మహారాష్ట్రను ముంచెత్తుతున్న వర్షాలు

ABN , First Publish Date - 2020-07-05T01:37:29+05:30 IST

మహారాష్ట్రలో వరుసగా రెండో రోజు కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముంబైలోని హిండ్‌మట, పారెల్, దాదర్, కింగ్స్ సర్కిల్, సియాన్ ..

మహారాష్ట్రను ముంచెత్తుతున్న వర్షాలు

ముంబై: మహారాష్ట్రలో వరుసగా రెండో రోజు కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముంబైలోని హిండ్‌మట, పారెల్, దాదర్, కింగ్స్ సర్కిల్, సియాన్ వంటి పలు ప్రాంతాలు అడుగు నుంచి రెండడుగుల వరకూ నీటిలో చిక్కుకున్నాయి. శాంతాక్రుజ్, గొరెగావ్, మలద్, కాండివలి, బోరివలి, ఇతర పశ్చిమ ప్రాంత శివార్లలో కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ శనివారంనాడు ముందస్తు హెచ్చరికలు చేసింది. పాల్ఘర్, ముంబై, తానే, రాయిగఢ్ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని కూడా తెలిపింది.


కాగా, తాజా వర్షాలతో శనివారం ఉదయం నుంచి ముంబై శివార్లు, థానేలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దక్షిణ ముంబైలో ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ 66 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్టు కొలబా వాతావరణ కేంద్రం తెలపగా, శాంతాక్రుజ్ వాతావరణ కేంద్రం 111.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు పేర్కొంది. కాగా, తీర ప్రాంతానికి దూరంగా ఉండాలని ప్రజలను బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తం చేసింది. మరోవైపు, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటకు వచ్చే సాహసం చేయవద్దని ముంబై పోలీసులు సూచించారు.

Updated Date - 2020-07-05T01:37:29+05:30 IST