జల విలయం

ABN , First Publish Date - 2021-11-20T08:08:06+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బీభత్సం సృష్టించింది. భారీవర్షాలతో నదులు, వాగులు, కాల్వలు పొంగి ప్రవహించగా, చెరువు కట్టలు తెగిపోయి దక్షిణ కోస్తా, సీమ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలతో భారీగా పంట నష్టం ..

జల విలయం

  • బీభత్సం సృష్టించిన వాయుగుండం..
  • సీమను కుదిపేసిన అతి భారీ వర్షాలు
  • అనంతలో కుండపోత... భారీగా పంట నష్టం 
  • సోమశిలకు 5.25లక్షల క్యూసెక్కుల వరద 
  • శ్రీవారి మెట్టు నడక మార్గం ధ్వంసం 
  • తీరం దాటి బలహీనపడిన వాయుగుండం 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బీభత్సం సృష్టించింది. భారీవర్షాలతో నదులు, వాగులు, కాల్వలు పొంగి ప్రవహించగా, చెరువు కట్టలు తెగిపోయి దక్షిణ కోస్తా, సీమ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలతో భారీగా పంట నష్టం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున చెన్నై-పుదుచ్చేరి మధ్య వాయుగుండం తీరం దాటాక నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. తీరప్రాంతంలో గంటకు 65కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. అనంతపురం జిల్లా చిలమత్తూరులో చిత్రావతి, కుషావతి నదులు పరవళ్లు తొక్కాయి. బ్రహ్మసముద్రం మండలం వెస్ట్‌ కోడిపల్లిలో మూడు ఇళ్లు, కుందుర్పి మండలం రుద్రంపల్లిలో ఒక ఇల్లు కూలిపోయాయి. పామిడి పెన్నానదిలో చిక్కుకుపోయిన వ్యక్తిని పోలీసులు రక్షించారు. శెట్టూరు మండలం అనుంపల్లిలో ఇంటిగోడ కూలడంతో ములకలేటప్పకు తీవ్ర గాయాలయాయ్యయి. 


నెల్లూరు అతలాకుతలం 

నెల్లూరు జిల్లాలో పెన్నా, స్వర్ణముఖి, కాళంగి, కైవల్యా నదులతో పాటు వాగులు, వంకలు, కలుజులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువనుంచి సోమశిలకు 5.25 లక్షల క్యూసెక్కుల వరద చేరడంతో అన్ని గేట్లు ఎత్తి అంతే మోతాదులో దిగువకు నీటిని వదిలేశారు. గురువారం రాత్రి నుంచే లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గూడూరు, మనుబోలు వద్ద విజయవాడ-చెన్నై జాతీయ రహదారిపైకి వరద రావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. నెల్లూరు జిల్లా నుంచి కడప జిల్లాకు వెళ్లే అన్ని దారుల్లో రాకపోకలను నిలిపివేశారు. పెన్నా పరీవాహక ప్రాంతాల్లో ఏడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 


జలదిగ్భంధంలో చిత్తూరు 

వరద ప్రభావానికి చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు, పుంగనూరు, పలమనేరు పట్టణాల్లో ప్రధాన ప్రాంతాలు నీట మునిగే ఉన్నాయి. కడప-రేణిగుంట మార్గంలోని ఆంజనేయపురం వద్దనున్న బ్రిడ్జి తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చంద్రగిరి మండలం నరసింగాపురం రైల్వేగేటు వద్ద ఉధృతంగా కళ్యాణివాగు ప్రవహిస్తుడటంతో మదనపల్లె, రాయచోటి, పీలేరు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. తిరుచానూరు సమీపంలోని స్వర్ణముఖి నదికి ఆనుకుని ఉన్న మూడు ఇళ్లు ప్రవాహానికి కొట్టుకుపోయాయి. గురువారం రాత్రి లక్ష్మీపురం సర్కిల్‌లోని కాలువలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. బంగారుపాళ్యంలో కామాక్షమ్మ చెరువు కలుగు ప్రవాహంలో గల్లంతైన నలుగురిలో జయంతి(45) అనే మహిళ మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం లభ్యమైంది. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.


తిరుమలలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 8గంటల వరకు రికార్డు స్థాయిలో 190 మి.మీ వర్షపాతం నమోదైంది. పలమనేరు సమీపంలో కౌండిన్య నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెనలపై 4నుంచి 8 అడుగుల వరకు నీళ్లు చేరడంతో సుమారు 50 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. తిరుపతి రుయా ఆస్పత్రిలోని పలు వార్డుల్లోకి వరద నీరుచేరింది. తిరుచానూరు స్వర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతానికి ఆనుకుని నిర్మించిన ఓ ఇల్లు అందరూ చూస్తుండగానే నదిలో ఒరిగిపోయింది. 


కడప నగరం జలమయం

భారీ వర్షాలకు కడప నగరం పుట్లంపల్లి చెరువు ఉప్పొంగి పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. పెన్నా, కుందూ, పాపాఘ్ని, బాహుదా, మాండవ్య నదులు ఉప్పొంగాయి. మైలవరం డ్యాం మొత్తం గేట్లెత్తారు. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. లక్ష ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. 


నేడు, రేపు వర్షాలు 

వాయుగుండం శుక్రవారం ఉదయం చెన్నైకు దగ్గరలో కల్పకం సమీపాన తీరాన్ని దాటింది. ఆ తరువాత తీవ్ర అల్పపీడనంగా మారి తమిళనాడు, కర్ణాటక, రాయలసీమ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి మరింత బలహీనపడనుంది. కాగా, తీవ్ర అల్పపీడనం నుంచి కోస్తా మీదుగా ఒడిశా వరకు ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో రానున్న 48గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. 


ప్రాణాలు అరచేతిలో... 

చిత్రావతిలో చిక్కుకున్న 10 మంది 

అనంతపురం జిల్లాలో వర్షపు నీటితో చిత్రావతి నది పరవళ్లు తొక్కుతోంది. గురువారం తెల్లవారుజామున రాప్తాడు నియోజకవర్గం సీకేపల్లి మండలం వెల్దుర్తి మీదుగా గండికోటకు కారులో వెళుతున్న తమిళనాడుకు చెందిన నలుగురు వ్యక్తులు నదిలో చిక్కుకుపోయారు. వారు ప్రయాణిస్తున్న కారు ప్రవాహంలో కొట్టుకుపోయింది. నదిలోని చెట్టును పట్టుకొన్న ఆ నలుగురు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని 100కు ఫోన్‌ చేశారు. వారిని కాపాడేందుకు జేసీబీలో ముగ్గురు స్థానికులు, ఇద్దరు అగ్నిమాపక శాఖ సిబ్బంది, జేసీబీ డ్రైవర్‌ను పోలీసులు నదిలోకి పంపించారు. ఈలోగా ప్రవాహం ఉధృతి పెరగడంతో వారంతా నది మధ్యలో జేసీబీపైనే ఉండిపోయారు. జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి సమాచారం అందించడంతో ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకొని నదిలో చిక్కుకుపోయిన 10మందిని కాపాడారు. ??




తిరుమల మెట్లమార్గం ధ్వంసం

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు వెళ్లే కాలిబాట భారీ వర్షాలకు ధ్వంసమైంది. భారీగా కొండచరియలు విరిగిపడి నడకమార్గంలోకి దూసుకొచ్చాయి. కొండరాళ్లు, మట్టితో మెట్లమార్గం అస్తవ్యస్తంగా మారింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు మొదటి ఘాట్‌రోడ్డులోనే వాహనాల రాకపోకలకు అనుమతించారు. రెండో ఘాట్‌లో మట్టి, బండరాళ్లు, చెట్లను తొలగించారు. మఽధ్యాహ్నం నుంచి రాకపోకలకు అనుమతించారు. 




అనంతపురం జిల్లా సీకే పల్లి మండలం వెల్దుర్తిలో వరదలో చిక్కుకుపోయిన వ్యక్తిని హెలికాప్టర్‌ ద్వారా కాపాడుతున్న వైమానిక దళం

Updated Date - 2021-11-20T08:08:06+05:30 IST