8 గంటలపాటు ఎడతెరిపిలేని వర్షం

ABN , First Publish Date - 2021-12-31T13:42:28+05:30 IST

ఎడతెరిపిలేని కుండపోతవర్షం నగరాన్ని ముంచేసింది. నిరాటంకంగా కురిసిన వాన చెన్నైని స్తంభింపజేసింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన వర్షం.. రాత్రి 9 గంటల వరకు నిరాటంకంగా కురవడంతో నగరప్రజలు తీవ్ర ఇక్కట్ల

8 గంటలపాటు ఎడతెరిపిలేని వర్షం

- మళ్లీ మునిగిన చెన్నై 

- స్తంభించిన జనజీవనం 

- నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా


చెన్నై: ఎడతెరిపిలేని కుండపోతవర్షం నగరాన్ని ముంచేసింది. నిరాటంకంగా కురిసిన వాన చెన్నైని స్తంభింపజేసింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన వర్షం.. రాత్రి 9 గంటల వరకు నిరాటంకంగా కురవడంతో నగరప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. వర్షం కారణంగా ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి సహా ఐదుగురు మృతి చెందారు. సముద్రతీర ప్రాంతాల్లో నెలకొన్న ఉపరితల ఆవర్తనం కారణంగా బుధవారం నుంచే కొన్ని సముద్రతీర జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. అయితే గురువారం ఉదయం నుంచి మేఘావృతమై వున్న నగరంలో మధ్యాహ్నం 12 గంటలకు వర్షం మొదలైంది. మధ్యలో పది నిముషాలు తప్ప, రాత్రి 9 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. ఆ తరువాత కూడా పొద్దుపోయే వరకు వంతులవారీగా వర్షం కురుస్తూనే వుంది. కాగా గురువారం ఒక్కరోజే ఎంఆర్‌సీ నగర్‌లో 13 సెం.మీ, నుంగంబాక్కంలో 10 సెం.మీ, మీనంబాక్కంలో 5సెం.మీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఇదిలా వుండగా ఈ ఏడాది వర్షపాతం ఈ స్థాయిలో నమోదు కావడం 1996, 2005 తరువాతే ఇదే ప్రథమమని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. 


చెరువుల్లా వీధులు: ఇటీవలి కాలంలో వర్షాలు లేకపోవడంతో నగరంలో చాలాచోట్ల రోడ్లు, కాలువలకు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అయితే గురువారం హఠాత్తుగా కురిసిన వర్షంతో ఆయా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. సహజంగానే చిన్నపాటి వర్షానికే చెన్నై జలమయమవుతుండగా, ఈ భారీ వర్షంతో వీధులు చెరువుల్లా దర్శనమిచ్చాయి. అదే విధంగా రవాణా సైతం స్తంభించింది. ఎటు చూసినా మోకాళ్ల లోతు నీరు నిలిచివుండడంతో వాహనాలు కదలడం గగనమైపోయింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. ప్యారీస్‌, ట్రిప్లికేన్‌, అడయార్‌, వేళచ్చేరి, పోరూర్‌, వడపళని, అశోక్‌నగర్‌ తదితర ప్రాంతాలన్నీ పూర్తిగా స్తంభించాయి. వాహనం కదలడమే కష్టమైపోయింది. హఠాత్తుగా వచ్చిపడిన వర్షంలో ప్రజలు పలు ఇబ్బందుల పాలయ్యారు. విద్యాలయాలకు, ఆఫీసులకు, ఇతర పనులకు బయటకు వెళ్లిన వారు వర్షంతో ఇక్కట్లపాలయ్యారు. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు తోడవడంతో వృక్షాలు కూలాయి. 


విద్యుత్‌ సరఫరాకు అంతరాయం: భారీ వర్షం, వరదనీరు చేరడంతో నగరంలో పలుచోట్ల 50 శాతానికిపైగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. కొన్ని చోట్ల ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్‌ సరఫరా నిలిపేయగా, మరికొన్ని చోట్ల అవాంతరమేర్పడింది. తిరువొత్తియూరు, తండయార్‌పేట, కొరుకుపేట, టి.నగర్‌, కోడంబాక్కం, నుంగంబాక్కం తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. కాగా స్థానిక పులియాన్‌తోపుకు చెందిన మీనా (45) విద్యుదాఘాతంతో మృతి చెందింది. ఈమెతోపాటు మరో నలుగురు మృతిచెందారు. ఈవర్షం ధాటికి 500లకు పైగా వృక్షాలు నేలకూలాయి. ఈ సందర్భంగా వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.


ఆ జిల్లాల్లో మరో రెండు రోజులు..: కడలూరు, విల్లుపురం, మైలాడుతురై, పుదుచ్చేరి, కారైక్కాల్‌ తదితర జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించింది. శుక్రవారం ఈ జిల్లాల్లో ఉరుములుమెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశముంది, 1వ తేదీన ఈ మూడు జిల్లాలతో పాటు చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లోనూ చెదురుమదురు వర్షాలు పడే అవకాశమంది. మరికొన్ని చోట్ల అక్కడక్కడా తేలికపాటి, లేదా ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. ఇదిలా వుండగా మూడు రోజుల పాటు కన్నియాకుమారిలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడతాయని వాతావరణ అధికారులు తెలిపారు. అక్కడ 30 నుంచి 45 కి.మీటర్ల వరకూ పెనుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు. 



Updated Date - 2021-12-31T13:42:28+05:30 IST