జోరు వాన

ABN , First Publish Date - 2020-09-16T10:17:28+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

జోరు వాన

ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌ 

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

దెబ్బతిన్న పంటలు.. ఇళ్లలోకి నీరు

మేడిపల్లి మండలంలో 16 సెం.మీ

నిండిన జలాశయాలు.. గేట్లు ఎత్తివేత

బంగాళాఖాతంలో ఇంకా అల్పపీడనం


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు భారీ వాన కురిసింది. దీంతో చెరువులు, కుంటలు నీటితో నిండి మత్తడి దూకుతున్నాయి.  


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు భారీ వాన కురిసింది.  చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి.


పలు ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. లోతట్టు   ఇళ్లలోకి నీరు చేరింది. నిజామాబాద్‌ జిల్లాలో తాత్కాలిక కల్వర్టులు కొట్టుకుపోయాయి. జిల్లా వ్యాప్తంగా 4.34 సెం.మీ. వర్షపాతం నమోదైంది. బోధన్‌ డివిజన్‌లోని మండలాల్లో పొలాలు దెబ్బతిన్నాయి.


మంజీరకు జలకళ వచ్చింది. కోటగిరి మండలంలో అత్యధికంగా 10.94 సెం.మీ. వర్షం పడింది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కౌలా్‌సనాలా ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరడంతో 6 గేట్లను ఎత్తారు.  ఆదిలాబాద్‌ జిల్లాలో  కుంటాల, పొచ్చెర జలపాతాలు కళకళలాడుతున్నాయి. కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా 3.39 సెం.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. అనేక గ్రామాల్లో విద్యుత్తు నిలిచిపోయింది. పిడుగులు పడి పశువులు మృతి చెందాయి. జగిత్యాల జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు వర్షం పడింది. మేడిపల్లి మండలంలో అత్యధికంగా 16 సెం.మీ, గొల్లపల్లిలో 12.82 సెం.మీ వర్షం కురిసింది. జగిత్యాలలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు మండలాల్లో వరి, మొక్కజొన్న నీట మునిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6.39 సెం.మీ., పెద్దపల్లి జిల్లాలో 2.32 సెం.మీ వర్షపాతం నమోదయింది. వికారాబాద్‌ జిల్లా ఽధారూరు మండలం రుద్రారం-నాగసమందర్‌, రాంపూర్‌-మన్‌సాన్‌పల్లి గ్రామాల మధ్య  తాత్కాలిక వంతెనలు వరద ఉధృతికి రెండోసారి కొట్టుకుపోయాయి. పెద్దేముల్‌ మండలం మన్‌సాన్‌పల్లి గ్రామ సమీపంలోని వాగుపై ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ వంతెన మరోసారి తెగిపోయింది.  


శ్రీరామసాగర్‌ 16 గేట్లు ఎత్తివేత

తెలంగాణలోని జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి.  నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామ సాగర్‌ ప్రాజెక్టుకు 75 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 16 గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు నాలుగు యూనిట్ల ద్వారా 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో లోయర్‌ మానేరు డ్యాంకు 41 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 20 గేట్లను ఎత్తి 40 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా, 23.602 టీఎంసీల నీరు ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌ మానేరు ప్రాజెక్టుకు 28,869 క్యూసెక్కుల నీరు చేరుతుండడంతో ఆరు గేట్లను ఎత్తి 15 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 27.5 టీంఎసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో 25.06 టీఎంసీల నీరు ఉంది.


84 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని  జూరాల 7 గేట్ల ద్వారా 50,274 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 1,29,527 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో నాలుగు గేట్లను ఎత్తి 1,25,896 క్యూసెక్కులను నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. సాగర్‌ ఆరు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 89,244 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 309.9 టీఎంసీల నీరుంది. పులిచింతల ప్రాజెక్టుకు 1,84,799 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 1,84,799 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.


వాగులో చిక్కుకున్న చిన్నారులు

నిర్మల్‌ జిల్లా భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు మంగళవారం గ్రామంలోని సాయిబాబా ఆలయం వద్ద ఆడుకుంటున్నారు. అంతలోనే భారీ వర్షం కురవడం.. సమీపంలోని వాగు పొంగడంతో నీటిలో చిక్కుకుపోయారు. దీంతో గ్రామ సర్పంచ్‌ అప్పటికప్పుడు జేసీబీని తీసుకొచ్చి ముగ్గురు చిన్నారులను రక్షించారు.

Updated Date - 2020-09-16T10:17:28+05:30 IST