కుంభవృష్టి...

ABN , First Publish Date - 2021-07-22T05:30:00+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కుంభవృష్టిగా కురుస్తున్నాయి.

కుంభవృష్టి...
పెంటపాడు–బిళ్లగుంట రహదారిలో చెరువులా మారిన నాట్లు వేసిన చేలు

మూడో రోజు ఈదురుగాలులతో వాన జోరు

పొంగుతున్న వాగులు.. కూలిన చెట్లు.. రాకపోకలకు అంతరాయం

6,986 హెక్టార్లలో నారుమళ్లు, నాట్లు మునక

పల్లపు ప్రాంతాలు జలమయం ...అధ్వానంగా రహదారులు

నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు.. గ్రామాల్లో చీకట్లు

విలీన మండలాలకు ముంపు భయం

తెలంగాణ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల

పెరుగుతున్న గోదావరి వరద..ఆందోళనలో ప్రజలు


ఏలూరు సిటీ, జూలై 22 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కుంభవృష్టిగా  కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు ఆగకుండా పడటంతో జనజీవనం స్తంభించింది. ఈదురుగాలులకు చెట్టు కొమ్మలతో పాటు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలెం వద్ద జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహించి రాకపోకలు బంద్‌ అయ్యాయి. కుక్కునూరు మండలంలో గుండేటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం వద్ద రహదారికి అడ్డంగా పెద్ద చెట్టు పడిపోవటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 


దెబ్బతిన్న పంటలు.. స్తంభించిన జన జీవనం

భారీ వర్షాలకు 31 మండలాల్లోని 245 గ్రామాలలో 6,986 హెక్టార్లలో వరి నారుమళ్లు, నాట్లు వేసిన పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. ఇందులో 1,475 హెక్టార్లలో నారుమళ్లు, 5,511 హెక్టార్లలో నాట్లు ఉన్నాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిస్తే ఇవి పూర్తిగా దెబ్బ తినే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఈదురుగాలులకు పలుచోట్ల అరటి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. మరోవైపు ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జన జీవనం స్తంభించింది. పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయి ఆయా ప్రాంతాలు చిత్తడి చిత్తడిగా తయార య్యాయి. ఏలూరుతోపాటు భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, తణుకు, నరసాపురం, పాల కొల్లు చింతలపూడి, ఆకివీడు ప్రాంతాల్లో డ్రెయిన్లు పొంగు తున్నాయి. పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎడతె రపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ద్వారకా తిరుమలలో భక్తులు సంఖ్య తగ్గింది. కొవ్వూరులో అధ్వానంగా వున్న రహదారులు మరింత అధ్వాన్నంగా మారాయి. నిడదవోలు మండలం శెట్టిపేట అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి వద్ద భారీ వర్షాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 


విద్యుత్‌కు అంతరాయాలు

ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు విద్యుత్‌ శాఖకు భారీ నష్టం వాటిల్లింది.  20 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు చాలా గ్రామాల్లో విద్యుత్‌ నిలిచిపోవడంతో 100 విద్యుత్‌ ఫీడర్ల పరిధిలో సరఫ రాకు అంతరాయం ఏర్పడింది. నాలుగు 33 కేవీ విద్యుత్‌ లైన్లు బ్రేక్‌డౌన్‌ అయ్యాయి. 11 కెవి విద్యుత్‌ లైన్లు పరిఽధిలో 25చోట్ల బ్రేక్‌డౌన్‌ అయినాయి. లక్ష రూపాయల వరకు నష్టం వాటి ల్లింది. విద్యుత్‌ సరఫరాను వెంటనే పునరుద్ధరించినట్లు ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎస్‌ జనార్దనరావు తెలిపారు. 


వర్షపాతం వివరాలు

గత 24 గంటల్లో నిడమర్రు మండలంలో అత్యధికంగా 104.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో సరాసరి వర్షపాతం 62.8 మి.మీ. కురిసింది. 26 మండలాల్లో 60 మి.మీకు పైగాను ఎనిమిది మండలాల్లో 50 మి.మీకు పైగా నమోదయ్యాయి. గణపవరం 96.8, పాలకోడేరు 92.8, తాడేపల్లిగూడెం 92.4, ఉండి 90.4, భీమవరం 90.2, ఆచంట 90, ఆకివీడు 87.2, పాలకొల్లు 86.2, పెనుగొండ 82.4, పోడూరు 82, పెంటపాడు 78.4, పెను మంట్ర 77.2, ఇరగవరం 74.8, వీరవాసరం 71.4, అత్తిలి 70.4, తణుకు 69.4, బుట్టాయిగూడెం 68.8, కొయ్యలగూడెం 68.8, వేలేరుపాడు 68.6, దెందులూరు 68.2, పెరవలి 65.2, ఉంగుటూరు 62.4, పెదవేగి 62.2, యలమంచిలి 60.8, నిడదవోలు 60, కాళ్ళ 57.4, నల్లజర్ల 57.2, ఏలూరు 56.4, భీమడోలు 54, గోపాలపురంలో 53.4, లింగపాలెం 53, మొగ ల్తూరు 50.8, నరసాపురం 50.4, దేవరపల్లి 48.2, చింతల పూడి 47, ద్వారకా తిరుమల 45.4, చాగల్లు 44.4, ఉండ్రా జవరం 44.4, జంగారెడ్డిగూడెం 44.2, పెదపాడు 43.2, జీలుగుమిల్లి 42.8, తాళ్ళపూడి 38.6, పోలవరం 38, కొవ్వూరు 33.4, కామవరపుకోట 33.2, టి.నరసాపురం 30.2, కుక్కునూరు 25.6 మి.మీ వర్షపాతం నమోదైంది.


విలీన మండలాలకు ముంపు భయం

వేలేరుపాడు/పోలవరం, జూలై 22 : పోలవరం కాఫర్‌ డ్యాం నిర్మాణంతో ఇప్పటికే బ్యాక్‌ వాటర్‌ వెనక్కి ఎగతన్ను తుండగా.. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదా వరి నదికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో విలీన మండలాలకు వేలేరుపాడు, కుక్కునూరుకు వరద ముప్పు పొంచి ఉంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతు న్నారు. పోలవరం స్పిల్‌ వే నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే 1,08,606 క్యూసెక్కుల వరద జలా లను స్పిల్‌వే నుంచి విడుదల చేయగా, ధవళేశ్వరం వద్ద 175 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నప్పటికీ ప్రాజెక్టు దిగువ, ఎగువన గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.


 నేడు.. రేపు భారీ వర్షాలు

అల్పపీడనం ఉధృతంగా ఉండటంతో రాబోయే రెండు రోజులపాటు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురు స్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలు ఉండటంతో మత్స్యకా రులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. 


జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు

భారీ వర్షాలు, వరదల వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు జిల్లాలో ప్లడ్‌ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేశారు. 

కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నెంబరు

స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ 833–390–5022

జిల్లా కంట్రోల్‌ రూమ్‌ 1800–233–1077

సబ్‌ కలెక్టర్‌, నరసాపురం  08814–276699

ఆర్డీవో, జంగారెడ్డిగూడెం 08821–223660

ఆర్డీవో, కొవ్వూరు 08813–231488

ఆర్డీవో, ఏలూరు 08812–232044

ఆర్డీవో, కుక్కునూరు 08821–232221








Updated Date - 2021-07-22T05:30:00+05:30 IST