భారీ వర్షం..తడిసిన ధాన్యం

ABN , First Publish Date - 2020-09-30T06:15:54+05:30 IST

వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. అనుకోకుండా వర్షం పడటంతో స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఆరబోసిన

భారీ వర్షం..తడిసిన ధాన్యం

ఆందోళనలో రైతాంగం


(వనపర్తి/గద్వాల-ఆంధ్రజ్యోతి)/వనపర్తి (పురపాలకం)/గద్వాల క్రైం, సెప్టెంబరు 29 : వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. అనుకోకుండా వర్షం పడటంతో స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఆరబోసిన మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయింది. యార్డులో ప్లాట్‌ఫాంలు సరిగా లేని కారణంగా కొంతమంది రైతుల ధాన్యం వరదలో కొట్టుకుపోయింది.


సాధారణంగా వనపర్తి మార్కెట్‌ యార్డుకు మంగళవారం సెలవు. ఉదయం నుంచి ఎండ కాయడంతో రైతులు మార్కెట్‌కు తెచ్చిన మొక్కజొన్నలను ఆరబోశారు. అంతలోనే ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురవడంతో వాటిని కుప్పపోసేలోపే తడిసిపోయింది. బుధవారం నష్టం విలువ అంచనా వేసే అవకాశాలున్నాయి. అయితే, ఈ ఏడాది మొక్కజొన్న సాగు చేయొద్దని ప్రభుత్వం సూచించినా, అక్కడక్కడ రైతులు తమ భూములు మొక్కజొన్నకు అనుకూలమనే ఉద్దేశంతో సాగుచేశారు. ఇక వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లు నదులను తలపించాయి. సుమారు అరగంట పాటు భారీ వర్షం కురిసింది.


గద్వాలలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో దాదాపు రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో పట్టణం జలమయమైంది. బలమైన గాలులు వీచడంతో ప్రభుత్వ బాలికల పాఠశాల వద్ద ఓ భారీ వృక్షం ప్రధన రహదారిపై విరిగిపడింది. కాగా, ఆ సమయంలో చెట్టు కింద ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

Updated Date - 2020-09-30T06:15:54+05:30 IST