, పెద్దపల్లి జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిసాయి. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లో సుమారు 30 వేల టన్నుల సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. కాగా తెలంగాణలో కృష్ణా, గోదావరి బేసిన్‌లలోని 9 ప్రాజెక్టుల కింద 11 చోట్ల జలవిద్యుత్తు కేంద్రాలుండగా... అన్నిచోట్ల దండిగా కరెంట్‌ ఉత్పత్తి అవుతోంది. అన్ని కేంద్రాల్లో కలుపుకొని 3.10 కోట్ల యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుండగా... రోజుకు రూ.12 కోట్లకు పైగా ఆదాయాన్ని జెన్‌కో ఆర్జిస్తోంది. ఈ సీజన్‌లో అన్ని కేంద్రాల్లో కలుపుకొని 834.86 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి జరగడం విశేషం. 


24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం

రాష్ట్రంలో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు, సోమవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాగల మూడు రోజుల పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 24 గంటల్లో వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఆదివారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది.  

Updated Date - 2022-08-07T07:53:10+05:30 IST