4జిల్లాలకు భారీ వర్షసూచన

ABN , First Publish Date - 2021-05-17T13:12:29+05:30 IST

అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన ‘తౌక్తే’ తుపాను ప్రభావం కారణంగా తేని, నీలగిరి, కోయంబత్తూరు, కన్నియాకుమారి జిల్లాల్లో నాలుగురోజులపాటు భారీగా వర్షాలు కురుస్తాయని...

4జిల్లాలకు భారీ వర్షసూచన

10 మంది జాలర్ల గల్లంతు

చెన్నై: అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన ‘తౌక్తే’ తుపాను ప్రభావం కారణంగా తేని, నీలగిరి, కోయంబత్తూరు, కన్నియాకుమారి జిల్లాల్లో నాలుగురోజులపాటు భారీగా వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం సంచాలకుడు ఎన్‌. పువియ రసన్‌ ప్రకటించారు. అరేబియా సముద్రంలో రెండు రోజులకు ముందు కేంద్రీకృతమైన వాయుగుండం శనివారం సాయంత్రం ‘తౌక్తే’ తుపానుగా తీవ్రరూపం దాల్చిందని, ఈ నెల 19న ఆ తుపాను గుజరాత్‌ తీరాన్ని దాటే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఈ తుఫాను ప్రభావంతో ఆదివారం ఉదయం నీలగిరి, కోయంబత్తూరు, తేని జిల్లా చెరుదుముదురుగా వర్షాలు కురిశాయి. పశ్చిమ కనుమలకు చేరువుగా ఉన్న జిల్లాల్లోనూ తేలికపాటిగా వర్షాలు కురిశాయి. ఇదే విధంగా పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం పెనుగాలులతో వర్షాలు కురిశాయి.


జాలర్లకు హెచ్చరిక

‘తౌక్తే’ తుపాను ప్రభావం కారణంగా సముద్రతీర జిల్లాల్లో గంటకు 145 నుంచి 150 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం వుండటంతో జాలర్లు  చేపలవేటకు వెళ్ళకూడదని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. నీలగిరి జిల్లాలో ఈనెల 20 వరకూ భారీగా వర్షాలు కురుస్తాయని అధికా రులు పేర్కొన్నారు. ఘాట్‌రోడ్లలో మట్టి చరియలు, బండరాళ్లు విరిగిపడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. గత రెండు రోజులుగా కన్నియాకుమారి జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. చిన్నముట్టం తదితర జాలర్ల కుప్పాలలోని గుడిసెల్లోకి సముద్రజలాలు చొరబడ్డాయి.


కొట్టుకుపోయిన నాగై జాలర్లు

ఇదిలా వుండగా సముద్రంలో చేపలవేటకు వెళ్ళిన నాగపట్టినం జిల్లాకు చెందిన పదిమంది జాలర్లు గల్లంతయ్యారని జాలర్ల సంఘం ప్రతినిధులు తెలిపారు. గల్లంతైన జాలర్లు కొచ్చిన్‌ సమీపంలోని నడిసముద్రంలో కొట్టు మిట్టాడుతున్నారని, వారిని సురక్షితంగా తీరానికి చేర్చాలని జాలర్ల సంఘం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొచ్చి హార్బర్‌ నుంచి నాగపట్టినం సామంతాన్‌పేటకు చెందిన మణికంఠన్‌కు చెందిన మరపడవలో పదిమంది జాలర్లు చేపలవేటకు వెళ్ళి శనివారం తీరానికి తిరిగి వస్తుండగా పెనుగాలులకు కొట్టుకుపోయారని, వారిని త్వరగా తీరానికి చేర్చేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. 

Updated Date - 2021-05-17T13:12:29+05:30 IST