తప్పిన ముప్పు

ABN , First Publish Date - 2021-12-05T08:03:22+05:30 IST

ఉత్తరాంధ్ర జిల్లాలకు జవాద్‌ తుఫాన్‌ ముప్పు తప్పింది. తుఫాన్‌ బలహీనపడి శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం విశాఖపట్నానికి 180 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, గోపాల్‌పూర్‌కు 260 కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. తీవ్ర వాయుగుండం ఒడిసా వైపు పయనించే క్రమంలో..

తప్పిన ముప్పు

  • బలహీనపడిన ‘జవాద్‌’ తుఫాన్‌
  • తీవ్ర వాయుగుండంగా మార్పు.. ఒడిసా దిశగా పయనం
  • నేడు శ్రీకాకుళంలో భారీ వర్షాలు, గాలుల తీవ్రత 
  • ఓడరేవుల్లో 4వ నంబరు భద్రతా సూచిక 
  • నెట్‌, ఎంబీఏ(ఐబీ) ప్రవేశ పరీక్ష వాయిదా 
  • కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులకు బ్రేక్‌ 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

ఉత్తరాంధ్ర జిల్లాలకు జవాద్‌ తుఫాన్‌ ముప్పు తప్పింది. తుఫాన్‌ బలహీనపడి శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం విశాఖపట్నానికి 180 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, గోపాల్‌పూర్‌కు 260 కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. తీవ్ర వాయుగుండం ఒడిసా వైపు పయనించే క్రమంలో తీరానికి చేరువగా రానుండటంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొన్నారు. తాజా పరిస్థితుల ప్రకారం ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ ముప్పు తప్పినట్టేనని వివరించారు. జవాద్‌ తుఫాన్‌ శుక్రవారం రాత్రి వరకు వడివడిగా తీరం దిశగా పయనించింది. ఈ క్రమంలోనే బలపడి తీవ్ర తుఫాన్‌గా మారాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించకపోవడంతో పాటు దిశ మార్చుకునే క్రమంలో బాగా నెమ్మదించింది. శనివారం తెల్లవారుజాము నుంచి బాగా నెమ్మదించి గంటకు 6కి.మీ. వేగంతో పయనిస్తోంది. ఉదయం కొన్ని గంటల పాటు స్థిరంగా ఉండిపోయింది. ఈ సమయంలో తుఫాన్‌ పరిసరాలకు ఏడెనిమిది కిలోమీటర్లపైన గాలులు పలు దిశల్లో పయనించడం, ఉత్తరాది నుంచి చలిగాలులతో బంగాళాఖాతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గాయి.


దీంతో తుఫాన్‌ పైనున్న మేఘాలు ఒడిసా, పశ్చిమ బెంగాల్‌ వైపు పయనించాయి. వీటి ప్రభావంతో తుఫాన్‌ బలహీనపడిందని నిపుణులు చెబుతున్నారు. తుఫాన్‌ తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని అమెరికన్‌ నేవీ వాతావరణ సంస్థ జేటీడబ్ల్యు శనివారం మధ్యాహ్నం ప్రకటించింది. కాగా, తీవ్ర వాయుగుండం తొలుత ఉత్తర వాయవ్యంగా తరువాత ఉత్తర ఈశాన్యంగా పయనించి ఆదివారం ఉదయానికి పూరికి చేరువగా రానుందని వాతావరణ శాఖ తెలిపింది. తరువాత ఉత్తర ఈశాన్యంగా పయనించి మరింత బలహీనపడి ఉత్తర ఒడిసా, పశ్చిమ బెంగాల్‌ తీరాల దిశగా పయనించనుందని పేర్కొంది. శనివారం రాత్రి నుంచి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు, గాలులు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం ఉత్తరాంధ్రలో ఎక్కువచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఓడరేవుల్లో నాలుగో నంబరు, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో రెండో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. సముద్రం అలజడిగానే ఉన్నందున ఆదివారం రాత్రి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. తుఫాను ప్రభావిత రాష్ట్రాల్లో ఈ నెల 5న నిర్వహించాల్సిన యూజీసీ-నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ వాయిదా పడింది. అలాగే ఈ నెల 5న జరగాల్సిన ఎంబీఏ కోర్సు ప్రవేశ పరీక్ష కూడా వాయిదా పడింది. 


శ్రీకాకుళం, విజయనగరం అప్రమత్తం 

తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఆదివారం సాయంత్రం వరకు వర్షాలు, గాలులు ఉంటాయని వివరించింది. జవాద్‌ తుఫాన్‌ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. వారం కిందట కాకినాడలోని ఉప్పలంక, పగడాలపేటకు చెందిన రెండు బోట్లు వేటకు వెళ్లగా వాటి ఆచూకీ దొరకడం లేదు. వాటిలో 15మంది మత్స్యకారులు ఎక్కడున్నారో తెలియడంలేదు. దీంతో జిల్లా మత్స్యశాఖ కాకినాడ కోస్టుగార్డు సాయం కోరింది. 


నష్టం రాకుండా చర్యలు: మంత్రి బొత్స

తుఫాన్‌ ప్రభావంతో వరికి నష్టం సంభవించకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి బొత్స సత్యనారాయాణ అన్నారు. విజయనగరం జిల్లాలో రైతులకు సుమారు 1,500 టార్పాలిన్లను ముందుగా అందజేశామన్నారు. అధికారులు చెప్పేవరకూ తుఫాన్‌ షెల్టర్ల నుంచి ఎవరూ ఇళ్లకు వెళ్లవద్దని మంత్రి కోరారు. 


తీవ్ర వాయుగుండంగా మార్పు ఒడిసా దిశగా జవాద్‌ పయనం

కొబ్బరి చెట్టు మీద పడి విద్యార్థిని మృతి

వజ్రపుకొత్తూరు, డిసెంబరు 4: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మెళియాపుట్టిలో శనివారం ఉదయం ఘోరం జరిగింది. ఇటికి సమీపంలోని కొబ్బరితోపులో కాలకృత్యాలు తీర్చుకుంటున్న ఇంటర్‌ విద్యార్థిని గొరకల ఇందు (17)పై భారీ కొబ్బరి చెట్టు పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈదురుగాలులు తోడై చెట్టు నేలకొరిగింది. 


ఊపిరి పీల్చుకున్న రైతులు 

ఉత్తరాంధ్రని వణికించిన జవాద్‌ తుఫాన్‌ దిశ మార్చుకుని, ఒడిసా వైపు వెళ్లిపోవడంతో అన్నదాతలు ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణా, గోదావరి డెల్టాతో పాటు ఉత్తరాంధ్రలోనూ వరి పంట కోత దశలో ఉంది. వరుస వర్షాలతో కోతలు పూర్తి చేయకుండా రైతులు వేచి చూస్తున్నారు. అయితే ఈ తుఫాన్‌కు కాస్త పొడి వాతావరణం ఉండటంతో కోతలు చేపట్టారు. ముందుగా కోసి, నూర్చిన ధాన్యాన్ని ఇళ్లకు తరలించినా, ఇంకా ఓదెలపైనున్న వరి, కోసి కుప్పల్లో ఉన్న ధాన్యం గత 48గంటల్లో కురిసిన వర్షాలకు కొంత తడిసింది. 

Updated Date - 2021-12-05T08:03:22+05:30 IST