తడిసి ముద్దయిన జిల్లా

ABN , First Publish Date - 2020-08-15T09:44:02+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం ఏజెన్సీలోని పలు మండలాల్లో భారీవర్షాలు కురవగా, మిగిలిన మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి.

తడిసి ముద్దయిన జిల్లా

అల్పపీడనం ప్రభావంతో అంతటా ముసురు వాతావరణం

ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

ఉధృతంగా ప్రవహిస్తున్న మత్స్యగెడ్డ పాయలు

మైదాన ప్రాంతంలో ఒక మోస్తరు వర్షం

మెట్ట పంటలకుఎంతో దోహదమంటున్న రైతులు


పాడేరు/చోడవరం/అనకాపల్లి అగ్రికల్చర్‌/చింతపల్లి, ఆగస్టు 14:

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం ఏజెన్సీలోని పలు మండలాల్లో భారీవర్షాలు కురవగా, మిగిలిన మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. ఒడిశాను ఆనుకుని వున్న ముంచంగిపుట్టు, పెదబయలు, డుంబ్రిగుడ లతోపాటు జి.మాడుగుల మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. ఈ మండలాల్లోని గెడ్డలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపో యాయి. కాగా పాడేరు, హుకుంపేట, అరకులోయ, అనంతగిరి, చింతపల్లి, జీకే వీధి మండలాల్లో మోస్తరు వర్షం పడింది. 


మైదాన ప్రాంతంలో ముసురు

అల్పపీడన ప్రభావంతో మైదాన ప్రాంతంలోని అన్ని మండలాల్లో శుక్రవారం ముసురు వాతావరణం నెలకొంది. ఉదయం నుంచీ జల్లులు పడుతూనే ఉన్నాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సమాచారంతో రైతులు ఊరట చెందుతున్నారు. ముఖ్యంగా మెట్ట పంటలకు ఈ వర్షాలు ఎంతో దోహదం చేస్తాయని, వరి నాట్లు ఊపందుకుంటాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. చోడవరం, రావికమతం బుచ్చెయ్యపేట, మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, ఎస్‌.రాయవరం, నక్కపల్లి, అనకాపల్లి, కోటవురట్ల, గొలుగొండ, నర్సీపట్నం, ఎలమంచిలి, కశింకోట మండలాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. 


ఇంటిపై కూలిన చెట్టు

జి.మాడుగుల మండలాన్ని భారీవర్షాలు వీడడం లేదు. వరుసగా నాలుగో రోజైన శుక్రవారం కూడా కుండపోత వర్షం పడింది. బొయితిలి పంచాయతీ తోకగరువు గ్రామంలో ఒక ఇంటిపై చెట్టు కూలింది. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు.


రాగల ఐదు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

ఏజెన్సీలో రానున్న ఐదు రోజుల్లో ఒక మోస్తరు నుంచి భారీవర్షం కురుస్తుందని చింతపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ జి.రామారావు తెలిపారు. శనివారం అరకులోయ, పాడేరు, చింతపల్లి సబ్‌ డివిజన్ల పరిధిలో 58.2 ఎం.ఎం. నుం చి 69.8 ఎం.ఎం. వరకు వర్షపాతం నమోదు అవుతుందని, 19వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 


నేటి నుంచి మూడు రోజులు మోస్తరు వర్షాలు

రాగల ఐదు రోజులు జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండి శని, ఆది, సోమవారాల్లో ఒక మోస్తరుగా, 18, 19 తేదీల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఆర్‌ఏ ఆర్‌ఎస్‌ వాతావరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.బి.జి. ఎస్‌.కుమారి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.


నగరంలో 4 సెం.మీ. వర్షం

విశాఖపట్నం: అల్పపీడనం ప్రభావంతో నగరంలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీవర్షం కాకపోయినా రోజంతా జల్లులు పడుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ స్తంభించిపోయి మ్యాన్‌హోల్‌ నుంచి మురుగునీరు రోడ్లపై ప్రవహించింది. విశాఖపట్నం అర్బన్‌లో 4 సెం.మీ., విమానాశ్రయం వద్ద 3 సెం.మీ., పెదగంట్యాడలో 3 సెం.మీ., పరవాడలో 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

Updated Date - 2020-08-15T09:44:02+05:30 IST