కుండపోత

ABN , First Publish Date - 2022-08-15T05:42:25+05:30 IST

అల్పపీడన ప్రభావంతో శనివారం అర్ధరాత్రి నుంచే జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

కుండపోత
గరుగుబిల్లి: నాగావళి వరద ప్రవాహాన్ని స్పిల్‌వే గేట్లు ద్వారా దిగువకు విడిచిపెడుతున్న దృశ్యం

జిల్లాపై అల్పపీడన ప్రభావం

అంతటా భారీ వర్షం

లోతట్టు ప్రాంతాలు జలమయం

ముంపులో పొలాలు 

ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు

 పార్వతీపురం - ఆంధ్రజ్యోతి/పార్వతీపురం రూరల్‌/కొమరాడ/గరుగుబిల్లి/భామిని, ఆగస్టు 14 :  అల్పపీడన ప్రభావంతో శనివారం అర్ధరాత్రి నుంచే జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదులు, చెరువులు, వాగులు, వంకలు జలకళను సంతరించు కున్నాయి. కొన్నిచోట్ల విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పార్వతీపురం మండలంలో  లచ్చిరాజు పేట, తాళ్లబురిడి గ్రామాలకు ఆనుకుని ఉన్న సాకిగెడ్డ ఉప్పొంగి ప్రవహిస్తోంది.  దీనివల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.  పంట పొలాల కూడా ముంపునకు గురయ్యాయి. ఎల్‌ఎన్‌ పురం, తదితర గ్రామాల్లో చెరువులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. అయితే ఎప్పుడు ఏ చెరువుకు గండి పడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాతో పాటు ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు కొమరాడ మండల పరిధిలో నాగావళి, జంఝావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.  తోటపల్లి ప్రాజెక్ట్‌ పరిధిలో ముంపునకు గురైన పాత కళ్లికోట, దుగ్గి గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  గరుగుబిల్లి మండల పరిధిలోని  నాగావళి నదికి  పైనుంచి 28,694  క్యూసెక్కులకు పైగా వరద నీరు  చేరగా,  ఎనిమిది స్పిల్‌వే గేట్ల నుంచి 33 వేల క్యూసెక్కులను దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు.  కుడి, ఎడమ ప్రధాన కాలువల నుంచి 1520 క్యూసెక్కుల నీటిని సరఫరా చేశారు.  ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను ప్రస్తుతం 104 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. అధికారులు నదీ తీర ప్రాంతవాసులను అప్రమత్తం చేశారు. భామిని మండల పరిధిలో వంశధార నది కూడా వరదనీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది.  30 వేల క్యూసెక్కులు నీరు చేరగా,   కాట్రగడ వద్ద   హెడ్‌ రెగ్యులేటర్‌, వరద కాలు ద్వారా మూడువేల క్యూసెక్కుల నీటిని హిరమండలం జలాశయానికి తరలించినట్లు వంశ ధార డీఈ భవానీ శంకర్‌ తెలిపారు.  

   

Updated Date - 2022-08-15T05:42:25+05:30 IST