Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 27 2021 @ 07:56AM

Chennaiలో మళ్లీ వర్ష బీభత్సం

- 17 జిల్లాలను ముంచెత్తిన వర్షం 

- స్తంభించిన జనజీవనం

- నగరంలో కుండపోత


చెన్నై: ఈశాన్య రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చటం, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తం గా గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. 17 జిల్లాల్లో కుండ పోతగా, 12 జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురిశాయి. తూత్తుకుడి జిల్లాల్లో వర్షాలకు సుమారు పదివేల ఇళ్లు నీట మునిగాయి. తక్కిన జిల్లా ల్లో జననివాస ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారుల్లో వర్షపునీరంతా ఏరులై ప్రవహించింది. వాహనాల రాకపోకలకు అంత రాయం ఏర్పడింది. పంటలన్నీ నీటమునిగాయి. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కన్నియాకుమారి, తిరునల్వేలి, విరుదునగర్‌, రామనాధపురం, శివగంగ, మదురై, తేని, దిండుగల్‌ కడలూరు, విల్లుపురం సహా 27 జిల్లాల్లో గురువారం అర్ధరాత్రి నుండి శుక్రవారం వేకువజాము వరకు భారీగా వర్షాలు కురిశాయి. దీంతో 27 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.


చెన్నైలో.... : రాజధాని నగరం చెన్నైలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు ఆగి భారీ వర్షం కురిసింది. ఇటీవల రెండు విడతలుగా కురిసిన భారీ వర్షాలు కలిగించిన కష్టాలనుండి తేరుకుంటున్న నగరవాసులు మళ్ళీ జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. చెన్నై, సబర్బన్‌ ప్రాంతాల్లోని నివాసాల్లో వర్షపు నీరంతా వరదలా చొరబడింది. నగరంలోని రహదారులన్నీ జలమయమవడంతో వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు వర్షం కారణంగా సకాలంలో విధులకు హాజరుకాలేకపోయారు. కేకేనగర్‌, వ్యాసార్పాడి, రాయపేట, రాయపురం, మైలాపూరు, అడయార్‌, ఆవడి, అంబత్తూరు, తాంబరం, వేళచ్చేరి, మధుర వాయల్‌, కోయంబేడు తదితర ప్రాంతాల్లో రెండడుగులమేర వర్షపునీరు ప్రవహించింది. విరుగంబాక్కంలోని సుబ్రమణియన్‌ వీధికి ఇరువైపులా ఉన్న ఇళ్లలో వర్షపునీరు చొరబడింది. వెస్ట్‌మాంబళంలోని ఆర్యగౌడ రోడ్డు పూర్తి నీటమునిగింది. టి.నగర్‌లోని నార్త్‌ ఉస్మాన్‌రోడ్డు, సౌత్‌ ఉస్మాన్‌రోడ్డు, హబీబుల్లా రోడ్డు, పాండీబజార్‌, వళ్లువర్‌కోట్టం, నుంగంబాక్కం ప్రాంతాల్లోని రహదారులు కూడా జలమయమయ్యాయి. ఇదే విధం గా కోడం బాక్కం, వడపళని, రంగరాజపురం ప్రాంతాల్లోని వీధుల్లో వర్షపు నీరు వరదలా ప్రవహించింది. తిరువొత్తియూరు సత్యమూర్తినగర్‌, కలైంజర్‌ నగర్‌, రాజాజీ నగర్‌, కార్గిల్‌నగర్‌, జ్యోతినగర్‌, చార్లె్‌సనగర్‌లోని పల్లపు ప్రాంతా లు జలమయమయ్యాయి. మనలి, కొరుక్కుపేట, తండయార్‌పేట, పూందమల్లి తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. కార్పొరేషన్‌ అధికారులు వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు.


తూత్తుకుడిలో...

తూత్తుకుడి జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. కార్పొరేషన్‌ పరిధిలో 2500 ఇళ్లు నీటమునిగాయి. బ్రైంట్‌నగర్‌లో సుమారు నాలుగువేల నివాసాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం ఆ ఇళ్లలో నివసిస్తున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అగ్నిమాపకసిబ్బంది, విపత్తుల నివారణ బృందం ప్రయత్నిస్తున్నారు. ఇదే విధంగా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రెండు వేలకు పైగా నివాసగృహాల చుట్టూ వర్షపునీరు ప్రవహిస్తోంది. నిత్యావసర సరకుల కోసం స్థానికులు బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఈ జిల్లాలో  వర్షాల కారణంగా రైళ్లు ఆలస్యంగా నడిచాయి. తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రిలో వర్షపునీరు చొరబడింది. ఎంపీ కనిమొళి శుక్రవారం మధ్యాహ్నం వర్షబాధిత ప్రాంతాల్లో పర్యటించారు.


తిరుచెందూరులో...

తిరుచెందూరులో కురిసిన భారీ వర్షాలకు అక్కడి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో నీరు చొరబడింది. రాత్రంతా అధికారులు ఆలయంలోని వర్షపు నీటిని మోటారు పంపులతో  తోడి బయటకు వదలిపెట్టారు. శుక్రవారం ఉదయం భక్తులను అనుమతించారు. 


కన్నియాకుమారిలో...

కన్నియాకుమారి జిల్లాల్లో కురిసిన వర్షాలకు 12గిరిజన గ్రా మాలు దీవులుగా మారాయి. ఆ జిల్లాల్లోని వాగులు, వంకలు, చెరువులు నీటితో నిండి పొంగి ప్రవహిస్తున్నాయి. తచ్చమలై, ముడవన్‌ పొట్రారై, కల్లారు సహా 12 గిరిజన గ్రామాలు జలమయమయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకూ 1050 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇదేవిధంగా నాగపట్టినం జిల్లాల్లో గురువారం రాత్రి నుండి కురిసిన వర్షాలకు సామంతాళ్‌పేట, స్వామి క్వార్టర్స్‌ ప్రాంతా ల్లోని 350 నివాసాలు నీటమునిగాయి. తిరుచ్చి, అరియలూరు, పుదుకోట, పెరంబలూరు జిల్లాల్లో రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు పల్లపు ప్రాంతాలు దీవులుగా మారాయి. తిరుచ్చి జిల్లాలో 285 ఎకరాల విస్తీర్ణంలో వరిపంటలు నీటమునిగాయి.


నేడు 10 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు...

భారీ వర్ష సూచన కారణంగా శనివారం పది జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఆ మేరకు కాంచీపురం, తిరువళ్లూరు, తూత్తుకుడి, తిరువారూరు, పుదుకోట, తిరునల్వేలి, నాగపట్టినం, అరియలూరు, పెరంబలూరు, తంజావూరు, జిల్లాల్లో విద్యా సంస్థలు శనివారం మూతపడను న్నాయని అధికారులు తెలిపారు. 


చెన్నై సహా 7 జిల్లాలకు భారీ వర్షసూచన 

ఈశాన్య రుతుపవనాల కారణంగా శనివారం చెన్నై సహా ఏడు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. చెన్నై, కాంచీపురం, తిరు వళ్లూరు, చెంగల్పట్టు, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇదే విధంగా కన్నియాకుమారి, రామనాధపురం, తిరుచ్చి, కరూరు, నీలగిరి, కోయంబత్తూరు జిల్లాల్లో కొని చోట్లు చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వివరించారు.

Advertisement
Advertisement