Heavy rain: ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2022-08-03T18:44:30+05:30 IST

వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి వంకలు, వాగుల్లో పోటెత్తాయి. నదులు,

Heavy rain: ముంచెత్తిన వాన

- చెరువులుగా మారిన ఊళ్లు

- పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు, 

- జనజీవనం అస్తవ్యస్తం

- నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

- పలు ప్రాంతాల్లో బడులకు సెలవు

- తెగిపోయిన దారులు.. 

- వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనాలు

- తుంగభద్రకు పోటెత్తిన వరద.. 20 గేట్లు ఎత్తి నదికి నీరు విడుదల

- వంకలో రైతు గల్లంతు


బళ్లారి(బెంగళూరు), ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి వంకలు, వాగుల్లో పోటెత్తాయి. నదులు, చెరువులు నిండుకుండలా తొణికసలాడుతున్నాయి. పలుచోట్ల రోడ్లు, వంతెనలు తెగి రాకపోకలకు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తోంది. తుంగభద్ర(Tungabhadra) జలాశయానికి నీటి ఉధృతి పెరిగింది. 33 గేట్లలో 20 గేట్లు 4 అడుగుల ఎత్తి నీటిని నదికి వదిలేశారు. బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర, చిత్రదుర్గం, కలబురిగి, యాదగిరి(Yadagiri), జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. బళ్లారి- హైదరాబాద్‌, రాయచూరు- బళ్లారి, బళ్లారి- బెంగళూరుకు వాహనాలు రాకపోకలు ఆగిపోయాయి. విజయనగర జిల్లా గరగ నాగలాపుర గ్రామానికి చెందిన రైతు నాగప్ప (65) నీటిలో కొట్టుకు పోయి శవంగా తేలాడు. డోనేకల్లు వద్ద వంకలో లారీ నీట మునిగిపోయింది. హర్పనహళ్లి వద్ద వంక పక్కనే ఉండే గొర్రెలు నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. బళ్లారి గ్రామీణ(Bellary Rural) ప్రాంతాల్లో ఉండే అనేక గ్రామాల్లోకి నీరు చేరి పూర్తీగా మునిగిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. మేతకు పశువులు ఆడవికి వెళ్లలేదు. కొళగల్లు గ్రామం, కురగోడు, యర్రంగలి, బాదనహట్టి ప్రాంతానికి చెందిన ప్రజలు బళ్లారి వైపు వాగులు దాటుకుంటూ వస్తూ కనిపించారు. వాగు దాటేందుకు విద్యార్థులు, రైతులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నగరంలోని గొజ్జల వంక, గంగమ్మ వంక కూడా పొంగి ప్రవహించాయి. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలంతా నీటిలో మునిగిపోయాయి. దీంతో బళ్లారి, విజయనగర, రాయచూరు, కొప్పళ జిల్లాల్లో మంగళవారం పలు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు బళ్లారి, విజయనగర జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది. తాలూకాలోని ధర్మసాగర్‌లో పత్తి, మిర్చి, పంటలు ముంపునకు గురికాగా, హంపి , కడ్డిరాంపుర్‌లో అరటి తోటలు నీట మునిగాయి. హగరిబొమ్మనహళ్లి, హరపనహళ్లిలో ఇళ్లలోకి నీరు చేరింది. ఏపీఎంసీ మార్కెట్‌లో విక్రయానికి తెచ్చిన టమోట, క్యారెట్‌, వంగ, మిర్చి తదితర కూరగాయలు ఉదయం కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయాయి. మార్కెట్లో అమ్మక దారులు తీవ్ర ఇబ్బందులు పడగా పంటలను తీసుకొచ్చిన రైతులు భారీ న ష్టాన్ని చవిచూశారు. వానల వల్ల పంటలు, రోడ్లు, భవనాలు, ఇళ్లు, పశువులు, ఇతర నష్టంపై వివరాలు సేకరిస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు(Collectors) తెలిపారు. మంగళవారం నమోదయిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. బళ్లారిలో 72.6 మిల్లీ మీటర్లు,  సండూరు 61.4, సిరుగుప్ప 74.2, కురుగోడు 56.6, కంప్లి 44.6, హడలిగి 50.8, హెచ్‌బీ హళ్లి 67.8, హొస్పేట్‌ 38.6, హెచ్‌పీ హళ్లి 33.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయినట్లు  అధికారులు ప్రకటించారు. 


Updated Date - 2022-08-03T18:44:30+05:30 IST