Hyderabad: ఆగని వాన

ABN , First Publish Date - 2022-09-30T17:57:00+05:30 IST

గ్రేటర్‌ను వరుణుడు వీడడం లేదు. నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో పిల్లలకు కొత్త దుస్తులు

Hyderabad: ఆగని వాన

నాలుగు రోజులుగా..గ్రేటర్‌ను వణికిస్తున్న వరుణుడు

చలితో నగరవాసులు గజగజ


హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ను వరుణుడు వీడడం లేదు. నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో పిల్లలకు కొత్త దుస్తులు కొనుగోలు చేసేందుకు కూడా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు. 26వ తేదీ సాయంత్రం 5.30 నుంచి రాత్రి 12 గంటల వరకు  11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌లో ఇప్పటివరకు ఇది రికార్డుస్థాయిలో వర్షపాతం. నాలుగు రోజులుగా ఆకాశం మేఘావృతమై చల్లదనం ఏర్పడుతోంది. వర్షాల కారణంగా చలితీవ్రత కూడా ఒక్కసారిగా పెరిగింది. రోజువారీ సాధారణ గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతల కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. గురువారం బండ్లగూడలో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లింగోజిగూడలో 3.2, హయత్‌నగర్‌లో 2.7, అల్కాపురిలో 2.2, నాగోలులో 2, విరాట్‌నగర్‌లో 1.7 సెంటీమీటర్లు నమోదైంది. రాగల మూడు రోజులపాటు నగరవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.


కనిపించని అత్యవసర బృందాలు.. ఇదే కారణం!

 మహానగరంలో ఇటీవల కురుస్తోన్న వర్షాలకు రోడ్లపై భారీగా వరద నీరు నిలుస్తోంది. సాధారణ వర్షపాతం నమోదైనా.. ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వర్షాకాలం నేపథ్యంలో ఏర్పాటుచేసిన మాన్‌సూన్‌ అత్యవసర బృందాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరగడంతో రెండు వారాలుగా పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లు.. మాన్‌సూన్‌ బృందాలను రంగంలోకి దించలేదు. దీంతో సాధారణ వర్షం కురిసినా రోడ్లపై భారీగా వరద నీరు నిలుస్తోంది. గతంలో ప్రాంతాల వారీగా విధుల్లో ఉన్న 168 మాన్‌సూన్‌ బృందాలు వర్షం పడిన వెంటనే వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకునేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఏప్రిల్‌ నుంచి రూ. 800 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండడం.. మాన్‌సూన్‌ బృందాల్లోని కార్మికులకు చెల్లింపులు చేసే పరిస్థితి లేకపోవడంతో కొన్నిరోజులపాటు రావొద్దని కాంట్రాక్టర్లు కార్మికులకు చెప్పినట్టు తెలిసింది. పరిమిత స్థాయిలో అందుబాటులో ఉన్న డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ బృందాల ద్వారా పలుచోట్ల జీహెచ్‌ఎంసీ పనులు చేయిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. రహదారులు, డ్రైన్‌లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణ తదితర పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 800 కోట్లకుగాను.. రూ. 70 కోట్ల వరకు బిల్లులు చెల్లించిన అధికారులు పనులు చేయాలని కోరినా.. కాంట్రాక్టర్లు వినడం లేదని పేర్కొంటున్నారు.

Updated Date - 2022-09-30T17:57:00+05:30 IST