ఎల్లుండి వరకు వర్షాలే

ABN , First Publish Date - 2022-01-01T13:41:09+05:30 IST

బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 3వ తేది వరకు వర్షాలు కొన సాగుతాయని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది. గత నవంబరు నుంచి ప్రారంభమైన

ఎల్లుండి వరకు వర్షాలే

- ఇంకా వరద నీటిలోనే నగరం 

- 20 విమానాల రాకపోకల్లో జాప్యం


పెరంబూరు(చెన్నై): బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 3వ తేది వరకు వర్షాలు కొన సాగుతాయని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది. గత నవంబరు నుంచి ప్రారంభమైన ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి జలశయాల్లో నీటిమట్టం పూర్తి స్థాయికి పెరిగింది. తిరుచ్చి, తంజావూరు సహా డెల్టా జిల్లాల్లో చేతికం దాల్సిన పంట నీటమునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే, చెన్నై, నాగర్‌కోయిల్‌, కన్నియాకుమారి తదితర జిల్లాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు పలు అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో, రుతుపవనాల ప్రభావం తగ్గుతున్న సమయంలో బంగాళాఖాతం నుంచి వీస్తున్న గాలుల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంచు ప్రభావం అధికమైంది. ముఖ్యంగా, పశ్చిమ కనుమల సరిహద్దు జిల్లాల్లో ఉదయం 10 గంటల వరకు కురుస్తున్న దట్టమైన పొగ మంచుతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా గురువారం హఠాత్తుగా అతి భారీ వర్షం కురిసింది. పది గంటలు కొనసాగిన వర్షంతో మైలాపూర్‌, టి.నగర్‌, మెరీనా, పట్టినంబాక్కం, రాయపేట, మందవెల్లి, రాజా అన్నామలైపురం, ఎగ్మూర్‌, బ్రాడ్‌వే, కోయంబేడు, అన్నానగర్‌ తదితర ప్రాం తాల్లోని రోడ్లపై భారీగా నీరు చేరింది. దీంతో, భారీగా ట్రాఫిక్‌ స్తంభించి వాహనచోదకులు, విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  


మెరీనాలో అత్యధికంగా 24 సెం.మీ...

గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కురిసిన వర్షపాతం మెరీనా వద్ద అత్యధికంగా 24 సెం.మీ మేర నమోదైంది. ఆవడిలో 23 సెం.మీ, నుంగంబాక్కంలో 21, ఎంజీఆర్‌ నగర్‌లో 19.7, చెన్నై కలెక్టర్‌ కార్యాలయ ప్రాంతంలో 19.8, అంబత్తూర్‌లో 19.6, చెంబరంబాక్కంలో 19, అన్నా విశ్వవిద్యాలయంలో 18.9 సెం.మీ, అయనావరంలో 18, పెరంబూరు లో 16 సెం.మీ వర్షపాతం నమోదైంది.  ఇదే విధంగా రెడ్‌హిల్స్‌, కొరట్టూరు, కేళంబాక్కం ప్రాంతాల్లో 12 నుండి 10 సెం.మీల వర్షపాతం నమోదైంది.


మరో మూడు రోజులు...

రాష్ట్రంలో పలు జిల్లాల్లో మరో మూడు రోజులు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. రామనాథపురం, శివ గంగ, మదురై, దిండుగల్‌, పుదుకోట, నాగపట్టణం, కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు, చెన్నై, తిరువళ్లూర్‌, రాణిపేట తదితర జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.


4 జిల్లాలకు సెలవు...

భారీ వర్షాల కారణంగా నాలుగు జిల్లాలకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సెలవు ప్రకటించారు. గురువారం కురిసిన భారీ వర్షాలకు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో వరద పరిస్థితులు ఏర్పడటంతో ఆ జిల్లాలకు అత్యవసర సర్వీసులు మినహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. 


20 విమానాలు ఆలస్యం....

నగరంలో గురువారం కురిసిన వర్షం కారణంగా చెన్నై విమానాశ్రయం నుంచి బయల్దేరాల్సిన 7 విదేశీ సహా 20 విమానాలు ఆలస్యంగా బయల్దే రాయి. భారీవర్షం కారణంగా ట్రాఫిక్‌ స్తంభించడంతో విమాన పైలెట్లు, సిబ్బంది, సాంకేతిక నిపుణులు సకాలంలో విమానాశ్రయానికి చేరుకోలేక పోయారు. దీంతో, రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 1.30 గంటల వరకు 20 విమానాలు ఆలస్యంగా బయల్దేరాయి. చెన్నై నుంచి శ్రీలంక వెళ్లే నాలుగు విమానాలు, దుబాయ్‌, సింగపూర్‌, హాంకాంగ్‌ తదితర విదేశీ విమానాలు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, బెంగుళూరు, తిరువనంతపురం, భువనేశ్వర్‌, కోయంబత్తూర్‌ తదితర 13 నగరాలకు వెళ్లాల్సిన స్వదేశీ విమానాలు రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరి వెళ్లాయి.

Updated Date - 2022-01-01T13:41:09+05:30 IST