జిల్లాకు భారీ వర్షసూచన

ABN , First Publish Date - 2021-07-23T05:28:20+05:30 IST

కోస్తా ప్రాంతంలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం సాయంత్రం అధికారులతో మాట్లాడారు. ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు.

జిల్లాకు భారీ వర్షసూచన
పడవను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న మత్స్యకారులు

నష్టం జరగకుండా ముందస్తు చర్యలు

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ 

కలెక్టరేట్‌/ భోగాపురం, జూలై 22:

కోస్తా ప్రాంతంలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా గురువారం సాయంత్రం అధికారులతో మాట్లాడారు. ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టాలు చోటుచేసుకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమాచార వ్యవస్థ దెబ్బతినకుండా చూడాలని చెప్పారు. ఎక్కడైనా కమ్యూనికేషన్‌ దెబ్బతింటే వెంటనే పునరుద్ధరించాలన్నారు. విద్యుత్‌ స్తంభాలు పడిపోవడం, వైర్లు తెగిపోవడం వంటివి చోటు చేసుకునే అవకాశం ఉందని, ఆ శాఖ అధికారులు ముందుగా తనిఖీ చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను తరలించేందుకు పునరావాస కేంద్రాలను ముందుగా గుర్తించి సిద్ధం చేయాలని చెప్పారు. కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జేసీ కిషోర్‌ కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ భావ్న, డీఆర్‌వో గణపతిరావు, ఆర్‌డీవో బీహెచ్‌ భవానీ శంకర్‌ తదితరులు ఉన్నారు. 

తీరంలో హెచ్చరికలు

 మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని తహసీల్దార్‌ జి.కల్పవల్లి హెచ్చరించారు. గురువారం ఆమె తీరప్రాంత గ్రామాలైన ముక్కాం, చేపలకంచేరులో పర్యటించి సూచనలు ఇచ్చారు. మత్స్యకారులంతా ఇంటి దగ్గరే ఉండాలన్నారు. వేట సామాగ్రి కూడా  భద్రపరుచుకోవాలని సూచించారు. ఆమె వెంట ఆర్‌ఐ రవికుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ దేవసురేష్‌, వీఆర్వో డి.కృష్ణబాబు,  ఉన్నారు. 

అప్రమత్తమైన మత్స్యకారులు

వర్షాలు అధికంగా పడతాయని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో మత్స్యకారులు వేట సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించుకొనే పనిలో నిమగ్నమయ్యారు. పడవలను వేరొక స్థలానికి తరలిస్తున్నారు. వలలను పోగుగా వేసి తాళ్లతో కడుతున్నారు. 


Updated Date - 2021-07-23T05:28:20+05:30 IST