కోస్తాలో Heavy rains

ABN , First Publish Date - 2022-07-09T00:07:35+05:30 IST

దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాకు ఆనుకుని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది.

కోస్తాలో Heavy rains

విశాఖపట్నం: దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాకు ఆనుకుని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి వైపునకు ఒంగి ఉంది. ఇంకా గుజరాత్‌ నుంచి కర్ణాటక వరకు తీర ద్రోణి, ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాపై నుంచి తూర్పు, పడమర ద్రోణి విస్తరించాయి. అలాగే రాజస్థాన్‌ నుంచి మధ్య భారతం, ఉత్తర కోస్తాలో కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవనద్రోణి కొనసాగుతోంది. వీటన్నింటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున గురువారం కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి.


కోస్తాలో అక్కడక్కడా భారీపడ్డాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కోస్తాలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు, పడమర ద్రోణి, రుతుపవనద్రోణి దక్షిణాది వైపున వున్నందున ఈనెల 12వ తేదీ వరకు కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంబడి 40 నుంచి 50, అప్పుడప్పుడు 60 కిలోమీటర్లు వేగంతో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Updated Date - 2022-07-09T00:07:35+05:30 IST