భారీ వర్షం.. నగరం జలమయం

ABN , First Publish Date - 2022-06-22T12:51:06+05:30 IST

నగరంలో మూడో రోజు కూడా వర్షం కురవడంతో పలు రోడ్లు జలమయమయ్యాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా చెన్నై సహా 21 జిల్లాల్లో వర్షాలు

భారీ వర్షం.. నగరం జలమయం

- రోడ్లపై నిలిచిన నీరు

- వాహనచోదకుల అవస్థలు


ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 21: నగరంలో మూడో రోజు కూడా వర్షం కురవడంతో పలు రోడ్లు జలమయమయ్యాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా చెన్నై సహా 21 జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని నగరం చెన్నైలో గత ఆదివారం నుంచి రాత్రి వేళల్లో ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురుస్తోంది. మంగళవారం ఉదయం ఆకాశం మేఘావృతంగా మారి మధ్యాహ్నం ఒక్కసారిగా దట్టమైన మబ్బులు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. కోడంబాక్కం, వడపళని, కోయంబేడు, ప్యారీస్‌, పెరంబూర్‌, టి.నగర్‌, సైదాపేట, మైలాపూర్‌, అన్నానగర్‌ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పాఠశాలలు వదిలే సమయం కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టి.నగర్‌ హబీబుల్లా రోడ్డుపై నీరు చేరడంతో వాహనచోదకులు అవస్తలు పడ్డారు. రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే పనులను కార్పొరేషన్‌ సిబ్బంది చేపట్టారు.


25 వరకు వర్షాలు...

తమిళనాడు ప్రాంతంలో నెలకొన్న ఉపరితల ద్రోణి కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ కేంద్రం తెలియజేసింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్‌, చెంగల్పట్టు, నీలగిరి, కోయంబత్తూర్‌, తిరుప్పూర్‌, తేని, దిండుగల్‌, ఈరోడ్‌, కృష్ణగిరి, ధర్మపురి, తిరుపత్తూర్‌, వేలూరు, రాణిపేట తదితర జిల్లాల్లో బుధవారం నుంచి 25వ తేది వరకు భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.

Updated Date - 2022-06-22T12:51:06+05:30 IST